జీ–20 దేశాల సన్నాహక సదస్సు: ఎలాంటి బాధ్యతైనా సిద్ధమే

6 Dec, 2022 03:41 IST|Sakshi
జీ–20 సన్నాహక సదస్సు సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌తో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ

జీ–20 దేశాల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌

అంతర్జాతీయ సమాజం దృష్టంతా మనవైపే.. 

పార్టీలకతీతంగా ఏకతాటిపై నిలుద్దాం.. ఎన్ని విభేదాలున్నా 

ఈ సమయంలో రాజకీయ వ్యాఖ్యలు సరికాదు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జీ–20 దేశాల సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో నిర్వహణ, సన్నాహాలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సదస్సు విజయవంతానికి రాష్ట్రం తరపున అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జీ–20 దేశాల సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరయ్యారు.
రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, సీఎం వైఎస్‌ జగన్, తదితరులు 

జీ–20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల ఈ సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం మన దేశం వైపు చూస్తున్న తరుణంలో పార్టీలకతీతంగా అందరూ ఒకేతాటిపైకి రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో రాజకీయ కోణాల్లో వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, వాటిని మనవరకే పరిమితం చేసి జీ–20 సదస్సును విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

అనంతరం సీఎం జగన్‌ రాష్ట్రపతి భవన్‌ నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకొని విజయవాడ బయల్దేరారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి జగన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి,  వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.   

మరిన్ని వార్తలు