వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్‌

4 Jan, 2021 12:03 IST|Sakshi

ప్రతిపక్షాల తీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం

తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టవద్దు

దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు

మంచి కార్యక్రమం మొదలుపెట్టిన ప్రతిసారీ ఇలాగే

ప్రజలు ఈ కుట్రలను నిశితంగా గమనించాలి

పోలీస్‌ డ్యూటీ మీట్‌ ప్రారంభించిన సీఎం జగన్

సాక్షి, చిత్తూరు: పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. తద్వారా సైబర్ క్రైమ్, మహిళల రక్షణ వంటి అనేక అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. టెక్నాలజీ మెరుగుపరిచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు.  రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను సీఎం జగన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఆరేళ్లుగా పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దుశ​‍్చర్యలకు పాల్పడుతున్నారన్న ఆయన.. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: స్థలం + ఇల్లు.. రెట్టింపు ఆనందం)

తప్పు చేసింది ఎవరైనా వదలొద్దు
‘‘గత ప్రభుత్వం తమ వాళ్లు ఏం చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించాలని చెప్పింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కానీ మా ప్రభుత్వం అన్యాయం ఎవరు చేసినా శిక్షించాలని స్పష్టం చేసింది. ఎవరు చేసినా తప్పు తప్పే. మా వాళ్లు తప్పు చేసినా సరే.. ఎవరినీ వదలొద్దని మరోసారి చెబుతున్నా. గత 18 నెలల పాలన ప్రతిపక్షంలో ఉన్నవారికి గుబులు పుట్టిస్తోంది. కులం,మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం. అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి ప్రజలు ఆనందంగా ఉంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టమని గుర్తించి నాయకులు కుట్రలు చేస్తున్నారు సోషల్‌ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’’ అని టీడీపీ తీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీళ్లు అసలు మనుషులేనా?
‘‘కొంతమందికి దేవుడు అంటే భయంలేదు, భక్తి లేదు. దేవుడిపై రాజకీయం చేస్తున్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసి పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులేనా.. కులాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి కేసులను విచారించే పరిస్థితిలోకి మనం వచ్చాం. దేవుడి విగ్రహాలను పగులగొడితే ఎవరికీ లాభం? ఆలయాల్లో అరాచకం చేస్తే ఎవరికీ లాభం? ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు, విష ప్రచారం చేస్తే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు?’’ ప్రతిపక్షాల తీరును సీఎం జగన్‌ ఎండగట్టారు. ఇలాంటి వాటిని ప్రజలు నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. 

మంచి కార్యక్రమం మొదలుపెట్టిన ప్రతిసారీ..
‘‘ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని, రాజకీయంగా జరుగుతున్న గొరిల్లా యుద్ధతంత్రాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జన సంచారం లేని చోట, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లోనే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని, 20వేల ఆలయాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా సీసీ కెమెరాలు పెట్టామన్నారు. కొన్ని మీడియా సంస్థలను ప్రజలను రెచ్చగొడుతున్నాయని, పథకం ప్రకారమే కుట్రలు పన్నుతున్నారన్నారు.

 2019 నవంబర్‌ 14న ఒంగోలులో మనబడి నాడు నేడు ప్రారంభించాం. ఆ సమయంలో గుడిని కూల్చారని అసత్య ప్రచారం చేశారు.
 2020 జనవరి 21న పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారని ప్రచారం చేశారు.
 అదే రోజు దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ధరల స్థిరీకరణ పథకం ప్రారంభించాం. రొంపిచర్లలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని ప్రచారం చేశారు.
 ఫిబ్రవరి 14న తూర్పు గోదావరి జిల్లాలో ఆలయ రథాన్ని దగ్ధం చేశారు.
 రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ ప్రారంభించారని, దానికి ప్రచారం రాకూడదని ఇలాంటి పని చేశారు. ఒక్క దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభిస్తే మూడు ఘటనలకు పాల్పడ్డారు.
 ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో దుర్గ గుడి వెండి సింహాలను మాయం చేశారు.
 రైతన్నల కోసం బోర్లు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో అక్టోబర్‌ 8న విద్యా కానుకను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాం. మూడు రోజుల ముందు ఆలయాల ధ్వంసాలకు కుట్ర పన్నారు
విజయనగరంలో సీఎం జగన్‌ వస్తున్నారని తెలిసి రామాలయంలో విగ్రహం ధ్వంసం చేశారు. ఇందులో చాలా ఆలయాలులో దేవాదాయ శాఖ పరిధిలోని కావు. ఇవన్నీ మారుమూల ప్రాంతాల్లో, జన సంచారం లేని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు. చాలా ఆలయాలో టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు