కుప్పం నుంచి ఆరంభం.. 175కు 175 లక్ష్యంగా అడుగులు

4 Aug, 2022 03:35 IST|Sakshi

నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సీఎం భేటీకి ప్రణాళిక

175 స్థానాల్లో విజయమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం

నేడు 60 మంది కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ

చంద్రబాబు కంచు కోటను స్థానిక ఎన్నికల్లో బద్దలుకొట్టిన వైఎస్సార్‌సీపీ

జగన్‌ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించిన కుప్పం ప్రజలు.. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే 2024లో కుప్పంలో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం

ఇదే విషయాన్ని శ్రేణులకు విశదీకరించనున్న సీఎం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్‌ పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల 18న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. లక్షలాది కుటుంబాలు వైఎస్సార్‌సీపీపై ఆధారపడ్డాయని, ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

2019 ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని, అది కష్టం కానే కాదని స్పష్టంచేశారు. ఆగస్టు 4 నుంచి నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశమై దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. నెలకు 10 నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలి సమావేశం గురువారం సాయంత్రం కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో జరుగుతోంది.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, అందిస్తున్న సుపరిపాలనపై సీఎం జగన్‌ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. మూడేళ్లుగా చేసిన మంచిని, రాబోయే కాలంలో చేయబోయే మంచిని ఇంటింటికీ వెళ్లి.. వివరించాలని, జనంతో మమేకమవ్వాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి ఇది దోహదం చేస్తుంది.

బాబు చేజారిన కుప్పం
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి కుప్పం నియోజకవర్గం కంచు కోట. 1989 నుంచి 2019 వరకూ నాలుగా దశాబ్దాలుగా చంద్రబాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈ కంచు కోటను ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బద్దలు కొట్టింది. చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు కుప్పం నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ 87 శాతం కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఇది కుప్పం నియోజకవర్గ ప్రజలు గుర్తించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ  క్లీన్‌ స్వీప్‌ చేసేలా మద్దతుగా ఓట్లేశారు. దాంతో.. కుప్పం నియోజకవర్గం చంద్రబాబు చేతుల్లోంచి జారిపోయింది. ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోయే దుస్థితికి దిగజారింది. ఇదే చిత్తశుద్ధి, అంకితభావం, పట్టుదలతో పనిచేస్తే 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని సీఎం వైఎస్‌ జగన్‌ కార్యకర్తలకు విశదీకరించనున్నారు.

బూత్‌ స్థాయి నుంచే దుష్ఫ్రచారం తిప్పికొట్టేలా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించి, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి నెలా పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును జమ చేస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో కూడిన దుష్టచతుష్టయం ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తోంది. దాన్ని బూత్‌ స్థాయి నుంచే ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కార్యకర్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. సోషల్‌ మీడియా సైన్యంగా ఏర్పడి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతోపాటు.. దుష్టచుతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలని చెప్పనున్నారు.

నిత్యం జనంతో మమేకమయ్యేలా గడప గడపకూ నేతలు
సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనాన్ని, అభివృద్ధి పథకాల ద్వారా గ్రామంలో జరిగిన ప్రగతిని ప్రతి ఒక్కరికీ గుర్తు చేయాలనే లక్ష్యంతో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు మూడేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబ సభ్యులకు చేసిన మంచిని వివరిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను వారికి అందజేస్తున్నారు. టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాను అర్థమయ్యేలా వివరిస్తూ.. ఆశీర్వదించాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు