సంక్షేమమే శ్వాసగా..

24 Feb, 2021 03:38 IST|Sakshi

మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఇంటింటికీ చేరుతున్న పథకాలతో ప్రజల్లో సంతృప్తి

పంచాయతీ ఫలితాలే తార్కాణం.. ఈ స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలి

ప్రతి పేదవాడి అవసరాలు తెలుసుకోవాలి

సంక్షేమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కుయుక్తులు.. విష ప్రచారాన్ని ఎండగట్టాలి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రతిబింబించిందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే పురపాలక, పరిషత్‌ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు. శాశ్వత విజయానికి ప్రజల విశ్వాసం పొందడమే నేటితరం రాజకీయమని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ వివరాలివీ..

ప్రజలే మనకు శ్రీరామరక్ష..
పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం విజయంతో వైఎస్సార్‌సీపీకి జనం మద్దతివ్వడానికి సుపరిపాలనే కారణమని పలువురు మంత్రులు ప్రస్తావించారు. ఏడాదిన్నరగా అమలవుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విశ్వసనీయతే కొలమానంగా సరికొత్త రాజకీయాలు తెచ్చామని, ప్రజలను ఓటుబ్యాంకుగా భావించే వారెవరూ ప్రజా మద్దతు కూడగట్టలేరన్న భావనను సీఎం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వాన్ని ఎంతకైనా తెగించి కాపాడుకునేందుకు సిద్ధమవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని అన్ని వేళలా గుర్తించాలని సూచించారు. 

విష ప్రచారాన్నే నమ్ముకున్న విపక్షం 
ఏ ఎన్నికల్లోనైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సంక్షేమ పథకాలే వైఎస్సార్‌సీపీ బ్రహ్మాస్త్రాలుగా మంత్రివర్గం భావించింది. పథకాల అమలులో లోపాలను గుర్తించే సత్తాలేని టీడీపీ విష ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని సీఎం గుర్తు చేశారు. ఈ దిశగా అన్ని వ్యవస్థలను వాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోదని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవడం లాంటి కుట్రలు జరిగాయన్నారు. సున్నితమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటూ టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.

విపక్షం విమర్శలను తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో ప్రజలకు సంక్షేమ ఫలాలను నిబద్ధతతో అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే తప్పుడు ప్రచారం చేసే విపక్షం వైఖరిని ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చిందని, టీడీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని చెప్పారు. 

పథకాలే ఊపిరి..
పేదలు, బడుగు వర్గాల స్థితిగతులను మార్చే దిశగా తెస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పథకాల రూపకల్పనతోనే సరిపోదని క్షేత్రస్థాయిలో అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇంటి వద్దకే చేరవేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వాలకు భిన్నంగా సాగుతున్న పారదర్శక పాలనను స్వాగతిస్తున్నారని తెలిపారు. దీన్ని దెబ్బతీసేందుకు విపక్షం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు మరింత కృషి చేయాలన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సమస్యలొస్తే తక్షణం పరిష్కరించాలన్నారు. సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. హామీలు నిలబెట్టుకోవడంలో వైఎస్సార్‌సీïపీ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలే ప్రశంసిస్తున్న కారణంగా విపక్షం వేలెత్తి చూపలేక
పోతోందన్నారు.  

మరిన్ని వార్తలు