ఈ ఏడాదే సీబీఎస్‌ఈ

17 Mar, 2021 09:42 IST|Sakshi

స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తొలుత 1 నుంచి 8 తరగతులకు ఆ తర్వాత వరుసగా ఒక్కో ఏడాది ఇతర తరగతులకు వర్తింపు

12 వరకు సీబీఎస్‌ఈ అమలు

ఒత్తిడికి గురి కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకే..

ఎఫిలియేషన్‌ కోసం బోర్డుతో చర్చించాలని సీఎం ఆదేశం

ఏప్రిల్‌ 16న రైతులకు, 20న పొదుపు మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ డబ్బులు

27న జగనన్న వసతి దీవెన

వచ్చే నెలలోని ముఖ్యమైన కార్యక్రమాల తేదీలను ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో అత్యుత్తమంగా రాణించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 2021 – 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ దీన్ని వర్తింప చేస్తామన్నారు. 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఎఫిలియేషన్‌ కోసం సీబీఎస్‌ఈ బోర్డుతో చర్చించి ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కామన్‌ సిలబస్‌ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

ఆంగ్లంపై మరింత పట్టు సాధించి మన విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఉపకరిస్తుందన్నారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు.. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, ఇళ్ల పట్టాలు, స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలలో నాడు –నేడు, మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్‌ కాలేజీలు, ఆర్‌ అండ్‌ బీ, వైఎస్‌ఆర్‌ బీమా, జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరాతోపాటు ఏప్రిల్‌లో అందించనున్న జగనన్న విద్యా దీవెన, రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, పొదుపు సంఘాలకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, జగనన్న వసతి దీవెన, వలంటీర్లకు సత్కార కార్యక్రమాలపై సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు, పథకాలపై సీఎం జగన్‌ ఏమన్నారంటే..

ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం..
ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం. కలెక్టర్లకు అభినందనలు. మార్చి 15 నాటికి 24.27 కోట్ల పనిదినాలు కల్పించాం. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో 25.25 కోట్ల పనిదినాలను చేరుకోబోతున్నాం. దాదాపు రూ.6 వేల కోట్లు ఉపాధిహామీ కింద కూలీలకు ఇవ్వగలిగాం. యుద్ధ ప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలి. 2021 మే నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలి. ఆర్బీకేలను పూర్తి చేయడంపైనా దృష్టి పెట్టాలి. ఆర్బీకేల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను పూర్తి చేయడంపైనా దృష్టి సారించాలి. వీటన్నింటిపైనా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

అమూల్‌తో కలిసి గ్రామాల్లో విప్లవాత్మక చర్యలు
అమూల్‌తో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం. పాడి రైతులకు మంచి ధర వచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల గ్రామీణఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బీఎంసీ (బల్క్‌ మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు), ఏంఎంసీ (ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు)ల నిర్మాణాలపై దృష్టిపెట్టాలి. నెలాఖారు కల్లా అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణం మొదలుపెట్టి ఆగస్టు కల్లా పూర్తిచేయాలి. ఉపాధిహామీ కింద ప్రారంభించిన సీసీ రోడ్లు, డ్రైన్స్‌ వెంటనే పూర్తి చేయాలి.

కొత్తగా 11,334 మందికి వెంటనే ఇళ్ల పట్టాలు 
అక్కడక్కడా మిగిలిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీని వెంటనే పూర్తి చేయాలి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లోగా ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలి. కచ్చితంగా నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలం పట్టా అందాల్సిందే. కొత్తగా అర్హులుగా గుర్తించిన 11,334 మందికి పట్టాలను వెంటనే అందించాలి. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్‌  పూర్తి చేయాలి. ఏప్రిల్‌ నుంచి వీరికి అవసరమైన భూముల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియలపై దృష్టి పెట్టాలి.

ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం 
తొలివిడతలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలి. సన్నాహక పనులను ముమ్మరం చేయాలి. ఏప్రిల్‌ 15 కల్లా లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ప్రతి కాలనీలో ఒక మోడల్‌హౌస్‌ కట్టాలి. తామే ఇల్లు కట్టుకుంటామన్న వారికి నిర్మాణ సామగ్రిని అందించాలి. పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నందున లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు, స్టీలు, మెటల్‌ లభిస్తుంది. దీంతో వారికి మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి.

స్కూళ్లలో మార్చి 31కి నాడు – నేడు తొలివిడత పనులు పూర్తి 
నాడు – నేడు కింద స్కూళ్లలో మొదటి విడతలో చేపట్టిన పనులు మార్చి 31 నాటికి పూర్తి కావాలి. పది రకాల సదుపాయాలు స్కూళ్లకు సమకూరుతున్నాయి. పెయింట్‌ పనులపై దృష్టి పెట్టాలి.

అంగన్‌ వాడీల్లో నాడు–నేడు..
వైఎస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కింద అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నాం. చిన్నారుల్లో 6 ఏళ్ల లోపు వయసులోనే మెదడు 80 శాతం వరకూ అభివృద్ది చెందుతుంది. అందుకనే ఈ వయసులో ఉన్న చిన్నారులపై దృష్టిపెట్టాం. ప్రీ ప్రైమరీ స్కూళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. భవనాల నిర్మాణం కోసం స్థలాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు శ్రద్ధ చూపాలి.

మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు..
ఆర్బీకేల పరిధిలో ఏర్పాటయ్యే మల్టీపర్పస్‌ సెంటర్ల కోసం 50 సెంట్ల నుంచి ఎకరం వరకూ స్థలం అవసరం. వీలైనంత త్వరగా భూములను గుర్తించి సంబం«ధిత శాఖకు అప్పగించాలి. గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాం లాంటి సదుపాయాలు గ్రామాల స్థాయి వరకూ రావాలి. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు రావాలంటే ఈ సదుపాయాలు ఉండాలి.

మెడికల్‌ కాలేజీల నిర్మాణం..
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీని తెస్తున్నాం. బోధనాసుపత్రితోపాటు నర్సింగ్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీలకు భూములను గుర్తించి సేకరణ పనులు పూర్తి చేయాలి. పులివెందుల, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, ఆదోని, మచిలీపట్నంలలో నిర్మాణాలు ఏప్రిల్‌లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.

జాతీయ రహదారులు
జాతీయ రహదారుల నిర్మాణానికి భూములను త్వరగా సేకరించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి.

ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌ బీమాతో 12,039 మందికి పరిహారం
బ్యాంకులు ఎన్‌రోల్‌ చేయని కుటుంబాల్లో సహజ మరణాలు, ప్రమాదాల కారణంగా మరణించిన 12,039 మంది నామినీలకు వైఎస్‌ఆర్‌ బీమా కింద ఏప్రిల్‌ 6న పరిహారం చెల్లింపులు చేస్తాం. జగనన్న తోడు అర్హులందరికీ పథకం వర్తించేలా డీసీసీల సమావేశం 
నిర్వహించాలి.

వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరాపై దృష్టి పెట్టండి
వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాలపై దృష్టి పెట్టండి. 98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన 2 శాతం మందితో కూడా దుకాణాలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. చేయూత, ఆసరా కింద సుస్థిర ఉపాధి మార్గాల కోసం చేపట్టిన ఇతర కార్యక్రమాల్లో బ్యాంకు లింకేజీ ప్రక్రియను ముమ్మరం చేయాలి.

ఏప్రిల్‌లో ముఖ్యమైన కార్యక్రమాలు ఇవీ
► ఈ ఏడాది ఏప్రిల్‌కు సంబంధించి పలు కార్యక్రమాల తేదీలను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఏవైనా దరఖాస్తులు ఉంటే పరిశీలన చేసి జాబితాలను సచివాలయాల్లో ఉంచాలని సూచించారు. అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.  
► ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన 
► ఏప్రిల్‌ 13న ఉగాదిరోజు వలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం. ప్రతి రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలి. 
వలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులతో సత్కరించాలి. వలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి. అది వారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది. 
► ఏప్రిల్‌ 16న రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ డబ్బులు
► ఏప్రిల్‌ 20న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ డబ్బులు
► ఏప్రిల్‌ 27న జగనన్న వసతి దీవెన

సమీక్షలో పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు..
ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సీసీఎల్‌ఏ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆర్‌ అండ్‌ బీ ఎం.టి.కృష్ణబాబు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ గృహనిర్మాణశాఖ అజయ్‌ జైన్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బీసీ వెల్ఫేర్‌ జి.అనంతరాము, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏ.ఆర్‌.అనురాధ,  వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి ఉషారాణి, కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి ఉదయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.సునీత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హెచ్‌.అరుణకుమార్, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్, సెర్ప్‌ సీఈఓ రాజబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

6 రోజుల్లో ముగిసే ఎన్నికల ప్రక్రియ సాగదీతతో అభివృద్ధికి ఆటంకాలు
► రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గతేడాది అర్థాంతరంగా మధ్యలో నిలిపివేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇక కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని, అది ముగిస్తే వ్యాక్సినేషన్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 
► దీన్ని పూర్తి చేయకుండా సాగదీయడంతో అభివృద్ధి పనులకు అవరోధాలు ఎదురవుతు న్నాయని సీఎం జగన్‌ చెప్పారు. ఆరు రోజుల్లో పూర్తయ్యే ఆ ప్రక్రియను ముగిస్తే మిగతా పనులు సజావుగా సాగుతాయన్నారు. ఆ ఎన్నికలను మధ్యలో నిలిపివేసి దీర్ఘకాలం సాగదీయడం, కోడ్‌ కారణంగా అభివృద్ధి, వ్యాక్సినేషన్‌ మందగించాయన్నారు. 
► అధికార యంత్రాంగం అంతా ఇతర కార్యక్రమాల్లో ఎక్కువ రోజులు నిమగ్నం కావడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 
పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా చాలా రోజులుగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించలేకపోయామన్నారు. 

మరిన్ని వార్తలు