విద్వేషకారులను వదలొద్దు.. కఠినంగా శిక్షించాలి

6 Jan, 2021 03:05 IST|Sakshi

కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచే 

వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

విగ్రహాలను ధ్వంసం చేసే వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు 

అన్యాయమైన పనులు చేసే వారిని వదిలి పెట్టొద్దు

లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులెవరో అందరికీ తెలియజెప్పాలి

ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా చర్యలుండాలి

రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే వారికి గట్టి గుణపాఠం చెప్పాలి

మత సామరస్యానికి పెద్దపీట వేయాలి

సంక్షేమ ఫలాలను అందిస్తుంటే తట్టుకోలేక దొంగదెబ్బ

రాజకీయ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు జరుగుతున్నాయి. ఎవరూ లేని ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, అందరూ పడుకున్నాక, తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు. వాటిలోని విగ్రహాలను పగలగొడుతున్నారు. ఆ మర్నాడు వాటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. 

విగ్రహాల విధ్వంసం ఘటనలను లోతుగా దర్యాప్తు చేయండి. ఆ ఘటనలకు బాధ్యులైన వారెవరో అందరికీ తెలిసేలా ప్రదర్శించండి. ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అన్యాయమైన పనులు చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న సందేశం స్పష్టంగా ఇవ్వాలి. వారి పట్ల కఠినాతికఠినంగా వ్యవహరించాలి. 

సాక్షి, అమరావతి: కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతూ, విగ్రహాలను ధ్వంసం చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవైనా ఘటనలు జరిగితే ఖండించాలని, మత సామరస్యం కోసం పాటుపడే వారికి సహకరించాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆదేశించారు. విగ్రహాలను ధ్వంసం చేసే పనులను చేపడితే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలని పునరుద్ఘాటించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు
► సోమవారం పోలీస్‌ డ్యూటీ మీట్‌ ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడాను. మనం డీల్‌ చేయాల్సిన పరిస్థితుల గురించి కూడా వివరంగా మాట్లాడాను. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ ఫేర్‌ జరుగుతోంది. ఇది చాలా కొత్త అంశం. ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు పట్టుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పోయి కొత్త ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 
► ఇంటింటికీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. జీర్ణించుకోలేక, తట్టుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలందుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక, అలాంటి పనులకు ఒడిగడుతున్నారు. 
► దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టాలి.
 
కఠినంగా వ్యవహరించాలి 
► వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా మానిటర్‌ చేయాలి. ఇప్పటికే గుళ్లలో 36 వేల సీసీ కెమెరాలు పెట్టాం. ఆ విధంగా గుడులు, గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. నిజానికి గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం.
► ఈ రాజకీయ గెరిల్లా వార్‌ ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు ప్రచారం కావాలి. మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు