CM YS Jagan: ప్రజల దీవెనలు మన వైపే 

3 Nov, 2022 03:40 IST|Sakshi
మండపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం: సీఎం

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు పంపిణీ చేస్తున్నాం 

అందుకే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు 

ఇలాంటప్పుడు మీరూ, నేను కలిసికట్టుగా పనిచేస్తే 2024 ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ సాధ్యమే 

మండపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం 

ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి  

ఇప్పటి వరకు మండపేట నియోజకవర్గ ప్రజలకు డీబీటీ కింద రూ.946 కోట్ల లబ్ధి 

ప్రతి గ్రామంలో 92% ఇళ్లకు సంక్షేమ పథకాలు 

వచ్చే ఎన్నికల్లో తోట త్రిమూర్తులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి  

సాక్షి, అమరావతి: ‘వికేంద్రీకరణతో సుపరిపాలన.. లంచాలకు తావు లేకుండా, వివక్ష చూపించకుండా, అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తుండటం వల్ల రాష్ట్ర ప్రజల దీవెనలు మన వైపు కన్పిస్తున్నాయి. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మీరూ, నేనూ కలిసికట్టుగా పనిచేస్తే 175 శాసనసభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమే’ అని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు. ‘డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) కింద సంక్షేమ పథకాల ద్వారా బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం నా బాధ్యత.

అది నేను నిర్వర్తిస్తా. మీరంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకుపోవడమే కాకుండా.. వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇలా మీరూ, నేనూ కలిసికట్టుగా పనిచేస్తే 2024 ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయగలుగుతాం’ అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వారితో సమావేశమయ్యారు.

ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండపేట నియోజకవర్గానికి చేసిన మంచిని, అభివృద్ధిని గణాంకాలతో వివరించారు. వచ్చే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

అన్ని విధాలా సన్నద్ధం కావాలి 
► మిమ్నల్ని కలవడానికి, ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి మిమ్మిల్ని కలిసి చాలా రోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే.. రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. ఇంత త్వరగా ఎందుకని అనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సహజం. కానీ.. మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. వాటన్నింటినీ ప్రజలకు చెప్పాలి. 

► రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి 2 వేల జనాభాకు 12 మంది ఉద్యోగులను  అక్కడే కూర్చుని పనిచేసేట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లను ఒక వలంటీర్‌తో అనుసంధానం చేసి.. అర్హత ఉన్న ప్రతి గడప, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల కింద మంచి చేయాలని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని శాచ్యురేషన్‌ (సంతృప్త) విధానంలో అడుగులు వేశాం. 

► మూడేళ్ల నాలుగు నెలల్లోనే ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లను డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్‌ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాల ద్వారా మేలు చేశాం. ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా చెబుతున్నాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. 

175కు 175 ఎందుకు గెలవం? 
► మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఎన్ని పథకాలు అందాయి అని.. ఆధార్‌ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలిగే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం.  

► గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92% ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా.. పథకాలు అందాయని అక్కచెల్లెమ్మలు చల్లని ఆశీస్సులు మనమీద చూపించినప్పుడు ఆ గ్రామంలో మనం తప్పకుండా గెలుస్తాం. 

► గ్రామంలో గెల్చినప్పుడు నియోజకవర్గంలో గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గంలో గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175కు 175 ఎందుకు రావు?  

► మండపేట మున్సిపాలిటీతో సహా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల లెక్క తీసుకుంటే.. మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 23, జెడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌ స్వీప్‌ చేశాం. 

కళ్లెదుటే కన్పిస్తున్న మార్పు 
► ప్రతి గ్రామంలో కళ్లెదుటే కొట్టొ్టచ్చినట్టు మార్పు కన్పించేలా అభివృద్ధి పనులు చేశాం. గ్రామంలోకి అడుగుపెడుతూనే సచివాలయం కనిపిస్తుంది. వలంటీర్‌ వ్యవస్థ కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతోంది. ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తాయి. శరవేగంగా డిజిటల్‌ లైబ్రరీలు కట్టే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం. ఇవన్నీ గతంలో లేనివి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయి.  

► గతంలో పిల్లలు చదువుకునే వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఇంగ్లిష్‌ మీడియం బడులు మన గ్రామాల్లో వస్తున్నాయి. విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా మన గ్రామంలోనే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంతా ఒకేచోట ఉంటూ.. 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తారు.  

► 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేసేట్టుగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ క్రియేట్‌ చేసి ఊర్లోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇంత మార్పు గతంలో జరగలేదు. వికేంద్రీకరణ (డీసెంట్రలైజేషన్‌) ఈ స్థాయిలోకి వెళ్లి మంచి చేయాలన్న ఆరాటం గతంలో లేదు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి. వై నాట్‌ 175? కచ్చితంగా జరుగుతుంది.  

► ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ హాజరయ్యారు.

మరింత మంచి చేయడానికే.. 
► రాష్ట్రంలో ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి, వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని మరింత సమర్థంగా అడుగులు వేసేందుకు మిమ్మల్ని భాగస్వాములను చేస్తున్నాం. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. 

► మన ఎమ్మెల్యేగానీ మన ఎమ్మెల్యే అభ్యర్థిగానీ గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్థ,  మండల స్థాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ.. మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే, అటువంటి వారికి మేలు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. 

► ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఈ నిధులతో ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యతగా ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలు అంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. అందువల్ల ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు.. ఒక్కో రోజు కనీసం 6 గంటలు గడపాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి.   

మరిన్ని వార్తలు