ఇది మామూలు విషయం కాదు.. సీఎం జగన్‌ సరికొత్త రికార్డ్‌..

22 Dec, 2022 12:04 IST|Sakshi

ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక ఆశయం, ఒక విధానం, ఒక మార్గం, ఒక దిశ... ఇవన్ని మనకు జీవితంలో చాలా మంది పెద్దవారు, చాలామంది తత్వవేత్తలు బోధించే పదాలు.. వీటిని ఆచరించడం అందరికి సాధ్యం కాదు. అలా సాధించగలిగినవారు నాయకులు అవుతారు. మార్గదర్శకులు అవుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రజా నాయకుడుగా రూపాంతరం చెందడంలో వీటిలో పలు అంశాలు కీలకంగా కనిపిస్తాయి. ఆయన తన లక్ష్యాన్ని తానే ఎంపిక చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అనుసరించిన సంక్షేమ, అభివృద్ది విధానాన్నే  ఆశయంగా పెట్టుకున్నారు.

ఇంత పట్టుదలతో తన గమ్యం చేరుకున్న నాయకుడిగా, సినీ గ్లామర్‌ను మించి ప్రజాకర్షణలో సరికొత్త రికార్డును సృష్టించిన అధినేతగా జగన్ పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా తట్టుకుని నిలబడ్డ అతికొద్ది మంది నేతలలో ఆయన ఒకరు. ఆయన వెన్నుపోట్లతోనో, ఎదురుపోట్లతోనో అధికారంలోకి రాలేదు. కేవలం ప్రజలను నమ్ముకుని వారి విశ్వాసాన్ని చూరగొని ముఖ్యమంత్రి అయ్యారు. అనూహ్య పరిస్థితులలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడుగా జగన్ ఎంచుకున్న మార్గం చాలా క్లిష్టతరమైనది, కష్టమైనది.

తన దారిలో ముళ్లు ఉంటాయని తెలిసినా, అదే మార్గంలో ఆయన వెళ్లారు. కొండను ఢీకొంటున్నావని సన్నిహితులు హెచ్చరించినా వెనక్కి తగ్గని మనస్తత్వమే ఆయనను విజయతీరాలకు చేర్చింది. అంతా అనుమానించినట్లుగానే ఆనాటి అత్యంత శక్తిమంతమైన నేత సోనియాగాంధీ కక్షకు జగన్ గురి కావల్సి వచ్చింది. ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి కేసులు పెట్టించారు. జైలుకు పంపారు. బెయిల్ రాకుండా పదహారు నెలలపాటు ఉంచగలిగారు. అయినా జైలులో ఉండే తన పవర్ ఏమిటో చూపించారు. 18 ఉప ఎన్నికలు జరిగితే 15 చోట్ల తన కొత్త పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు.

తద్వారా తనపై ప్రజలలో ఎంత అభిమానం ఉందో చాటిచెప్పగలిగారు. బహుశా రాజకీయాలలోకి వచ్చిన అనతికాలంలోనే ఇంతగా కష్టాలు పడిన నేత దేశంలో మరొకరు ఉండకపోవచ్చు. అయినా ఆయన సాహసంతో నిలబడగలిగారు. ధైర్యంతో పరిస్థితులను ఎదిరించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలలో 2014లో తన పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పుడు పార్టీని ఖతం చేయడానికి కొందరు ప్రయత్నించకపోలేదు. అయినా ఆయన నిలబడి పోరాడారు. 23 మంది ఎమ్మెల్యేలను ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసినా ఏ మాత్రం చలించలేదు.

వారిలో నలుగురికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చి అప్రతిష్టపాలైతే, ఆ ఘట్టాన్ని తనకు అనుకూలంగా మలచుకుని మొత్తం ప్రజాభిప్రాయాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఆయన వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీమ్‌ను ఎంపిక చేసుకుని వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పావులు కదిపారు. 2017లో ఎన్నికల ఎజెండాను ప్రకటించినప్పుడు ఇదంతా అయ్యేపనేనా?అని అనుకున్నవారే ఎక్కువ మంది ఉంటారు. కాని పాదయాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్లి పేదల గుండెల తలుపుతట్టారు. తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో వివరించి వారి మద్దతు కూడగట్టారు. తండ్రి మాదిరి ప్రజాభిమానం చూరగొనాలన్న ఆశయాన్ని పెట్టుకున్న జగన్ ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా  ప్రజల ఆదరణ చూరగొంటున్నారు.

ఎన్నికల మానిఫెస్టో ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందులోను వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నప్పుడు మరీ కష్టం. అందుకే ఆయన ప్రజలలోనే నిత్యం సంచరించి తానేమిటో రుజువు చేసుకున్నారు. 2014 నాటి ఓటమి అనుభవం ఆయనకు విజయసోపానం అయింది. ఎన్నికల వ్యూహాలు ఎంత పదునుగా, ఎంత తెలివిగా ఉండాలో ఆయన నేర్చుకున్నారు. సొంత మామనే పదవి నుంచి పడవేసి, అధికారాన్ని కైవసం చేసుకున్న  చంద్రబాబు  నాయుడును చాలా మంది వ్యూహరచనలో సిద్దహస్తుడిగా భావిస్తారు.

తెరచాటు రాజకీయాలు చేయడంలో కాని, కుట్రలు పన్నడంలో కాని చంద్రబాబు నేర్పరి అని అనుకుంటారు. అప్పటికే 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును పదవి నుంచి దించడం అంటే అయ్యే పనేనా అనుకుంటున్న తరుణంలో అదేమీ కష్టం కాదని, కుట్ర రాజకీయాల కన్నా, ప్రజా రాజకీయాల ద్వారానే అది సాధ్యమని స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు సాగి తన లక్ష్యాన్ని చేరుకున్న నేత జగన్. అందువల్లే జగన్‌కు 151 సీట్లతో ప్రజలు పట్టం కట్టారు. సామాజిక సమీకరణలన్నీ  తనవైపే ఉండేలా చూసుకున్న అసలైన వ్యూహకర్త ఈయనే అని చెప్పవచ్చు.

ముఖ్యమంత్రి అయిన తొలిరోజే తాను ప్రభుత్వ సారధిగా కులం చూడను, మతం చూడను, రాజకీయ పార్టీని చూడను, ప్రాంతాన్ని చూడను, అర్హులైన ఎవరికైనా ప్రభుత్వ స్కీములు వర్తింప చేస్తానని  చెప్పి అదే పద్దతి పాటిస్తున్న నేత జగన్. ఆయన ముఖ్యమంత్రి అవడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపడం మరో ఎత్తుగా ఉంది. తన ఎన్నికల మానిఫెస్టోని మంత్రులు, అధికారుల ముందు దానిని అమలుపర్చాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల మానిఫెస్టోని వెబ్‌సైట్ల నుంచి తొలగించిన టీడీపీకి, తన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏమిటో ఆయన అందరికి తెలిసేలా చేసి చూపించారు.

అంతేకాదు. ప్రతిపక్ష టీడీపీ వారు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నా, ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం విశేషమే. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నన్ని మార్పులను పాలన వ్యవస్థలో తీసుకు వచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిది. వలంటీర్ల వ్యవస్థను సృష్టించారు. గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి ప్రజల గడపవద్దకు పాలనను చేర్చిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే.

గతంలో టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధిస్తే, జగన్ అలాంటివేమీ లేకుండా, ఏ స్కీము ప్రయోజనం అయినా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా చేయడంలో సఫలం అయ్యారు. తత్ఫలితంగా సంక్షేమ పదకాల అమలులో అవినీతి లేకుండా చేయగలిగారు. అది సరికొత్త రికార్డు అని చెప్పాలి. ఇలా ఒకటేమిటి!. రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్, స్కూళ్ల లో నాడు-నేడు, ఆంగ్ల మీడియంలో బోధన, విద్యాదీవెన, గోరుముద్ద, సిబిఎస్, ఈ విధానం, ఆస్పత్రులలో నాడు-నేడు, పల్లెలకు డాక్టర్ లు, ఆరోగ్యశ్రీలో  చికిత్సకు అర్హమైన వ్యాధుల సంఖ్యను 3వేలకు పైగా పెంచడం, చేయూత, వృద్దులకు పెన్షన్ పెంచడమే కాదు. ప్రతి నెల మొదటి రోజే వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అందించడం అంటే మామూలు విషయం కాదు.
 చదవండి: పేదోడి కోసం ఓ సీఎం ఇంతలా పరితపిస్తారా?

అది జగన్ సాధించారు. కేవలం సంకల్ప బలంతోనే ఆయన చేయగలిగారు. అభివృద్దిపరంగా చూస్తే గతంలో ఏ సీఎం దృష్టి కేంద్రీకరించని తీర ప్రాంత అభివృద్దిని ఆయన తలపెట్టారు. పోర్టులు, పిషింగ్ హార్బర్లు, పలు పరిశ్రమలు రావడానికి వీలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ ఒన్ స్థానం, కొప్పర్తి పారిశ్రామికవాడ, వేల కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, విశాఖలో ఐటి అభివృద్ది, ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు యత్నాలు మొదలైవన్ని ఆయన చేపట్టారు.

ఇవన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల జగన్ మరోసారి విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. జగన్ ఎంత బలంగా ఉన్నారంటే ఒంటరిగా పోటీచేస్తే ఆయనను ఏమీ చేయలేమని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు బహిరంగంగానే ఒప్పుకుంటున్నాయి. ఎలాగొలా పొత్తులు పెట్టుకుని ఫైట్ ఇవ్వాలని ఆ పార్టీలు యత్నిస్తున్నాయి.

ప్రజలలో ఆయనను వ్యతిరేకించేవారు సైతం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భావిస్తున్నారు. దానికి కారణం ఆయా వర్గాలలో ముఖ్యంగా పేదలలో ఆయన ఆపారమైన అభిమానం చూరగొన్నారు. పేదవర్గాలకు,పెత్తందార్లకు మధ్య పోటీ అన్న నినాదాన్ని ఆయన తీసుకువచ్చారు. జగన్ గెలిస్తేనే తమకు సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయని పేదలు భావిస్తున్నారు. ఇలా తనదైన శైలిలో ముఖ్యమంత్రిగా పదవి నిర్వహిస్తున్న ఆయనకు సవాళ్లు లేవని అనజాలం. మూడు రాజధానుల అంశం, ఆర్ధిక ఇబ్బందులు మొదలైవని ఉన్నా, జనంలో తీరుగులేని నేతగా జగన్ ఎదిగారు. ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
​‍-హితైషి, పొలిటికల్‌ డెస్క్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు