ఆటంకాలున్నా.. అభివృద్ధి బాటే

22 Jun, 2022 05:01 IST|Sakshi

సంక్షేమాన్ని అడ్డుకోవడమే విపక్షం ఏకైక అజెండా: సీఎం జగన్‌

గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పనుల పూర్తికి ప్రాధాన్యం

రోడ్ల నిర్మాణంతోపాటు మెరుగైన నిర్వహణకు కార్యాచరణ 

జూలై 15 కల్లా మునిసిపాలిటీల్లో రోడ్ల పనులు పూర్తి.. 20న అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు

మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే 2 లేన్ల రోడ్ల పనులకు ప్రాధాన్యం

మరమ్మతులకు నాడు ఐదేళ్లలో రూ.1,300 కోట్లు.. ఇప్పుడు మూడేళ్లలోనే రూ.2,400 కోట్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల  పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపట్టి వేగంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. జూలై 15వతేదీ కల్లా మునిసిపాలిటీల్లో రహదారులపై గుంతలు పూడ్చి ఆ వెంటనే జూలై 20 నాటికి అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రెండు లేన్ల రహదారుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

గత సర్కారు హయాంలో రోడ్ల మరమ్మతుల కోసం ఐదేళ్లలో రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మూడేళ్లలోనే రూ.2,400 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోవాలని ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నా సడలని సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆర్‌అండ్‌బీ.. పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో జరుగుతున్న రహదారుల పనులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ...
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తేడా కచ్చితంగా కనిపించాలి
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. నాడు – నేడు ద్వారా చేపట్టిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. గతంలో పనులు ప్రారంభమై ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. వీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎక్కడా పెండింగ్‌లో లేకుండా చూడాలి. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఫలితాలు కచ్చితంగా కనిపించాలి.

అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలి. నివర్‌ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త వంతెనల నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు వెంటనే చేపట్టాలి.

రూ.2,205 కోట్లతో మరమ్మతులు
ఆర్‌ అండ్‌ బీ పరిధిలో రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక పనుల కింద 7,804 కి.మీ. మేర 1,168 పనులు చేపట్టాం. వాటి కోసం ప్రభుత్వం రూ.2,205 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 675 పనులు పూర్తి కాగా మరో 491 కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 62.09 శాతం పనులను రూ.1369 కోట్లతో ప్రభుత్వం పూర్తి చేసింది.

మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలి. నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (నిడా–1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.2,479.61 కోట్లతో 233 పనులు  చేపట్టాం. ఇప్పటికే రూ.1,321.08 కోట్ల విలువైనవి పూర్తి చేశాం. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలి. 

వ్యత్యాసాన్ని వెల్లడించేలా ఫొటో గ్యాలరీలు
రోడ్ల నిర్మాణమే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై పంచాయతీరాజ్‌ శాఖ కార్యాచరణ సిద్ధం చేయాలి. 1,843 రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా 4,635 కి.మీ. మేర రహదారులు మెరుగుపడనున్నాయి.

గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చురుగ్గా మరమ్మతులు చేపట్టాలి. మునిసిపాలిటీల్లో జూలై 15 కల్లా గుంతలు పూడ్చాలి. జూలై 20న నాడు – నేడు ద్వారా వ్యత్యాసాన్ని తెలియచేసేలా అన్ని చోట్లా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి.

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్‌ అండ్‌ బీ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌దండే, పురపాలక శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు 
రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వకుండా కొందరు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. కేసులు వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పనులు ఆగిపోవాలనే ఏకైక అజెండాతో ప్రతిపక్షాలు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాం.

ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాం.  

>
మరిన్ని వార్తలు