ఇసుక, మద్యం అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దు

13 Feb, 2021 05:29 IST|Sakshi
సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాల్సిందే

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిని ఉపేక్షించొద్దు

వ్యవస్థీకృతంగా అవినీతికి అవకాశం ఇవ్వొద్దు

ప్రతి వారం సమీక్ష జరపండి.. 15 రోజుల్లో మెరుగవ్వాలి

మద్యం, ఇసుక, ఇతర అక్రమాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులు ఉధృతం చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలి. 

సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం విషయంలో ఎక్కడా అక్రమాలకు ఆస్కారం ఉండకూడదని, అక్రమ రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిని ఉపేక్షించవద్దని, వ్యవస్థీకృతంగా అవినీతికి అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పనితీరుపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదైనా సమాచారం రాగానే దానిపై కచ్చితంగా దృష్టిపెట్టి పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవస్థీకృతంగా ఎస్‌ఈబీలో అవినీతికి  ఆస్కారం ఉండకూడదని, ఎక్కడైనా తప్పులు జరిగాయన్న సమాచారం రాగానే కచ్చితంగా దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడున్న వారే కాకుండా సమర్థత, నిజాయితీపరులైన అధికారులకు ఎస్‌ఈబీలో స్థానం కల్పించాలని సూచించారు. ఇందులో పని చేసే వారికి ఇన్సెంటివ్‌లు కూడా ఇచ్చి ప్రోత్సహించాలని, ఎస్‌ఈబీకి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఎస్‌ఈబీ పనితీరుపై ప్రతివారం సమావేశమై సమీక్ష నిర్వహించాలని, వచ్చే 15 రోజుల్లో కచ్చితంగా మెరుగైన ఫలితాలు రావాలన్నారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ఇదీ ఎస్‌ఈబీ పురోగతి
► స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటైన గతేడాది మే 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► మద్యం అక్రమాలపై 79,632 కేసులు నమోదు. 4,85,009 లీటర్ల మద్యం, 12,766 లీటర్ల బీరు, 4,54,658 లీటర్ల నాటుసారా పట్టివేత. 1,12,70,123 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. 2,85,142 కేజీల నల్లబెల్లం, 22,715 వాహనాలు స్వాధీనం. మద్యం అక్రమాలకు పాల్పడ్డ 240 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు. 
► ఇసుక అక్రమాలపై 7,244 కేసులు నమోదు. 4,79,692 టన్నుల ఇసుక స్వాధీనం. 9,689 వాహనాలు సీజ్‌.
► ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడ్డ 22 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు. మద్యం, ఇసుక అక్రమాలకు పాల్పడ్డ 82 మంది పోలీసులపై కూడా కేసులు నమోదు.
► ఇతర అక్రమాలపైనా ఎస్‌ఈబీ కొరడా ఝళిపించింది. 1,00,979 కేజీల గంజాయి, 90,97,628 గుట్కా ప్యాకెట్లు, 1,120 ఎర్రచందనం దుంగలు పట్టివేత. పేకాట శిబిరాలపై దాడులు.. రూ.4.92 కోట్లు స్వాధీనం. 

మరిన్ని వార్తలు