AP: సహకారంతో పాడి పంట..

29 Sep, 2021 03:02 IST|Sakshi
ఫిష్‌ ఆంధ్రా లోగోను విడుదల చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి అప్పలరాజు, అధికారులు

పాడి రైతులకు ప్రయోజనం కలిగేలా సహకార వ్యవస్థ పునరుజ్జీవం: సీఎం జగన్‌

జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

అమూల్‌ రాకతో డెయిరీలు తప్పనిసరిగా పాల సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది

ఇప్పుడు పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకూ అదనపు ఆదాయం 

ఈ పోటీతో వారికి మరింత లాభం

పారదర్శక వ్యవస్థతో మహిళలకు మేలు జరుగుతుంది

ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఎంతోమంది పాడిపశువులు కొన్నారు

గత పాలకులు సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు

హెరిటేజ్‌ కోసం ఏ సహకార సంస్థనూ సరిగా నడవనివ్వలేదు

ఆక్వా రైతన్నలకు మరింత మేలు చేకూర్చేలా ప్రణాళికలు.. నేరుగా సబ్సిడీలు.. ఆక్వా హబ్‌ల్లో చిన్న రెస్టారెంట్ల ఏర్పాటుపై పరిశీలన

ఫిష్‌ ఆంధ్రా లోగో విడుదల చేసిన సీఎం

చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం 

సాక్షి, అమరావతి: గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార వ్యవస్థ తిరిగి బలోపేతం కావాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ ఆసరా, చేయూత లాంటి పథకాలను అందిపుచ్చుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్లో భాగంగా చాలా మంది మహిళలు పాడి పశువులను కొనుగోలు చేశారని చెప్పారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించి సబ్సిడీలు వారికి నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్‌ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సూచించారు. జగనన్న పాలవెల్లువ, మత్స్య శాఖలపై ముఖ్యమం‘త్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన పాలవెల్లువ మార్గదర్శకాలు, శిక్షణ కరదీపిక పుస్తకాలను ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ‘ఫిష్‌ ఆంధ్రా’ లోగోను విడుదల చేశారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

అమూల్‌ రాకతో పాడి రైతులకు ప్రయోజనం
అమూల్‌ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలు తప్పనిసరిగా సేకరణ ధరలు పెంచాల్సి వచ్చిందని, అమూల్‌ రాకతో పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకూ అదనపు ఆదాయం సమకూరుతోందని సీఎం పేర్కొన్నారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడి రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు.

బీఎంసీయూల కీలక పాత్ర 
మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం వైఎస్సార్‌ ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పాడి పశువులను కొనుగోలు చేసిన మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు బీఎంసీయూలను (బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు) నిర్మిస్తున్నామని, పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. బీఎంసీయూల ఏర్పాటు ద్వారా మరింత పారదర్శకత వస్తుందన్నారు.

మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంపు
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఆక్వాహబ్‌లు, మత్స్యసాగులో నూతన విధానాలు, రైతులకు మేలు చేకూర్చే అంశాలపైనా సీఎం జగన్‌ సమీక్షించారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేలా ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తెస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్‌ అయి 
రేట్లు తగ్గిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్‌దారులు కుమ్మక్కవుతున్నట్లు పలు దఫాలు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. 
దీనికి పరిష్కారంగా ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని తెలిపారు. 
 
ఎగుమతి మత్స్య ఉత్పత్తులపై అవగాహన
ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించి రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేలా నాణ్యమైన ఫీడ్, సీడ్‌ అందించడంతోపాటు దోపిడీ వి«ధానాలను అడ్డుకునేందుకే కొత్త చట్టాన్ని తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 

40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
ఆక్వా హబ్‌లు, అనుబంధ రిటైల్‌ దుకాణాల ద్వారా దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. జనవరి 26 నాటికి 75 – 80 హబ్‌లు, 14 వేల రిటైల్‌ ఔట్‌లెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లను సిద్ధం చేస్తామని వివరించారు. 10 ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల మార్కెట్‌లో సిండికేట్‌కు అడ్డుకట్ట పడి రైతులకు మంచి ధరలు వస్తాయని తెలిపారు.

పురోగతిలో ఫిషింగ్‌ హార్బర్ల పనులు
రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్లలో పనులు మొదలైనట్లు అధికారులు తెలిపారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో తొలివిడతగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది జూన్‌ – జూలై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధమవుతాయని వెల్లడించారు. మిగిలిన ఐదు ఫిషింగ్‌ హార్బర్ల పనులు ఈ డిసెంబర్‌లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈవో కే.మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఏ.బాబు, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్రకుమార్, అమూల్‌ ప్రతినిధులు తదితరులు సమీక్షకు హాజరయ్యారు.

జగనన్న పాలవెల్లువ ఇలా..
– 2020 నవంబర్‌లో పాడి రైతుల నుంచి 
71,373 లీటర్ల పాలు అమూల్‌ ద్వారా కొనుగోలు
–2021 ఆగస్టులో 14,46,979 లీటర్ల పాలు కొనుగోలు
– ఇప్పటివరకూ మొత్తం 1,10,06,770 లీటర్ల పాలు కొనుగోలు
– రోజూ సగటున అమూల్‌ కొనుగోలు చేస్తున్న పాలు 
6,780 లీటర్ల నుంచి 51,502 లీటర్లకు పెంపు

వ్యవస్థీకృతంగా ధ్వంసం..
‘‘గత పాలకులు సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు. వారి కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఏ సహకార సంస్థనూ సరిగా నడవనివ్వని పరిస్థితులను సృష్టించారు. సహకార రంగ డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించడంతో పాటు ప్రైవేట్‌ సంస్థలుగా మార్చుకున్నారు’’
– సీఎం జగన్‌   

మరిన్ని వార్తలు