దర్శి దాహార్తి తీరేలా.. ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్‌

26 Jan, 2023 17:34 IST|Sakshi

గట్టెక్కనున్న తాగునీటి కష్టాలు

నీటి సమస్య పరిష్కారానికి రూ.121 కోట్ల నిధులు మంజూరు

50 ఏళ్ల ముందు చూపుతో ప్రణాళికలు

పులిపాడు చెరువులో మిగులు భూమి 96 ఎకరాలు కేటాయింపు

చెరువు కింద పొలాలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు 

దర్శి పట్టణవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రూ.121 కోట్లు మంజూరు చేశారు. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక టెండర్లు పిలవడమే తరువాయి. దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

దర్శి(ప్రకాశం జిల్లా): దర్శి పట్టణంలో 33,500 మంది జనాభా నివశిస్తున్నారు. అధికారికంగా పన్ను చెల్లిస్తున్న నివాసాలు 8,800 ఉండగా అనధికారికంగా 10 వేలకు పైగానే ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో ఉన్న నిమ్మలబావి కనెక్షన్లు 600, ఆర్‌డబ్ల్యూఎస్‌ కనెక్షన్లు 60, వీధి కుళాయిలు మరో 960 ఉన్నాయి. ప్రస్తుతం మూడు రోజులకు ఒక సారి నీరు అందుతోంది. 

50 ఏళ్లు నీటి ఇబ్బందులు అధిగమించేలా:  
మరో 50 ఏళ్లు ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చి నీటి ఇబ్బందులు అధిగమించేలా సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మిస్తున్నారు. ఈ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో 1600 మిలియన్‌ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రోజుకు 9 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేలా ప్రణాళికలు చేశారు. రోజుకు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీరు సరఫరా చేస్తారు. 

కేటాయింపు ప్రణాళికలు ఇలా.. 
ఈ ప్రాజెక్ట్‌కు రూ.121 కోట్లు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేశారు. నాలుగు విభాగాలుగా పనులకు ప్రణాళికలు రూపొందించారు.  సాగర్‌ కాలువ నుంచి ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ (సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌)కు నీరు రావడానికి, సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్, ఫుట్‌ బ్రిడ్జి, ఇంటేక్‌ వెల్‌ ల నిర్మాణానికి, నీటి సరఫరా లైన్‌లకు, స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మాణాలకు రూ.8938.67 లక్షలు కేటాయించారు. రెండో విభాగంలో 7 సంవత్సరాల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు రూ.660.85 లక్షలు కేటాయించారు. మూడో విభాగంలో జీఎస్టీ ఇతర చార్జీలు రూ.1752.64 లక్షలు కేటాయించగా నాలుగో విభాగంలో ఏపీఎస్‌పీ డీసీఎల్, ప్రైజ్‌ వేరియేషన్స్, కన్సల్టెన్సీ చార్జెస్, ల్యాండ్‌ కేటాయింపునకు, ఇతర అవసరాలకు రూ.747.84 లక్షలు మంజూరు చేశారు.  

ఈ ప్రాజెక్ట్‌ను దర్శి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ముండ్లమూరు మండలం పులిపాడు చెరువు వద్ద నిర్మిస్తారు. ఆ చెరువుకు మొత్తం 250 ఎకరాలు భూమి ఉంది. చెరువు నిండితే 120 నుంచి 150 ఎకరాల భూమిలో నీరు నిల్వ ఉంటుంది. 100 ఎకరాల నుంచి 130 ఎకరాల వరకు చెరువుకు మిగులు భూమి ఉంది. అందులో 96 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్‌కు సేకరించారు. ప్రత్యేకంగా రావాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్, నీటి శుద్ది కర్మాగారాలు, స్టాఫ్‌ క్వార్టర్స్‌ వంటి సౌకర్యాలకు భూమిని ఉపయోగిస్తారు. సాగర్‌ కుడి కాలువ నుంచి నేరుగా చెరువులోకి నీరు వచ్చేలా పైప్‌ లైన్‌ ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి ప్లాంట్‌లో శుద్ధి చేసి పైప్‌లైన్‌ల ద్వారా పట్టణంలోని ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు.  

వీధి పంపులకు చెక్‌:  
ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్ట్‌ పూర్తయితే మహిళలు వీధి కుళాయిల వద్ద లైన్‌లో నిలబడి నీరు పట్టుకోవాల్సిన పని లేదు. నేరుగా ఇంట్లోకే తాగు నీరు పైప్‌ లైనుల ద్వారా చేరేలా ప్రణాళికలు చేశారు. వారి సమయం కూడా వృథా కాదు. పాత పైప్‌ లైనులు బాగున్న చోట అవే లైన్‌లు ఉంచి, నీరు అందని ఎత్తు పల్లాల వద్ద నూతన పైప్‌ లైన్‌లు వేస్తారు. దీంతో ప్రతి ఇంటికి నీరు కచ్చితంగా చేరుతుంది. 

పరోక్షంగా పట్టణ అభివృద్ధి:  
తాగునీటి ఇబ్బందులు అధిగమిస్తే నివాసాలు ఉండేవారు ఎక్కువ చొరవ చూపుతారు. దీంతో దర్శిలో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా పట్టణం కూడా వ్యాప్తి చెందుతుంది. 

శిథిలావస్థలో నెదర్లాండ్‌ చెరువు 
35 సంవత్సరాల క్రితం సాగర్‌ కాలువ నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన తాగునీటి రిజర్వాయర్‌ మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉంది. అప్పటి జనాభా ప్రకారం ప్రణాళికలతో నిర్మించిన నిర్మాణాలు, పైపులైన్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పట్టణం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రాజెక్ట్‌ పూర్తయితే ఇబ్బందులను అధిగమించవచ్చు.

మరిన్ని వార్తలు