ఇళ్ల నిర్మాణ వేగం పెరగాలి

11 Mar, 2021 03:35 IST|Sakshi
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి జ్ఞాపికను అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నెలాఖరులోగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలి

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో పట్టణ తరహా మౌలిక వసతులు కల్పించాలి

గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, ఆ మేరకు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టేందుకు అవసరమై నీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించడంపై నిర్లక్ష్యం వహించకుండా వాటిపై వెంటనే దృష్టి సారించాలని సూచించారు. ఇళ్లు కట్టు కోవడానికి కరెంటు, నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కన్పించకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. 

వసతుల కల్పనపై నివేదిక ఇవ్వండి
కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం తదితర వసతుల కల్పనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమగ్రంగా చర్చించారు. పట్టణాల్లో ఏవిధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామో అదే తరహాలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లోనూ వసతులు కల్పించాలని చెప్పారు. ఆ మేరకు తీసుకునే చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. తామే ఇళ్లు నిర్మించుకుంటామని ఆప్షన్‌ ఎంచుకున్న లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని చెప్పారు. స్టీలు, సిమెంట్, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కొత్త కాలనీల రూపు రేఖలు, అక్కడ చేపట్టనున్న నిర్మాణాలు, కల్పిస్తున్న వసతులు, డిజైన్లపై రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

  

మరిన్ని వార్తలు