దుష్ట చతుష్టయంతో జాగ్రత్త

6 May, 2022 03:12 IST|Sakshi
జగనన్న విద్యాదీవెన చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు

డైరెక్షన్‌.. యాక్షన్‌.. రియాక్షన్‌ అంతా దొంగల ముఠాదే: తిరుపతి సభలో ముఖ్యమంత్రి జగన్‌ 

మంచి చేస్తుంటే విష సర్పాల్లా రకరకాలుగా అడ్డుకుంటున్నారు

పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు, అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలపై ఆటంకాలు సృష్టించారు

ఇళ్ల నిర్మాణంపై తప్పుడు రాతలు

ప్రజలకు మేలు జరుగుతుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబుకు కడుపు మంట

గుంట నక్కల కన్నా హీనం

హత్యాచారాల ఘటనల్లో దోషులంతా టీడీపీ నేతలే.. వాస్తవాలను దాచేసి ఎల్లో మీడియా రభస

నారాయణ, చైతన్య స్కూళ్ల నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ 

వాళ్లు ఆలయాలను కూల్చేస్తే.. మేం పునఃనిర్మించాం

విద్యా దీవెనతో 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.709.20 కోట్లు జమ చేసిన సీఎం

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో 10,85,225 మంది విద్యార్థులకు లబ్ధి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతోంది కాబట్టి కొందరికి కడుపుమంట పెరుగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాయలున్న చెట్లకే రాళ్లు పడతాయని.. ఇంతగా చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5తో పాటు చంద్రబాబు కలసి దుష్ట చతుష్టయంలా, దొంగల ముఠాలా మారి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదింటి పిల్లలు గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగి ఆ కుటుంబంతో పాటు సమాజం స్థితిగతులు మారేలా ఇంగ్లిష్‌ మీడియం చదువులు తీసుకొస్తే అడ్డుపడ్డారని విమర్శించారు. చివరకు నిరుపేద అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలిచ్చి లక్షల కుటుంబాలకు గూడు కల్పిస్తుంటే దానికీ ఆటంకాలు సృష్టించారని ధ్వజమెత్తారు.

అమ్మ ఒడి లాంటి పథకాలకూ ఆటంకాలు సృష్టిస్తూ గోబెల్స్‌ ప్రచారంతో వంచించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య స్కూళ్ల నుంచే ప్రశ్న పత్రాల లీకేజీ జరిగిందని స్పష్టం చేశారు. గురువారం తిరుపతిలో జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో త్రైమాసికం ఫీజుల కింద రూ.709.20 కోట్లను నేరుగా 9.73 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి సీఎం జమ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో 10,85,225 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తిరుపతిలో రూ.320 కోట్లతో నిర్మిస్తున్న చిన్నపిల్లల మల్టీ సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.190 కోట్లతో టాటా ట్రస్టు నిర్మించిన క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ...

దోషులపై దాగుడు మూతలు
ప్రజలకు మేలు చేస్తుంటే చూడలేక ఏదో జరిగిపోతోందంటూ ఎల్లో మీడియా నానాయాగీ చేస్తోంది. మనం ఏం చేస్తున్నామో అమ్మలకు, అక్కచెల్లెమ్మల కళ్లకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన్ను మూడు దశాబ్దాలుగా మోస్తూ ఎదిగిన దొంగల ముఠాకి విద్యావ్యవస్థలో జరుగుతున్న మార్పులతో ఎక్కడలేని బీపీ పెరుగుతోంది. తప్పుడు రాతలతో పరదా కట్టాలని చూస్తున్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖలో ఇటీవల చోటు చేసుకున్న హత్యాచారాల ఘటనల్లో దోషులు ఎవరనేది ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చెప్పదు.  టీవీ–5 చూపించదు. కారణం ఏమిటంటే.. ఆ కేసుల్లో  దోషులంతా టీడీపీ నాయకులే కాబట్టి. ఇటువంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్లే చేస్తారు.. మళ్లీ వీళ్లే వక్రీకరిస్తారు.. దుర్భుద్ధితో పచ్చి ఆరోపణలు చేస్తారు. 

నారాయణ చైతన్య నుంచే లీకేజీలు..
మనం చేస్తున్న మంచిని ప్రజలు మరిచిపోవాలనే ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఈరోజు విద్యాదీవెన ప్రారంభిస్తున్నామని తెలిసి దుష్ప్రచారం కొత్త మలుపు తిప్పారు. విద్యాదీవెన ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించేందుకు ప్రశ్నాపత్రాలను వాట్సాప్‌లో లీక్‌ చేయించి ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు నారాయణ, మూడు చైతన్య స్కూళ్ల నుంచే ఈ లీకేజీలు జరిగాయి. ఇందుకు కారకుడైన ఆ నారాయణ ఎవరండి ? చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. వాళ్ల విద్యాసంస్థల నుంచే లీక్‌ చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

ఆ ఐదేళ్ల పాపాల పాలనలో..
చంద్రబాబు ఐదేళ్ల పాపాల పాలనలో గుడులను ధ్వంసం చేస్తే మనం ఆలయాలను కట్టించాం. వాళ్లు విగ్రహాలను విరిచేస్తే మనం పునఃప్రతిష్టించాం. వారు రథాలను తగులబెడితే మనం రథాలను మళ్లీ నిర్మించాం. వాళ్లు రైతులను కుంగదీస్తే మనం రైతులను తిరిగి నిలబెడుతున్నాం. వాళ్లు మన పల్లెల్ని దెబ్బతీస్తే మనం ప్రతి పల్లెల్లో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకెళ్లాం. అవినీతికి తావు లేకుండా గడప వద్దకే సుపరిపాలన తెచ్చి దేశానికే మార్గ నిర్దేశం చేశాం. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అందిస్తున్నాం. వాళ్లు మన బడిని, ఆసుపత్రులను శిథిలావస్థకు చేరిస్తే మనం నాడు–నేడుతో వాటికి జవసత్వాలు చేకూర్చాం. వారు పేద పిల్లలు ఉన్నత చదువులు చదువు కూడదన్న దుర్బుద్ధి ప్రదర్శిస్తే మనం విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 

ఘన స్వాగతం..
తిరుపతి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకోగానే విద్యార్థులంతా జగన్‌ మామకు జై.. అంటూ ఘన స్వాగతం పలికారు. తొలుత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, ఆర్కే రోజా ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి, మేయర్‌ శిరీషా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెంకన్నను ప్రార్థిస్తున్నా... 
వారే స్క్రిప్టు రాస్తారు.. వారే యాక్షన్‌ చేస్తారు.. మళ్లీ ఘోరం జరిగిందని గోల చేసేది కూడా వారే. ఇవన్నీ గమనించమని ప్రజలను కోరుతున్నా.. ఇలాంటిప్పుడు మనం కోరగలిగింది ఒక్కటే.. దేవుడా రక్షించు మా రాష్ట్రాన్ని.. ఈ ఎల్లో మీడియా నుంచి. ఈ ఎల్లో పార్టీ నుంచి. రెండు నాల్కలు చాచి బుసలు కొట్టే నిర్హేతుక విష సర్పాల నుంచి.. ధూర్తుల నుంచి.. దుష్ట చతుష్టయం నుంచి రక్షించు దేవా.. అని తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నా.

ఇంగ్లీషు మీడియంపై అడ్డుపుల్లలు 
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు మన ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇంగ్లీషు మీడియాన్ని తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఏనాడైనా చేశారా? మేం తీసుకొస్తే అడుగడుగునా అడ్డుకున్నారు. లేనిపోని నిందలు, అభాండాలు వేసి పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియాన్ని దూరం చేయాలన్న కుట్రలు మీరంతా చూశారు. పిల్లలను చదువుల బాట పట్టించాలన్న లక్ష్యంతో అమ్మ ఒడికి శ్రీకారం చుట్టాం.  పిల్లలను చదివించే ప్రతి తల్లికి తోడుగా నిలుస్తూ రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. పాఠశాలల పునఃప్రారంభం రోజే పుస్తకాలు, యూనిఫామ్‌ అందిస్తున్నాం.

ఇళ్లను అడ్డుకుంటూ తప్పుడు రాతలు 
జగన్‌కు ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న కడుపు మంటతో వారి కుళ్లు, కుతంత్రాలు ఏ స్థాయికి చేరాయో మీరే గమనించండి. 1.3 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలిస్తే అప్పుడు పేపర్‌ లీకేజీ అంటూ యాగీ చేశారు. దేశ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ఏ విధంగా అడ్డుకున్నారో మీరంతా చూశారు. 18.41 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే రెచ్చగొట్టేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో టిడ్కో ఇళ్లను నిర్మించలేక చేతులెత్తేస్తే, మనం అధికారంలోకి వచ్చాక నిర్మించి పేదలకు ఇస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక బురద చల్లుతోంది. మనం చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్లకుండా గుంట నక్కల కన్నా హీనంగా అడ్డుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు