CM YS Jagan: ఇచ్చిన మాటకు మించి మేలు

30 Jul, 2022 03:23 IST|Sakshi
వేదికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్న మహిళ

మేనిఫెస్టోలో లేకున్నా వైఎస్సార్‌ కాపు నేస్తం తీసుకువచ్చాం

మూడో విడత నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్‌

3,38,792 మందికి రూ.508 కోట్ల లబ్ధి 

మూడేళ్లలో కాపు అక్క,చెల్లెమ్మలకు రూ.32,296 కోట్లు 

ఏటా రూ.వెయ్యి కోట్లుగా ఐదేళ్లలో రూ.5 వేల కోట్లిస్తామన్న బాబు 

కనీసం రూ.1,500 కోట్లు కూడా ఇవ్వకుండా మోసం

గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘కాపులకు మేలు చేస్తామని చెప్పినట్టుగానే చేసి చూపించాం. మేనిఫెస్టోలో పెట్టకున్నా మనసున్న ప్రభుత్వం కాబట్టే వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. మూడేళ్లుగా నిరాటంకంగా కాపు మహిళలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు ఏటా రూ.1,000 కోట్ల వంతున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి కాపులను మోసం చేశారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

మనం చెప్పిన మాటకు మించి మేలు చేశామన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద 3,38,792 మంది కాపు మహిళల ఖాతాల్లో రూ.508 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇది మనసుతో స్పందించే ప్రభుత్వం అన్నారు. అక్క చెల్లెమ్మలు, రైతులు, పేదల ప్రభుత్వం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలతో పాటు ప్రతి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకూ తోడుగా నిలిచామన్నారు. కాపు నేస్తం పథకం కింద ఈ మూడేళ్లలో రూ.1,492 కోట్లు  అందించామని చెప్పారు.

అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయిన వారికి ఈ నెల 19న రూ.1.8 కోట్లకు పైగానే జమ చేశామన్నారు. నవరత్న పథకాల ద్వారా ఈ మూడేళ్లలో ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన అక్కచెల్లెమ్మలకు, కుటుంబాలకు డీబీటీ, కాపు కార్పొరేషన్‌ ద్వారా ఏకంగా రూ.16,256 కోట్లు అందించామని వివరించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టే పథకాలు, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.16 వేల కోట్ల లబ్ధి కలిగించామని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


వైఎస్సార్‌ కాపు నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

మేలు చేసినందుకే మీ ఆశీర్వాదాలు
2.46 లక్షల మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి పట్టాల విలువే రూ.12 వేల కోట్లు. 1.2 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు రూ.2 వేల కోట్లు ఇస్తామన్నాం. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. మూడేళ్లు కూడా తిరక్క ముందే రూ.32,296 కోట్లు ఇవ్వగలిగాం.
నవరత్నాల పథకాల ద్వారా అన్ని వర్గాల వారినీ ఆదుకున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. అందువల్లే ఇవాళ ధైర్యంగా గడప గడపకూ వెళుతున్నాం. మీ ఆశీర్వాదం అందుకుంటున్నాం.  
మెట్ట ప్రాంత రైతుల స్వీయ ప్రయోజనాల దృష్ట్యా నాన్న (రాజశేఖరరెడ్డి) గారి హయాంలోనే ఏలేరు ప్రాజెక్టును చేపట్టి మొదటి విడతలో 60 శాతం పనులు చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న వారు లేరు. ఆ అంచనాలు ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి. 
ఎమ్మెల్యే దొరబాబు అన్న అభ్యర్థన మేరకు ఏలేరు ఫేజ్‌–1 ఆధునికీకరణకు రూ.142 కోట్లు, ఏలేరు ఫేజ్‌–2కు మరో రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇది కాకుండా పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాల్టీలకు రూ.20 కోట్లు చొప్పున రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. 

జన స్పందన అనూహ్యం 
సభకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సీఎం జగన్‌ వేదిక వద్దకు రాక మునుపే సభా స్థలి మహిళలతో నిండిపోయింది. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో బయట వాహనాలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కోలకతా–చెన్నై జాతీయ రహదారిలో గొల్లప్రోలు వద్ద అటు, ఇటు నాలుగు కిలోమీటర్లు మేర జన సముద్రాన్ని తలపించింది. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించడం కొంత సేపు కష్టతరంగా మారింది. సభలో సీఎం ప్రసంగం సాగిన 30 నిమిషాల పాటు మహిళలు, యువత జై జగన్‌.. థ్యాంక్యూ సీఎం సార్‌.. అంటూ నినదించారు.  

మరిన్ని వార్తలు