ఇది రాజకీయ గెరిల్లా యుద్ధం

5 Jan, 2021 04:17 IST|Sakshi

‘పోలీస్‌ డ్యూటీ మీట్‌’లో ముఖ్యమంత్రి జగన్‌

చెడ్డపేరు తెచ్చే యత్నాలను తిప్పికొడదాం

‘ఇగ్నైట్‌’ మీలో స్ఫూర్తి రగిలించాలి

సాక్షి, అమరావతి: మెరుగైన పరిపాలన దిశగా ప్రభుత్వంతో కలసి పోలీస్‌శాఖ అడుగులు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలన్నారు. తిరుపతిలో నాలుగు రోజుల పాటు జరిగే ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ తొలి డ్యూటీ మీట్‌ను సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించి మాట్లాడారు. ఆలోచనలు, పనితీరు మెరుగు పరచుకునేందుకు ‘ఇగ్నైట్‌’ పేరుతో పోలీస్‌శాఖ దీన్ని తొలిసారిగా నిర్వహిస్తోంది. డ్యూటీ మీట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఒక పద్ధతి ప్రకారం పన్నాగంతో కుట్రలు పన్నుతుంటే మన ఆలోచనలు కూడా మారాలి. ఇలాంటి రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్‌ (యుద్ధం) ఎలా డీల్‌ చేయాలో, టెక్నాలజీని ఉపయోగించుకు ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. మీ ఇగ్నైట్‌ కార్యక్రమాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి సంప్రదాయానికి నాంది పలుకుతున్నాం. ఏటా టాలెంట్‌ను ప్రదర్శించడం, కలసి చర్చించడం ద్వారా మన సామర్థ్యం పెరుగుతుంది’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

స్ఫూర్తి రగిలించేలా..
‘ఇగ్నైట్‌ అంటే రగిలించడం అని అర్థం. ఇది పోలీస్‌ శాఖలో మరింత స్ఫూర్తిని రగిలించాలి. పోలీసుశాఖను సెన్సిటైజ్‌ చేసే దిశగా, ఆలోచనను రగిలించే కార్యక్రమాలు ఏటా జరిగితే సమర్థత, అవగాహన పెరుగుతుంది. దురదృష్టవశాత్తు గత ఆరు సంవత్సరాలుగా ఇది జరగలేదు. డ్యూటీ మీట్‌లో పోలీస్‌ సిబ్బంది నైపుణ్యాలు. వివిధ క్రైం సీన్‌లను పరిశీలించి దర్యాప్తును ఎలా ముందుకు తీసుకువెళతారో ప్రదర్శిస్తారు. సైబర్‌ క్రైౖం, మహిళలపై నేరాలు, టెక్నాలజీ వినియోగంపై చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా ఐఐటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలు టెక్నాలజీపై పోలీస్‌ శాఖకు సహాయ సహకారాలు అందించేందుకు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాం. పనితీరు విషయంలో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాలి. ఇంకా మెరుగ్గా పని చేయాలంటే ఏం చేయాలి? మన వద్దకు వచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా వున్నారా? పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారు సంతోషంగా వున్నారా? వారి ముఖంలో చిరునవ్వును చూడగలుగుతున్నామా? అనే అంశాలను పరిశీలించుకోవాలి.

కలియుగంలో క్లైమాక్స్‌ పరిస్థితులు...
గతంలో పోలీసు శాఖ వస్తువులు ఎత్తుకుపోయే దొంగతనాలను విచారించేది. ఇళ్లకు తాళాలు పగలకొడితే ఆ దొంగలను పట్టుకునేందుకు కేసులు పెట్టి విచారించేది. కానీ ఈ రోజు పరిస్థితులు అలా లేవు. కాలాలు మారాయి. సైబర్‌ నేరాలు వచ్చాయి. సోషల్‌ మీడియా పేరుతో యథేచ్ఛగా అబద్ధాలు చెబుతున్న యుగంలో ఉన్నాం. వైట్‌ కాలర్‌ నేరాలు పెరిగిపోయాయి. ఈ కలియుగంలో క్లైమాక్స్‌కు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు