మా నీళ్లు.. మా హక్కు

6 Oct, 2020 02:57 IST|Sakshi

రాయలసీమ ఎత్తిపోతల ద్వారా మా వాటా నీటిని మాత్రమే వాడుకుంటాం

తెలంగాణకు ఏమాత్రం విఘాతం కలగదు

శ్రీశైలంలో 800 అడుగుల నుంచే తెలంగాణకు రోజూ 2.95 టీఎంసీలు తరలించే సామర్థ్యం

శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కులు తరలింపు

841 అడుగులకు తగ్గితే చుక్క నీరు చేరదు

ఫలితంగా నీటి కేటాయింపులున్నా రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తిని తీర్చలేని దుస్థితి

అందుకే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టాం

తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారుచేసి.. వర్కింగ్‌ మాన్యువల్‌ను జారీచేయాలి

లేదంటే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, సాగర్‌ కుడి కాలువను మా అధీనంలోకి తేవాలి

అపెక్స్‌ కౌన్సిల్‌లో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం

సాక్షి, అమరావతి: ట్రిబ్యునల్‌ కేటాయించిన జలాలు మా రాష్ట్ర హక్కు.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్న విషయాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌కు స్పష్టంచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు సోమవారం ఢిల్లీకి వచ్చిన ఆయన.. రాత్రి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో అపెక్స్‌ కౌన్సిల్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ వివరాలు..

► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ ద్వారా రోజూ 2.95 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. అదే నీటి మట్టం నుంచి నీటిని తరలించడానికే రాయలసీమ ఎత్తిపోతలను చేపడితే తప్పేంటని ప్రశ్నించాలని నిశ్చయించారు.
► అలాగే, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా 796 అడుగుల నుంచే రోజూ నాలుగు టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. ఈ సీజన్‌ ఆరంభంలో సాగర్‌లో నీటి నిల్వలున్నా.. కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరించి తెలంగాణ నీటిని తరలిస్తోందని.. దీనివల్లే నీటిమట్టం తగ్గిపోతోందన్న అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలోకి ప్రస్తుతమున్న డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయని.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 20 రోజులు కూడా ఉండదనే వాస్తవాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌కు వివరించనున్నారు.
► నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటే కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయని.. అదే 841 అడుగులకు చేరితే కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసినా నీటిని తరలించలేమని వివరించనున్నారు.
► దీనివల్ల తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ ఆయకట్టులో సాగునీరు, తాగునీటికి ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పనున్నారు. 
► దీనికి పరిష్కారంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం మినహా మరొక మార్గంలేదని స్పష్టం చేయనున్నారు.
► రాయలసీమ ఎత్తిపోతల ద్వారా వాటాకు మించి ఒక్క చుక్కను కూడా అదనంగా తరలించబోమని.. పాత ఆయకట్టుకే నీళ్లందిస్తామని.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టంచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలి
► కృష్ణా బోర్డు ఏర్పాటై ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ దాని పరిధిని ఖరారు చేయకపోవడం.. వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదించకపోవడంపై అపెక్స్‌ కౌన్సిల్‌ను ప్రశ్నించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. 
► ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతలను ఏపీకి అప్పగించారని.. కానీ, ఎడమ గట్టు కేంద్రాన్ని తెలంగాణ అధీనంలో ఉంచారని.. అదే సాగర్‌ నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు అప్పగించారని.. కానీ, ఏపీ భూభాగంలో ఉన్న సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను తెలంగాణ అధీనంలో ఉంచడంపైనా ప్రశ్నించనున్నారు. 
► తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి.. శ్రీశైలం, సాగర్‌లను బోర్డు పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేయనున్నారు. అలాకాని పక్షంలో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంతోపాటు ప్రాజెక్టును పూర్తిస్థాయలో ఏపీ అధీనంలోకి తేవాలని.. సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీ పరిధిలోకి తీసుకొచ్చేలా కోరాలని నిర్ణయించారు. 

న్యాయబద్ధంగానే నీటిని పంపిణీ చేయాలి
► కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు వెలువడే వరకూ 2015లో జూన్‌ 18, 19న కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.
► కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ప్రతిపాదించనున్నారు. 
► బేసిన్‌లో జూన్‌ 2, 2014 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను పంపిణీ చేయాలని అపెక్స్‌ కౌన్సిల్‌ను కోరనున్నారు. 
► గోదావరి బోర్డు పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదించాలని కోరనున్నారు.   

>
మరిన్ని వార్తలు