వర్షాల జోరు.. సాగు బాగు

20 Aug, 2020 04:10 IST|Sakshi

నీళ్లకు ఇబ్బంది ఉండదు

మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘దేవుడి దయ వల్ల ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 27 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఒకటీ రెండు మండలాలు మినహా అన్ని చోట్లా పుష్కలంగా వర్షాలు కురిశాయి. వ్యవసాయం చక్కగా సాగుతోంది. రాష్ట్రంలో లక్ష్యానికి మించి వరినాట్లు, పంటల సాగు ఇప్పటికే పూర్తయింది. రిజర్వాయర్లు నిండుతున్నాయి. నీళ్లకు ఇబ్బంది ఉండదు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. బుధవారం సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై మంత్రులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది.

విద్యా సంస్థల ప్రారంభం విషయమై చర్చకు వచ్చినప్పుడు.. వచ్చే నెల 5 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నారంటే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని మంత్రి శంకరనారాయణ ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలనేది మన నిర్ణయం కాదు. ఇది కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతోంది. వారెలా చెబుతారో అలా చేయాలి’ అన్నట్లు తెలిసింది. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. 

► జగనన్న విద్యా కానుక పథకం కింద మదరసాలను కూడా చేర్చాలన్న మంత్రి అంజాద్‌ బాష సూచన మేరకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.  
► కరోనా వైరస్‌ బారిన పడి, కోలుకుని సమావేశానికి హాజరైన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అంజాద్‌బాషల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు తెలిసింది. పలువురు మంత్రులు నిధుల మంజూరు గురించి సీఎంకు విన్నవిస్తుండగా.. ‘మనం ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే ఆయన (ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌) మనవైపు ఎలా చూస్తున్నారో చూడండి’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు