మన పిల్లలకు విద్యే కానుక.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ 

27 Nov, 2021 03:16 IST|Sakshi

రూపు మార్చుకున్న అంటరానితనం ప్రభావం వల్ల మన పిల్లలు అణగిమణిగి ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనతో ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువులు నేర్చుకోనివ్వకుండా అణగదొక్కుతున్నారు. ఈ పరిస్థితిని రూపు మాపి.. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. విద్యాపరంగా సామాజిక న్యాయం చేయాలనే లక్ష్యంతో రైట్‌ టు ఎడ్యుకేషన్‌ను రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం ఎడ్యుకేషన్‌గా మారుస్తున్నాం. – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థి.. 20 ఏళ్ల తర్వాత ప్రపంచంతో పోటీపడి, నిలబడేలా తీర్చిదిద్దేందుకు విద్యా విధానంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేజీ నుంచి డిగ్రీ వరకూ విద్యను హక్కుగా కల్పించామని, మన పిల్లల భవిష్యత్‌ ఉజ్వలంగా ఉండబోతోందన్నారు. శుక్రవారం శాసనసభలో విద్యారంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ను రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియం ఎడ్యుకేషన్‌గా మార్చే నిర్ణయాన్ని ప్రతి విద్యార్థి తల్లి అభిప్రాయం అడిగాకే  తీసుకున్నామన్నారు.  పిల్లలకు ఆరేళ్లకే మెదడు 85 శాతం ఎదుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైందని.. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ స్థాయి (ప్రీప్రైమరీ నుంచే పిల్లలను ఇంగ్లిష్‌ మాధ్యమం వైపు మళ్లించేలా సంస్కరణలకు నాంది పలికామని సగర్వంగా చెబుతున్నామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఆరు విభాగాలుగా ప్రభుత్వ స్కూళ్లు

 • శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2)
 • ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ–1 నుంచి రెండో తరగతి వరకు) n ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు (పీపీ–1 నుంచి ఐదో తరగతి వరకు)
 • ప్రీ హైస్కూళ్లు (మూడో తరగతి నుంచి 7–8 తరగతుల వరకు) n    హైస్కూళ్లు (3–10 తరగతులు) n హైస్కూళ్లు ప్లస్‌ (3–12 తరగతులు)
 • ప్రీ ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే బోధిస్తున్నాం. పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకొస్తున్నాం. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడో తరగతి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ప్రత్యేక టీచర్‌ను నియమిస్తున్నాం.

జూన్‌లో అమ్మ ఒడి, విద్యా కానుక 

 • పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేల చొప్పున రెండేళ్లలో 1 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల తల్లుల (44.50 లక్షల మంది) ఖాతాల్లో రూ.13,023 కోట్లు జమ చేశాం. దీని వల్ల 85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకానికి అర్హులు. జూన్‌లో తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం.
 • గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి ఏటా రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. భోజనంలో నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు జగనన్న గోరుముద్ద పథకం కింద చిక్కీతో పాటు వేర్వేరు ఆహార పదార్థాలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఈ పథకం కోసం ఏటా రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
 • విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్‌ (కుట్టు కూలితో కలిపి), బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బూట్లు, సాక్సులతో కలిపి జగనన్న విద్యా కానుక కింద ఉచితంగా అందిస్తున్నాం. ఈ పథకానికి రెండేళ్లలో రూ.1,437 కోట్లు ఖర్చు చేశాం.

పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం

 • 2009 నుంచి 2019 వరకు ప్రభుత్వాలు చదువును కొనుక్కొనేలా ప్రైవేటు సంస్థలకు పట్టం కట్టి.. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాయి. ఇప్పుడు నాడు–నేడు కింద 57,189 ప్రభుత్వ పాఠశాలలు, 3,280 హాస్టళ్లను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నాం. 
 • శిథిలావస్థకు చేరిన పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చి.. కనీస మౌలిక సదుపా యాలు కల్పించాం. తొలి విడతగా 15,715 పాఠశాలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడానికి రూ.3,669 కోట్లు ఖర్చు చేశాం. 
 • పాఠశాలల్లో 24 గంటల నీటి సౌకర్యం ఉండే టాయిలెట్లను నిర్మించడమే కాకుండా.. వాటిని శుభ్రంగా నిర్వహించడానికి అమ్మ ఒడి ద్వారా ఇచ్చే రూ.15 వేలలో రూ.వెయ్యిని తల్లులే టాయిలెట్‌ నిర్వహణ ఫండ్‌గా ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. టాయిలెట్ల నిర్వహణకు పెట్టే ప్రతి రూపాయి రూ.34 విలువైన ఫలితం ఇస్తుందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక స్పష్టం చేస్తోంది. వీటన్నింటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం విద్యార్థులు చేరుతున్నారు. 

ఉన్నత చదువులకు అండగా నిలిచాం

 • బీటెక్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివినప్పుడే.. ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందనే లక్ష్యంతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి పాలకులు ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే మూడు దశల్లో పూర్తి ఫీజును తల్లుల ఖాతాలకు రీయింబర్స్‌ చేస్తున్నాం. ఈ రెండేళ్లలో ఈ విద్యాదీవెన పథకానికి రూ.5,573 కోట్లు ఖర్చు చేశాం.
 • హాస్టల్‌ ఖర్చుల కోసం ఐటీఐ చదివే పిల్లలకు రూ.పది వేలు, పాలిటెక్నిక్‌ చదివే పిల్లలకు రూ.15 వేలు, డిగ్రీ చదివే పిల్లలకు రూ.20 వేల చొప్పున విద్యా దీవెన పథకం కింద వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ రెండేళ్లలో  రూ.2,270 కోట్లు ఇచ్చాం.
 • వచ్చే సంవత్సర.‡ం అమ్మ ఒడి, వసతి దీవెన డబ్బులు వద్దు.. పిల్లలకు ఉపయోగపడేలా ల్యాప్‌ టాప్‌లు ఇవ్వండి అని తల్లులు కోరితే.. బయట రూ.25వేల నుంచి రూ.27 వేల ధర పలికే ల్యాప్‌ టాప్‌లను తక్కువ ధరకే అందిస్తాం. టెండర్లు, రివర్స్‌ టెండర్‌ నిర్వహించడం వల్ల నాణ్యమైన ల్యాప్‌ టాప్‌లు రూ.18 వేల నుంచి రూ.18,500 వస్తాయని అనుకుంటున్నాం. ఇవి బాగోలేకపోతే.. సచివాలయంలో ఇస్తే వారం రోజుల్లో కొత్త ల్యాప్‌ టాప్‌ ఇచ్చేలా నిబంధన పెట్టాం.
 • ఉద్యోగం, ఉపాధినిచ్చేలా (జాబ్‌ ఓరియెంటెడ్‌) డిగ్రీ, బీటెక్‌ వంటి ఉన్నత విద్యలలో మార్పులు తీసుకొస్తాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, జిల్లాలోని పరిశ్రమలను అనుసంధానం చేస్తూ అప్రెంటిస్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ జాబ్‌ ఓరియెంట్‌డ్‌ కోర్సులుగా ఉన్నత విద్యను మార్చే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం.    
మరిన్ని వార్తలు