Andhra Pradesh: మత్తు.. చిత్తు చేద్దాం

5 Oct, 2021 02:51 IST|Sakshi

డ్రగ్స్‌తో రాష్ట్రానికి సంబంధం లేకున్నా విపక్షాల దుష్ప్రచారం: సీఎం జగన్‌ 

కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్ల గోబెల్స్‌ ప్రచారం  

మాదక ద్రవ్యాలకు దూరంగా కాలేజీలు, వర్సిటీలు.. విద్యాసంస్థలను మ్యాపింగ్‌ చేసి ప్రత్యేక కార్యాచరణ  

ఎక్కడైనా వాటి జాడలు కనిపిస్తే మూలాల్లోకి వెళ్లి తుడిచిపెట్టాలి 

అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠిన చర్యలు 

మహిళలు, చిన్నారులకు పూర్తి భద్రతే లక్ష్యం.. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో, ప్రతి మహిళ ఫోన్‌లోనూ దిశ యాప్‌ ఉండేలా చూడాలి 

సమర్థంగా ‘దిశ’ వ్యవస్థ.. చట్టం దిశగా సత్వర కృషి 

వచ్చే ఏడాది 6 వేల పోలీస్‌ పోస్టుల భర్తీకి చర్యలు 

కోవిడ్‌ తగ్గుముఖం పట్టినందున పోలీసులకు వీక్లీ ఆఫ్‌లపై పరిశీలన 

శాంతి భద్రతలపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవహారాలు లేవు... అయినా సరే అత్యంత అప్రమత్తంగా ఉండండి. ప్రధానంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదక ద్రవ్యాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా తక్షణం చర్యలు చేపట్టండి. 
– సీఎం జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి:  ‘డ్రగ్స్‌’ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ దుష్ఫ్రచారం చేస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతే ధ్యేయంగా ‘దిశ’ పోలీసు స్టేషన్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు మాత్రమే కాకుండా కేసుల పరిష్కారం కూడా పెరగాలని సూచించారు. సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టినందున పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 

‘మత్తు’ జాడలు ఉండకూడదు.. 
కాలేజీలు, యూనివర్సిటీలు మాదకద్రవ్య రహిత ప్రదేశాలుగా ఉండాలి. అసలు మాదక ద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయో లేవో అన్నది కచ్చితంగా నిర్ధారించుకునేందుకు అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో నిశితంగా పర్యవేక్షించండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో కాలేజీలు, యూనివర్సిటీలే డ్రగ్స్‌ విక్రయాల పాయింట్లుగా ఉంటాయి. అక్కడే మనం సమర్థంగా కట్టడి చేయగలిగితే డ్రగ్స్‌ వ్యవహారాలను అరికట్టినట్టే. అన్ని కాలేజీలను మ్యాపింగ్‌ చేయండి. ఎక్కడైనా  డ్రగ్స్‌ విక్రేతలు ఉన్నట్లు తెలిస్తే అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేది గుర్తించి మూలాల నుంచే డ్రగ్స్‌ వ్యవహారాలను పూర్తిగా తుడిచిపెట్టవచ్చు. డ్రగ్స్‌ ఆనవాళ్లు అన్నవి ఉండకూడదు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకుని కార్యాచరణ రూపొందించండి. ఎస్పీలు, కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై నివేదిక సమర్పించాలి. ఈ అంశంలో పనితీరు ఎలా ఉందో నిశితంగా సమీక్షిస్తా.  
 
డ్రగ్స్‌ లేకున్నా విపక్షాల దుష్ఫ్రచారం  
ఆంధ్రప్రదేశ్‌కు ఏమాత్రం సంబంధం లేని డ్రగ్స్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. లేని అంశాన్ని ఉన్నట్టుగా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం సాగిస్తోంది. వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థతో పాటు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ఉద్దేశపూర్వకంగా అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి.  
రాష్ట్రంలో శాంతి భద్రతలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
 
ప్రతి మహిళ ఫోన్‌లో ‘దిశ’  
మహిళలు, చిన్నారుల భద్రత కోసం తెచ్చిన ‘దిశ’ వ్యవస్థ సమర్థంగా పని చేయాలి. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ, ప్రతి మహిళ మొబైల్‌ ఫోన్‌లోనూ దిశ యాప్‌ ఉండేలా చూడాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళా పోలీసులు, వలంటీర్ల సహాయం తీసుకోండి. దిశ యాప్‌ డౌన్‌లోడ్, వాడకంపై విస్తృత ప్రచారం కల్పించండి.  
 
బాధితులకు సత్వర న్యాయం  
యువతులపై అఘాయిత్యాలను నివారించాలి. దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథకంతో బాధితులను శరవేగంగా ఆదుకోవాలి. సత్వరమే న్యాయం చేకూర్చేలా చర్యలు చేపట్టి పరిహారాన్ని అందించాలి. ఘటన జరిగిన నెల రోజుల్లోపే బాధిత కుటుంబాలను పరిహారం అందాలి. ఎక్కడైనా ఆలస్యం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి.  
 
ధైర్యంగా ముందుకొచ్చేలా.. 

బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి కల్పించాలి. ఫిర్యాదుదారులకు వెసులుబాటుగా వ్యవస్థ ఉండాలి. ఎఫ్‌ఐఆర్‌లు పెరుగుతాయని వెనకడుగు వేయవద్దు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికి ధైర్యం చెప్పి ప్రోత్సహించండి. బాధితులు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగలగాలి. వాటిపై చట్ట ప్రకారం సత్వరం చర్యలు తీసుకోవాలి. బాధితులకు భరోసా కల్పించడం ముఖ్యం.  
 
వచ్చే ఏడాది 6 వేల పోలీసు నియామకాలు 
మన ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించాం. వారికి శిక్షణ డిసెంబర్‌ నాటికి పూర్తి కావాలి. వచ్చే ఏడాది కొత్తగా 6 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసేలా దృష్టి సారించి సన్నద్ధం కావాలి. 
 
అక్రమ మద్యంపై ఉక్కుపాదం  
అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఎస్‌ఈబీ విభాగంతోపాటు పోలీసులు ఉక్కుపాదం మోపాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్టు దుకాణాలను తొలగించాం. మద్యం దుకాణాలను మూడో వంతు తగ్గించాం. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. విక్రయ వేళలు కుదించి రేట్లు పెంచాం. దీంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. ఇసుక అక్రమ రవాణాపై కూడా కఠినంగా వ్యవహరించాలి. గుట్కా నిరోధంపై ప్రత్యేకంగా దృష్టి సారించండి. అవసరమైతే చట్టం తీసుకొద్దాం.  
 
సైబర్‌ నేరాలు అరికట్టేందుకు కార్యాచరణ 
సైబర్‌ నేరాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సమర్థ అధికారులు, న్యాయ నిపుణులను నియమించాలి. 
 
దిశ, ప్రత్యేక కోర్టులపై సమీక్ష
దిశ బిల్లు, ప్రత్యేక కోర్టులపైనా సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. దిశ వన్‌స్టాప్‌ సెంటర్లు, మహిళా పోలీసుల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చేలా ఆమోద ప్రక్రియ కేంద్రం వద్ద ఏ దశలో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాసనసభలో బిల్లును ఆమోదించి చాలా రోజులైనా ఇంకా పెండింగ్‌లో ఉండటం సరికాదన్నారు. వెంటనే ఆమోదం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 2,652 కేసులను దిశ వన్‌ స్టాప్‌ సెంటర్ల ద్వారా పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రత కోసం ఇప్పటివరకు 51,053 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 

పూర్తి స్థాయిలో ప్రభుత్వ న్యాయవాదులు 
పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం పది కోర్టులు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. డిసెంబరు నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళలపై నేరాల కేసుల విచారణకు సంబంధించి 12 కోర్టులు పని చేస్తున్నాయని చెప్పారు. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కోర్టుల్లో ప్రభుత్వ న్యాయవాదులు పూర్తిస్థాయిలో ఉండాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదుల నియామకం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె.సత్యనారాయణ,  మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, పలువురు అదనపు డీజీలు, డీఐజీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
  
దిశ డౌన్‌లోడ్స్‌ 74.13 లక్షలు
– ఇప్పటివరకు దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 74,13,562  
– చర్యలు తీసుకోదగ్గ కేసుల్లో 5,238 మందికి భద్రత, ఇతర సాయం 
– దిశ యాప్‌ ద్వారా 2021లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు 684 
– నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి మ్యాపింగ్‌  
– దిశ పోలీస్‌ స్టేషన్లు అన్నింటికీ ఐఎస్‌వో సర్టిఫికేషన్‌  
– జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు  
– మహిళలపై నేరాల కేసుల్లో దర్యాప్తునకు 2017లో 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు.  
– గణనీయంగా మెరుగుపడ్డ ఫోరెన్సిక్‌ సదుపాయాలు. గతంలో డీఎన్‌ఏ నివేదిక కోసం ఏడాదిపాటు నిరీక్షించగా ప్రస్తుతం రెండు రోజుల్లోనే నివేదిక సిద్ధం. సంబంధిత కేసుల్లో ఏడు రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు.  

మరిన్ని వార్తలు