లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి

19 Jul, 2022 03:30 IST|Sakshi
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌నకు హాజరైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

‘గడప గడపకు మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లో సీఎం వైఎస్‌ జగన్‌

ఈసారి మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలి

ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా

ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ క్యాలెండర్‌ అమలు చేస్తున్నాం

రానున్న నెల రోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి

16–21 రోజులు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలి

చిత్తశుద్ధితో, అంకితభావంతో, నాణ్యతతో కార్యక్రమాన్ని కొనసాగించండి

అప్పుడు 175కి 175 స్థానాల్లోనూ మనం గెలవడం ఖాయం

ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నా

జీవితంలో చిత్తశుద్ధి, అంకితభావంతో అడుగులు వేయకపోతే కుప్ప కూలుతాం... చిత్తశుద్ధి, అంకితభావంతో అడుగులు వేస్తేనే నిలదొక్కుకుంటాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో, అంకితభావంతో, నాణ్యతతో చేయండి. ప్రతి సచివాలయంలో గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో ప్రాధాన్యత ఉన్న పనులను పూర్తి చేయించే ఛాలెంజ్‌ నేను తీసుకుంటున్నా. దానికి సంక్షేమ పథకాల ద్వారా పారదర్శకంగా, నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేయడం తోడైతే ఎమ్మెల్యేలుగా మీకు మంచి పేరొస్తుంది. చిరస్థాయిగా ఎమ్మెల్యేగా నిలబడిపోతారు.
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు సీఎం జగన్‌ మార్గనిర్దేశం

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడ్డాయి... ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలి..’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. మునుపటికన్నా ఇంకా మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని, అది కష్టం కానే కాదని పునరుద్ఘాటించారు. సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే ప్రతి నెలా వివక్ష, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. ‘నేను చేయాల్సిందంతా చేస్తున్నా. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే నా ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా. ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేశా. ఇక చేయాల్సింది మీరే. చేసిన మంచిని ప్రజలకు వివరించి గతానికీ ఇప్పటికి తేడాను అర్థమయ్యేలా చెప్పి.. మనసు మనవైపు ఉండేలా వారికి గుర్తు చేసేందుకు చిత్తశుద్ధితో, అంకితభావంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యతతో చేయండి. మీరూ నేనూ కలసికట్టుగా సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం’ అని సూచించారు.  

మరింత మెరుగ్గా..
మూడేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేస్తున్న మంచిని, అందిస్తున్న సుపరిపాలనను ప్రజలకు చాటిచెప్పాలనే లక్ష్యంతో మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్కార్‌ చేపట్టింది. దీనిపై ప్రతి నెలా వర్క్‌షాప్‌ నిర్వహించి అభిప్రాయాలు తీసుకుని మరింత మెరుగ్గా నిర్వహించేలా చర్యలు చేపడతామని ఆదిలోనే సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు జూన్‌ 8న వర్క్‌షాప్‌ నిర్వహించారు. అందులో భాగంగా సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నాణ్యంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఏ కార్యక్రమంలోనైనా నాణ్యత ముఖ్యం..
జీవితంలో ఏ కార్యక్రమాన్నైనా నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటాం. అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యం. గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా అంకితభావం, చిత్తశుద్ధి, నాణ్యతతో చేయండి. పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నాం. ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాం. అభివృద్ధి పనులు చేపట్టాం. లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయి. మనం చేసిన మంచిన కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించారు కాబట్టే గతంలో ఎన్నడూ లేని రీతిలో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయగలిగాం. అలాంటప్పుడు 175కు 175 శాసనసభ స్థానాల్లో ఎందుకు గెలవలేం?

చేస్తున్న మంచిని గుర్తు చేయండి..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మీరు ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. అక్కచెల్లెమ్మలకు రాసిన లేఖలను మీరే చదివి వినిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందాయా? అని అడుగుతున్నారు. అందాయి.. అందాయి.. అంటూ ఆ అక్కచెల్లెమ్మలు సంతోషంగా చెబుతున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం మంచి చేయనప్పుడు... మనం ఇంత మంచి చేస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాల్లో ఎందుకు గెలవలేం? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న తేడాను అర్థమయ్యేలా వివరించి చేస్తున్న మంచిని చెబుతూ మనసు మనవైపు ఉండేలా అక్కచెల్లెమ్మలకు గుర్తు చేయడమే. అందుకు చిత్తశుద్ధితో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యంగా చేయాలి. 

ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు..
ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్‌ను నేను తీసుకున్నా. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చాం. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయిస్తున్నాం. సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం. ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబం«ధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బులు ఇస్తాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యత పనుల కోసం ఆ డబ్బు ఖర్చు చేయాలి. పనులు సూచించిన వెంటనే  ప్రారంభించి పూర్తయ్యేలా చూస్తాం. వచ్చే నెల రోజుల్లో కనీసం 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న నెల రోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి. కమిట్‌మెంట్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. గడప, గడపకూ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 175 నియోజక వర్గాలకు పరిశీలకులను నియమిస్తాం.

గ్రాఫ్‌ నిర్ణేతలు ప్రజలే: సజ్జల
వైఎస్సార్‌సీపీ ఐదేళ్లపాటు మాత్రమే అధికారంలో ఉండాలని రాలేదు.. ప్రజల ఆశీస్సులతో నిరంతరం అధికారంలో ఉండాలని కోరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోందని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు హాజరైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. లోపాలుంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారన్నారు. అందరం కలసి పనిచేస్తే విజయం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారన్నారు. ప్రజలే ఎమ్మెల్యేల గ్రాఫ్‌ను నిర్ణయిస్తారని తెలిపారు. గ్రాఫ్‌ పెరిగేందుకు సీఎం జగన్‌ కిటుకులు చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను సందర్శించాలని సీఎం సూచించారన్నారు. వచ్చే నెల రోజుల్లో కనీసం 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో అంకితభావంతో పాల్గొనాలని నిర్దేశించారన్నారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తే మహిళల పసుపు కుంకుమలు పోతాయన్న పవన్‌ వ్యాఖ్యలపై స్పందించడం వృథా అని పేర్కొన్నారు.

175 సీట్లే లక్ష్యంగా ముందుకు: మంత్రి అంబటి 
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని, మరింత మెరుగ్గా నిర్వహణపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాలకు రూ.2 కోట్ల చొప్పున సీఎం నిధులు కేటాయించారని చెప్పారు. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల ఫండ్‌ ఇవ్వనున్నారని తెలిపారు. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. రాష్ట్రంలో 85 శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, వైఎస్సార్‌ సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ‘సాటి నటి రోజాను ఆ రోజు టీడీపీ అవమానిస్తే పవన్‌ కళ్యాణ్‌ నోరు మెదపలేదు. చంద్రబాబు హయాంలో ముద్రగడను హింసిస్తే కనీసం స్పందించ లేదు’ అని అంబటి దుయ్యబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.  

మరిన్ని వార్తలు