YS Jagan: 4 వసంతాల నవచరిత

30 May, 2023 03:56 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టి నేటికి నాలుగేళ్లు 

సంక్షేమాభివృద్ధి పథంలో రాష్ట్రం పరుగులు

ముప్పై ఎనిమిది వేల స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. సకల సదుపాయాలతో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. గ్రామాల్లో రైతులకు భరోసానిచ్చేందుకు... ఏకంగా 10,778 ఆర్‌బీకేలు ఏర్పాటయ్యాయి. అవినీతికి తావులేని పౌర సేవల్ని ఏ ఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో కొత్తగా 1.34 లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ఇక ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65 లక్షల మందితో వలంటీర్ల సైన్యం వచ్చింది. వైద్యుల్లేరనే మాటకు తావులేకుండా 10,592 గ్రామ, పట్టణ హెల్త్‌ క్లినిక్‌లు సేవలందిస్తున్నాయి.  

వీటి ఫలితమేంటో తెలుసా..? 
► కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు ఇష్టంగా వెళుతున్నారు. రుచికరమైన భోజనం.. స్కూళ్లు తెరవకముందే చేతికందే పుస్తకాలు, యూ­నిఫామ్‌.. ఇంగ్లీషు విద్య.. ఎడ్యుటెక్‌ కంటెంట్‌తో అందే ట్యాబ్‌లు... ఏపీ పిల్లల్ని ర్యాంకర్లను చేస్తు­న్నాయి. విత్తనాల కోసం, ఎరువుల కోసం రోడ్డె­క్కాల్సిన అవసరం లేకుండా రైతుల్ని ఆర్‌బీకేలు చేయిపట్టి నడిపిస్తున్నాయి. విత్తు మొదలు పంట విక్రయం దాకా అన్ని సేవలూ అక్కడే. హెల్త్‌ క్లిని­క్‌­లోని ఫ్యామిలీ డాక్టర్‌... ఊళ్లలో మంచానపడ్డ వారికి ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నాడు. గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలన్నీ అందుతున్నాయి. అవ్వాతాతలకు వలంటీర్లు ఠంచనుగా పింఛన్‌ను తెచ్చి చేతిలో పెడుతున్నారు.  

► పేదలకు రేషన్‌ సరుకులూ ఇంటి ముంగిటకే వస్తున్నాయి. దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్‌లు పనిచేస్తున్నాయి. కాకపోతే... ఇవన్నీ సాధ్యమయింది కేవలం నాలుగేళ్లలో. 2019 మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత!!.  

► అందుకే ఇప్పుడు ఏపీ ఒక రోల్‌ మోడల్‌. సీఎంగా వైఎస్‌ జగన్‌ అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్‌బీకే, రేషన్‌ డోర్‌డెలివరీ, వలంటీర్‌ వ్యవస్థ... ఇలా అన్నిటినీ ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. కొన్ని అమలు చేస్తున్నాయి కూడా!. 

► ‘నిన్నటికన్నా నేడు బాగుంటే.. అదే అభివృద్ధి. ఊరైనా... మనుషులైనా’ అనేది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విధానం. ఈ సూత్రంతోనే ఆయన ప్రచారానికి విలువివ్వకుండా పని చేస్తూ పోతున్నారు. సొంతింటికి నోచుకోని 31 లక్షల కుటుంబాల్లో... మహిళలకు ‘పట్టా’భిషేకం చేశారాయన. వారికి ఇళ్ల పట్టాలివ్వటమే కాదు. ఇళ్ల నిర్మాణమూ భుజానికెత్తుకున్నారు. చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయింది కూడా. ఇక నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి... అమలు చేశారు. తన కేబినెట్లో, ప్రభుత్వ పథవుల్లో మహిళలకు సగభాగమిచ్చి... చేతల మనిషిగా చరిత్ర సృష్టించారు.  

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు (56 శాతం) అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్‌ 11న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో ఈ శాతాన్ని ఏకంగా 70కి పెంచారు. సామాజిక న్యాయానికి చుక్కానిగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ తన హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీనీ పంపకున్నా... జగన్‌ మాత్రం 8 సీట్లలో సగం బీసీలకే ఇచ్చారు. ఇక స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా భూముల సమగ్ర సర్వేని చేపట్టడమే కాక... రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన... నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు. 3 లక్షల ఎకరాలను ఆ జాబితాను తొలగించారు. చుక్కల భూములు, షరతులు గల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. 

ఇవన్నీ ఒకెత్తయితే పారిశ్రామికంగా వేసిన అడుగులు మరో ఎత్తు. ఏపీకి సువిశాల తీరప్రాంతం ఉందంటూ గత పాలకుల్లా మాటలకే పరిమితం కాకుండా... కొత్తగా నాలుగు పోర్టులు,  10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిషింగ్‌ ల్యాండ్‌లు, మూడు ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. మునుపెన్నడూ ఈ రాష్ట్రంవైపు చూడని... అంబానీ, అదానీ, జిందాల్, బంగూర్, భజాంకా తదితర దిగ్గజాలంతా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ వేదికగా విశ్వాసం వ్యక్తంచేయటమే కాక పెట్టుబడులూ పెడుతున్నారంటే... అది ముఖ్యమంత్రి దార్శనికతపై భరోసాతోనే. అందుకే... గడిచిన నాలుగేళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త చరిత్ర.     

మరిన్ని వార్తలు