ఎమ్మెస్సార్‌ మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

27 Apr, 2021 11:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎం.సత్యనారాయణరావుకు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా ఎమ్మెస్సార్‌ పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం.​ ఎమ్మెస్సార్‌ మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతి..
విజయవాడ: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ పాదయాత్రలో ఎమ్మెస్సార్ వెన్నంటే ఉన్నారని మల్లాది విష్ణు అన్నారు.

చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత 
కోవిడ్‌ కట్టడికి త్రిముఖ వ్యూహం

మరిన్ని వార్తలు