AP: పక్కాగా ఈ-పంట

6 Aug, 2022 02:28 IST|Sakshi

నమోదు ప్రక్రియను ప్రతిరోజు నిశితంగా పరిశీలించాలి

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా– పీఎంఎఫ్‌బీవై అనుసంధానం

తద్వారా రైతులకు గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా చర్యలు  

ఖరీఫ్‌ సీజన్‌లో ఏ దశలోనూ ఎరువుల కొరత రానీయొద్దు

డ్రోన్ల ఏర్పాటుకు రైతు కమిటీలు.. మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ 

విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, పంట ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం 

యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మరిన్ని పరికరాలు 

ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్‌ ఏర్పాటుకు త్వరితగతిన రైతు కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి కమిటీలో ఇంటర్‌ ఆ పై చదువుకున్న రైతు ఉండేలా చూడాలి. వారిని డ్రోన్‌ పైలెట్‌లుగా గుర్తించి.. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో ఐటీఐ/పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌లో ఈ–పంట నమోదు పక్కాగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడా చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం ఇవ్వని రీతిలో వంద శాతం పంట నమోదు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో అనుసంధానిస్తూ ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచే అమలు చేస్తున్నందున రైతులకు గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను ప్రతి రోజూ నిశితంగా పరిశీలించాలని, నమోదైన తర్వాత ప్రతి రైతుకు భౌతిక, డిజిటల్‌ రశీదులు ఇవ్వాలని చెప్పారు. ఈ– పంట నమోదుతో పాటు వేలి ముద్రలు తీసుకోవడానికి ఉపయోగిస్తున్న ఈకేవైసీని ఇక నుంచి నో యువర్‌ క్రాప్‌ (మీ పంట తెలుసుకోండి) అంటూ ప్రచారం చెయ్యాలని సూచించారు. వెబ్‌ల్యాండ్‌లో ఏక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని  వెంటనే సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని, ఆర్బీకేల్లోని వ్యవసాయ, రెవెన్యూ సహాయకులు ఈ–పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్‌ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఇన్‌పుట్స్‌ నాణ్యతపై దృష్టి సారించండి
– ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి. ప్రస్తుత సీజన్‌లో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి. 
– ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ, ఎరువుల సరఫరా ఇన్‌పుట్స్‌ పంపిణీ, అందిస్తోన్న సేవలు, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై వ్యవసాయ సహాయకుల నుంచి ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలి. ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్‌ పని చేసేలా చర్యలు తీసుకోవాలి. వాటికి సవ్యంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందా? లేదా? అన్న దానిపై నిరంతరం పరిశీలన చేయాలి. అవి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే.
– వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలి. వ్యక్తిగత పరికరాల పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయ్యాలి.  
– మండలానికి 3 ఆర్బీకేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 2 వేల ఆర్బీకేల పరిధిలో డ్రోన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. తొలుత మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలి.

18.8 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ పంటలు
– ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు. ఆగష్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. ఖరీఫ్‌ సీజన్‌లో 36.82 లక్షల హెక్టార్ల మేర పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని వివరించారు.
– ఖరీఫ్‌ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్స్‌ సెంటర్‌) ద్వారా ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్నామని, సాగవుతున్న ప్రతి పంటను సాగు విస్తీర్ణంతో సహా జియో ట్యాగింగ్‌ చేయడమే కాకుండా, వెబ్‌ ల్యాండ్‌తో అనుసంధానిస్తున్నామని వివరించారు.
– ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయిప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ చేవూరు హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఇది కూడా చదవండి: మంచి మార్పుతో చరిత్ర లిఖిద్దాం.. మీతోడు అవసరం: రాజాం కార్యకర్తలతో సీఎం జగన్‌

మరిన్ని వార్తలు