Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!

24 Aug, 2021 03:04 IST|Sakshi

మారుమూలనున్న కులాన్నీ తలెత్తుకునేలా చేసిన వైఎస్‌ జగన్‌ 

56 కార్పొరేషన్లతో పాటు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో కచ్చితంగా సగం 

బీసీల కోసం చేయూత, ఆసరా, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం అమలు 

వివిధ పథకాల ద్వారా 26 నెలల్లో 3.24 కోట్ల బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.50,495 కోట్ల నగదు 

ఇతర పథకాలతో మరో 1.21 కోట్ల మందికి రూ.19,346 కోట్ల లబ్ధి  

చిత్తశుద్ధితో ఇన్ని అమలు చేస్తున్నా కనీసం ప్రస్తావించని ‘ఈనాడు’ 

బాబు హయాంలో ప్రత్యేక పథకాలేవీ లేవు... బీసీలకు రుణాలే దిక్కు 

నచ్చిన, లంచాలిచ్చిన వారికే సబ్సిడీలు.. వారికే బ్యాంకు రుణాలు 

అలా అధికారంలో ఉండగా ఇచ్చింది రూ.1,626 కోట్లు.. అదే ఘనమట!! 

అదిప్పుడు నిలిపివేశారంటూ అడ్డగోలు రాతలు 

సాక్షి, అమరావతి: బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌!!. బీసీలంటే అంతే!!. చంద్రబాబు దృష్టిలోనూ ఇంతే!!. వారికో ప్రత్యేక గుర్తింపునివ్వాలని... ఆర్థికంగానే కాక అధికారం కూడా ఇచ్చి బలోపేతం చేయాలని చంద్రబాబుకు తాను అధికారంలో ఉన్నపుడెప్పుడూ అనిపించలేదు. అలా అనిపించకపోవటం తప్పు అని ఆయనకు బాజా కొట్టే ‘ఈనాడు’కూ అనిపించలేదు. మా బాబు వాళ్లకేది విదిలిస్తే అదే గొప్ప... అన్న రీతిలో దాని వార్తాకథనాలు సాగిపోయాయి అప్పట్లో!. కానీ వైఎస్‌ జగన్‌ విషయంలో అలా కాదు.. వారిని సమాజానికి వెన్నెముకలా (బ్యాక్‌బోన్‌) చూశారు. అలా మార్చే పనిలో పడ్డారు. 56 బీసీ కార్పొరేషన్లకు స్థానమివ్వటమే కాదు... శాశ్వత బీసీ కమిషన్‌నూ ఏర్పాటు చేశారు. నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనులు అన్నింటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సగం వాటా ఇవ్వాల్సిందే అని తీర్మానించటమే కాక... ప్రతి అడుగులోనూ దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం

ఇవన్నీ ఒకెత్తు. గడిచిన 26 నెలల్లో బీసీలకు ఏకంగా రూ.54,878 కోట్ల నగదు అందజేయటం ఇంకో ఎత్తు. వివిధ పథకాల ద్వారా 3.44 కోట్ల మంది బీసీల ఖాతాల్లోకి ఈ నగదు నేరుగా చేరింది!. మరి ఇవన్నీ ‘ఈనాడు’కో... చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకో కనిపించవా? బాబు హయాంలో బీసీలకిచ్చిన అప్పులు మాత్రమే కనిపిస్తాయా? అవి ఇప్పుడివ్వటం లేదంటూ కథనాలేల? బీసీల అప్పుల కోసం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఐదేళ్లలో బాబు ప్రభుత్వమిచ్చింది రూ.1,695 కోట్లట! మరి వై.ఎస్‌.జగన్‌ హయాంలో పథకాల రూపేణా వారికి నేరుగా ఇచ్చిన రూ.54,878వేల కోట్ల నగదుతో పోలిస్తే అదెంత? ఈ నిజాలు రాయటానికి ‘ఈనాడు’కు మనసొప్పదెందుకు? బీసీల విషయంలో అసలు ‘ఏది నిజం?’.  

చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలే  కాదు... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ బ్యాంకు రుణాలే దిక్కు. ఆ రుణాలేమైనా ఉదారంగా వస్తాయా అంటే... అదీ లేదు. లంచాలు ఇచ్చిన వారికి... పార్టీ– ప్రభుత్వ పెద్దల చేత సిఫార్సులు చేయించుకున్న వారికి మాత్రమే!! ఎందుకంటే వారికే ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసేది. అలా విడుదల చేశాకే బ్యాంకులు రుణాలిచ్చేవి. అవి కూడా అరకొరే!!. ఇక బీసీల కోసమంటూ చంద్రబాబు సర్కారు ఒక్క పథకాన్ని అమలు చేస్తే ఒట్టు!. చదవండి: Telangana: విద్యాసంస్థల పునఃప్రారంభం.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు


వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పగ్గాలు చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు బీసీలను అప్పుల ఊబిలోకి నెట్టడమే ఆయనకిష్టం లేదు. అందుకే నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ వారికి వర్తింపజేశారు. మారుమూలనున్న చిన్న చిన్న బీసీ కులాలకు కూడా గుర్తింపునిస్తూ... ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వారిలో ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశారు. ‘‘మా కులం ఉత్తరాంధ్రలోని ఒక చిన్న ప్రాంతానికే పరిమితం. అలాంటిది మాకూ ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మేం కలలో కూడా ఊహించలేదు’’ అంటూ ఇటీవల ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎంపికైన మహిళ తండ్రి భావోద్వేగపూరితమయ్యారు. దీన్నిబట్టే వారికిచ్చిన ఈ గుర్తింపు వారిలో ఎంత ఆత్మ విశ్వాసాన్ని నింపిందో ఊహించొచ్చు.  

మీరు సగం.. ఏమీ తక్కువ కాదు 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే తక్కువేమీ కాదు. ఖచ్చితంగా సగం!! ఇదీ జగన్‌ ఆలోచన. ఆచరణలో కూడా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా దాన్ని అమలుచేస్తూనే వస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టులైనా, నామినేటెడ్‌ పనులైనా... ఈ సగాన్ని ఖచ్చితంగా పాటించి తీరుతున్నారు. అంతేకాదు! దీన్లో మహిళలకూ సమాన వాటా ఇవ్వాల్సిందేనంటూ... దాన్నీ అమలు చేస్తున్నారు. డెప్యూటీ సీఎం పదవి మాత్రమే కాదు... కేబినెట్లోనూ బీసీలకు పెద్దపీట వేశారు. మరి ఇంతటి చిత్తశుద్ధి... పోనీ దీన్లో ఓ 10 శాతమైనా చంద్రబాబులో ఏ కోశానైనా కనిపించిందా? లేనప్పుడు ‘ఈనాడు’ ప్రశ్నించలేదేం? ఇప్పుడు జరుగుతున్నదాన్ని ప్రశంసించడం సరే... ఉన్నది ఉన్నట్టు రాయరెందుకు? 

26 నెలల్లో ...రూ.54,878 కోట్ల నగదు బదిలీ 
‘మేనిఫెస్టోయే భగవద్గీత.. ఖురాన్‌... బైబిల్‌’ అని చెప్పే ముఖ్యమంత్రి జగన్‌... అందులో పేర్కొన్న విధంగా గత 26 నెలల పాలనలో 3.44 కోట్ల మంది బీసీల బ్యాంకు ఖాతాలకు  రూ.54,878 కోట్ల నగదును నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 1.27 కోట్ల మంది బీసీలకు రూ.21,981 కోట్లు లబ్ధి చేకూర్చారు. మరి బీసీలను అప్పులు పాలు చేయకుండా నేరుగా వారి ఖాతాలకు  నగదు బదిలీ చేయటం... ఇతర పథకాల ద్వారా వారిని అప్పులపాలు కాకలుండా ఆదుకోవటం ‘ఈనాడు’కు కనిపించవా? వాటిని ప్రస్తావించరెందుకు? ఇవన్నీ పక్కనబెట్టి రుణాల సంగతే చూసినా... బలహీన వర్గాలకు గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో బ్యాంకులు రూ.90,624 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఆ వర్గాలకిచ్చిన రుణాలు రూ.95,526 కోట్లకు చేరాయి. నిజానికి బాబు హయాంలోనూ బీసీలకు బ్యాంకు రుణాలు ఇంతకన్నా ఎక్కువేమీ లేవని సాక్షాత్తూ ఎస్‌ఎల్‌బీసీ నివేదికే చెబుతోంది.  

బీసీలకు ప్రత్యేకం... అధికారంలోనూ పెద్ద పీట... 
ఆర్థికంగానే కాదు. రాజకీయంగానూ బీసీల అభ్యున్నతి ప్రధానమనేది ముఖ్యమంత్రి జగన్‌ భావన. అందుకే వారికి రాజ్యాధికారంలోనూ పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జానాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చారు. వీటిలోనూ 50 శాతం మహిళలుండాలన్న నియమాన్ని మాత్రం వీడలేదు. నవరత్నాలతో బీసీల్లోని అర్హులందరికీ ఆర్ధిక ప్రయోజనం చేకూర్చటమే కాక బీసీల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రత్యేకగా వైఎస్సార్‌ చేయూత అందించారు. వైఎస్సార్‌ ఆసరా పేరిట స్వయం సహాయక బందాల్లోని బీసీ మహిళలకు ఆర్దిక సాయం... వారి కోసం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా... ప్రత్యేకంగా మత్స్యకార భరోసా... వైఎస్సార్‌ చేనేత పథకాలు అమలు చేస్తున్నారు. రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు పథకం అందించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీటిలో ఒక్కటీ అమలు చేయకున్నా... బీసీల ఊసే ఎత్తకున్నా... ‘ఈనాడు’ పెన్ను మాత్రం లేవలేదెప్పుడూ!!.  

మరిన్ని వార్తలు