వైద్యం.. మరింత చేరువ    

22 Aug, 2020 02:52 IST|Sakshi

కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 287కు పెంపు 

కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌  

ఇప్పటికే ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 210 వరకు పెంచిన ప్రభుత్వం

పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, వైద్యులు, పారిశుద్ధ్యం, భోజనం 

కోవిడ్‌ విధుల్లో ఉన్న తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల పెంపు 

హెల్ప్‌ డెస్క్‌ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి 

ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై పర్యవేక్షణ కొనసాగాలి 

సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలి

రోగులకు ప్రతి చోటా సంతృప్తికర స్థాయిలో సేవలు అందాలి. అన్ని ఆసుపత్రులలో వైద్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కోవిడ్‌ కాల్‌ సెంటర్లు, హెల్ప్‌ డెస్క్‌లను సమర్థవంతంగా నిర్వహించాలి. పేషెంట్లకు అందిస్తున్న సేవలకు అనుగుణంగా కోవిడ్‌ ఆసుపత్రులకు రేటింగ్‌ ఇవ్వాలి.
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 ఆస్పత్రులను 287కు పెంచుతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యులు, మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ కార్యక్రమాల కోసం తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది జీతాలను పెంచాలని చెప్పారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. 

హెల్ప్‌ డెస్క్‌ల పనితీరు బావుండాలి 
కోవిడ్‌–19ను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం పలు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి 210 వరకు పెంచాం. ఇప్పుడు ఆ సంఖ్యను 287కు పెంచుకుంటూ వెళతాం. పేషెంట్లకు మంచి వైద్యం అందించడంలో భాగంగా కోవిడ్‌ కాల్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు మరింత సమర్థవంతంగా పని చేయాలి. రోగికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు, తగిన వైద్య సేవలు అందేలా ఆరోగ్య మిత్ర హెల్ప్‌ డెస్క్‌లు పని చేయాలి.  
– కోవిడ్‌ ఆసుపత్రుల్లో నిరంతరం ప్రమాణాలను పర్యవేక్షించాలి. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి సేవలు సక్రమంగా అందాలి. మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారి సందేహాలను నివృత్తి చేసే వ్యవస్థ సక్రమంగా ఉండాలి.  
– కోవిడ్‌ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న వాటిపై బాగా ప్రచారం చేయాలి. ప్రతి రోజూ ఈ అంశాలను పర్యవేక్షిస్తే నాణ్యమైన సేవలు అందుతాయి. 
– ‘ప్లాస్మా థెరపీ కొనసాగుతోంది. ఎక్కడా నెగటివ్‌ ఫలితం రాలేదు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మంచి సేవలు అందిస్తున్నాం. ఒక వేళ ఏ ఆసుపత్రిలో అయినా ఒక సదుపాయం లేకపోతే, మరో ఆసుపత్రికి పంపించినప్పుడు అడ్మిషన్‌ ప్రక్రియ లేకుండా నేరుగా వైద్యం అందుతోంది’ అని అధికారులు సీఎంకు వివరించారు. 
– సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
 
రిఫరల్‌ ప్రొటోకాల్‌ అమలు కావాలి 
– ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అన్ని ఆసుపత్రుల్లో అత్యుత్తమ సేవలు అందాలి. మనం ఆసుపత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలి. అన్ని చోట్ల విలేజ్, వార్డు క్లినిక్స్‌ నుంచి రిఫరల్‌ ప్రొటోకాల్‌ స్పష్టంగా అమలు జరగాలి. 
– ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించే ఆసుపత్రుల్లో ఆ సమాచారంతో పాటు, ఫిర్యాదులు చేసేందుకు కాల్‌ సెంటర్‌ నంబర్‌ పెట్టాలి. పేషెంట్‌కు వైద్యం అందించకుండా, అనవసరంగా రిఫర్‌ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని గట్టిగా చెప్పాలి.  
– పేషెంట్‌కు ఎక్కడైనా వైద్య సదుపాయం లభించకపోతే, అంబులెన్స్‌ ఏర్పాటు చేసి వైద్యం అందించే ఆసుపత్రికి పంపించాలి. 
– రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే రోజునే, వైద్యులు వారికి సూచించినంత కాలం ఆరోగ్య ఆసరా పథకం కింద ఆర్థిక సహాయం అందించాలి. ఆసుపత్రుల్లో ప్రసవం తర్వాత తల్లీ, బిడ్డ ఇంటికి వెళ్లేటప్పుడు ఆర్థిక సహాయం డబ్బులు తల్లి అకౌంట్‌లో పడేలా చూడాలి.  
 – దేశ వ్యాప్తంగా మరణాల రేటు 1.9 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో 0.9 శాతం 
– ఏపీలో గణనీయంగా పెరిగిన రికవరీ (72.29 శాతం) 
– ప్రతి మిలియన్‌కు 57,581 మందికి పరీక్షలు 
– శ్రీకాకుళంలో అత్యధికంగా ప్రతి మిలియన్‌కు 87,754 మందికి పరీక్షలు 
– కోవిడ్‌ విస్తరణ, వైరస్‌ నిరోధకంపై అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సర్వే 
– నమోదవుతున్న కేసుల్లో కోవిడ్‌ లక్షణాలు కనిపించని వారు అనంతపురంలో 99.5 శాతం, తూర్పుగోదావరిలో 92.8 శాతం, కృష్ణాలో 99.4 శాతం, నెల్లూరులో 96.1 శాతం  
– కోవిడ్‌తో మరణించిన వారిలో 71.66 శాతం పురుషులు, 28.34 శాతం మహిళలు 

కోవిడ్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు బాగుండాలి. పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉండాలి. ఆ మేరకు వీలైనంత త్వరగా నియామకాలు పూర్తి చేయాలి. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి. చికిత్స పొందుతున్న వారికి మంచి భోజనం అందించాలి.   

మరిన్ని వార్తలు