సర్కారీ సూపర్‌ స్పెషాలిటీ

1 Oct, 2020 02:58 IST|Sakshi

అన్ని ఆస్పత్రులూ అత్యాధునికంగా..

ఎక్కడా రాజీపడొద్దు.. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి

వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రులలో నాడు–నేడుపై సమీక్షలో సీఎం జగన్‌  

ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ కనిపించాలి

చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం జరగాలి

ఏడు దశాబ్దాల తర్వాత మారబోతున్న ఆస్పత్రుల రూపురేఖలు

చరిత్రలో నిలిచిపోయేలా వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం జరగాలి. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలి. యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్,నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలి. తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుంది.
    – సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని, నిర్మాణాల విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ స్పష్టంగా కనిపించాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పనులతో పాటు కొత్తగా వైద్య కళాశాలలు, ఐటీడీఏల్లో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు.. అధికారులు వివరించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఆస్పత్రిలో ఏసీ తప్పనిసరి
► డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా సేవలందించగలుగుతారని, అందువల్ల తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలని సీఎం చెప్పారు. అవసరం అయితే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, దాని వల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50కే వస్తుందని చెప్పారు.
► దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయని, అందువల్ల ప్రతి ఆస్పత్రి అత్యుత్తమంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
 
పనులు వేగంగా జరిగేలా ఏర్పాట్లు
► తొలుత నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. పాడేరులో వైద్య కళాశాలతో పాటు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను అక్టోబర్‌ 2న ప్రారంభిస్తారని (సీఎం ప్రారంభిస్తారు) చెప్పారు. 

► సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు సిద్ధమయ్యాయని చెప్పారు. రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రి గురించి పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు.  

► పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నామని తెలిపారు.

► బాపట్ల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, మార్కాపురం, మదనపల్లె, నంద్యాల మెడికల్‌ కాలేజీల టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ అక్టోబర్‌లో జరుగుతుందని చెప్పారు. నరసాపురం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల టెండర్లను నవంబర్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపిస్తామన్నారు. 

► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, హెల్త్‌ మెడికల్‌ హౌసింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు