ప్లాస్మా దాతలకు రూ.5 వేలు

1 Aug, 2020 03:41 IST|Sakshi

ప్రోత్సాహకంగా వారికి ఇవ్వండి  

కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స, మందులు, ఆహారం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించండి.. 

ప్రతి కోవిడ్‌ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ 

డిజిటల్‌ పద్ధతుల్లో ఆ ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు పొందుపర్చాలి 

ఆస్పత్రి వెలుపల బోర్డులో వాటిని వెల్లడించాలి.. ప్రతి రెండు గంటలకోసారి అప్‌డేషన్‌ చేయాలి 

అత్యవసర మందులు అందుబాటులో ఉంచండి 

విద్యా కానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి

సాక్షి, అమరావతి: కరోనా సోకిన వారికి మరింత మెరుగైన చికిత్స, సేవలపై దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ చికిత్స కోసం ఎంపిక చేసిన 138 ఆస్పత్రుల్లో సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు. చికిత్స, మందులు, ఆహారం, పారిశుద్ధ్యం.. ఈ నాలుగు అంశాలపై గట్టి పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో భర్తీ అయిన బెడ్లు, ఖాళీ అయిన బెడ్ల వివరాలను ఆస్పత్రి వెలుపల బోర్డు ద్వారా తెలియజేయాలని.. ఆ వివరాలను డిజిటల్‌ పద్ధతుల్లో అన్ని కోవిడ్‌ ఆస్పత్రులకూ అందుబాటులో ఉంచాలన్నారు. ప్లాస్మా థెరపీతో సానుకూల ఫలితాలు వస్తుంటే, దాన్ని ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి.. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేలు ఇవ్వాలన్నారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలిచ్చారు.
కోవిడ్‌19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

ఆస్పత్రుల వారీగా బెడ్లు, చికిత్స పొందుతున్న వారిపై ఆరా
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ఆస్పత్రులు, వాటిలో బెడ్లు, ఖాళీలు తదితర అంశాలపై సీఎం అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. మొత్తం 138 ఆస్పత్రుల్లో 36,778 బెడ్లు ఉన్నాయని, ఇందులో 14,450 బెడ్లలో బాధితులు చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు. మొత్తం 70,446 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇందులో 14,042 మంది ఆస్పత్రుల్లోనూ, 18,753 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ (క్వారంటైన్‌ కేంద్రాలు), 35,660 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. ఆక్సిజన్‌ లేదా వెంటిలేటర్‌ తరహా చికిత్స పొందుతున్న వారు 3,541 మంది అని వివరించారు. కాగా, గురువారం ఒక్కరోజే ఆస్పత్రుల నుంచి 1,436 మంది డిశ్చార్జి అయ్యారని సీఎంకు తెలిపారు. ఆక్సిజన్‌ బెడ్ల వివరాలను కూడా సీఎం ఆరా తీశారు. మొత్తంగా 28,911 బెడ్లను సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. 

ఆస్పత్రి వెలుపల బెడ్ల వివరాలు వెల్లడించాలి
ఆస్పత్రుల్లో బెడ్ల కేటాయింపు.. భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవాటి విషయంలో మెరుగైన విధానాన్ని పాటించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో సమాచారమంతా డిజిటిల్‌ పద్ధతుల్లో ఉండాలని ఆయన స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు ఈ డేటాను అప్‌డేట్‌ చేస్తూ అన్ని ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లకు అందుబాటులో ఉంచాలని.. ప్రతి కోవిడ్‌ ఆస్పత్రి వెలుపల బ్లాక్‌ బోర్డుపై భర్తీ అయిన బెడ్లు, ఖాళీ అయిన బెడ్ల వివరాలను వెల్లడించాలన్నారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో ఉన్న బెడ్‌ కేటాయింపు అక్కడే ఉన్న హెల్ప్‌ డెస్క్‌ ద్వారా జరగాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం హెల్ప్‌ డెస్క్‌లను బలోపేతం చేయాలని, ఆరోగ్యమిత్రలను అక్కడ పెట్టాలన్నారు. 

సూక్ష్మస్థాయిలో సమీక్షించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో అందించే సేవల్లో మెరుగైన పద్ధతులు అవలంబించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సూక్ష్మస్థాయిలో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. బెడ్లు, వైద్యం, మందులు, ఆహారం, పారిశుధ్యం బాగున్నాయా.. లేదా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రుల్లో ఈ అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ ఆస్పత్రుల్లో సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలని, జేసీలు దీనిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఇంకా రాబోయే రోజుల్లో కాల్‌ సెంటర్ల పనితీరు, కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలపై దృష్టిపెట్టాలన్నారు. కరోనాపై మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలిస్తే.. వాటిని ఎప్పటికప్పుడు ఖండించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ ఆ కథనాల్లో వాస్తవాలుంటే.. వాటిని పరిష్కరించాలన్నారు. 

అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి
అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలుంటే, దానిపై అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బాగా ఉపయోగపడితే.. ఈ విధానాన్ని ప్రోత్సహించాలని, ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేలు ఇవ్వాలన్నారు. మంచి భోజనం, ఇతరత్రా ఆరోగ్యపరమైన అవసరాల కోసం ఈ ప్రోత్సాహకం ఉపయోగపడుతుందన్నారు. 

స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక, మాస్క్‌లు
సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామని, విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మాస్కులు ఎలా వాడాలన్న దానిపై వారికి అవగాహన కూడా కల్పించాలన్నారు. 

ఏపీలో మరణాలు 0.98 శాతమే
కాగా, తొలుత ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎంకు అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.21 శాతం ఉంటే.. రాష్ట్రంలో 0.98 శాతం ఉందన్నారు. పాజిటివిటీ రేటు కూడా దేశవ్యాప్తంగా 8.71 శాతం అయితే, రాష్ట్రంలో 6.91 శాతంగా ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరణాల రేటును మరింత తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్‌ వ్యాప్తి, మరణాలు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వారు చెప్పారు. 

మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీలు పూర్తికావాలి
సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ప్రజారోగ్య రంగం బలోపేతానికి చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. కోవిడ్‌ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే.. ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, ఇతర ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం పురోగతిపై ఆరా తీశారు. మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తికావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు నిర్దేశించారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో టెండర్లు పిలుస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు