Andhra Pradesh: గాడినపడ్డ ఆదాయం

10 Feb, 2023 03:45 IST|Sakshi

గ్రాస్‌ జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు అధికం

డిసెంబర్‌కు జీఎస్టీ స్థూల వసూళ్లలో దేశ సగటు వృద్ధి 24.8 శాతం.. రాష్ట్రంలో 26.2 శాతం 

ధనిక రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీ వృద్ధి రేటు.. ఇప్పటివరకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయార్జన రూ.43,206.03 కోట్లు 

ఫిబ్రవరి 6 వరకు రూ.3,649 కోట్లు ఆర్జించిన గనుల శాఖ.. జనవరి నాటికి రవాణా శాఖ ఆదాయం రూ.3,657.89 కోట్లు

ఆదాయార్జన శాఖలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులను అధిగ­మించి రాష్ట్ర సొంత ఆదాయం గాడిన పడుతోందని, నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను చేరుకుంటున్నట్లు ఉన్నతా­ధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివే­దిం­చారు. దేశ సగటుతో పాటు పలు ధనిక రాష్ట్రాల కంటే అధికంగా జీఎస్టీ స్థూల (గ్రాస్‌) వసూళ్ల వృద్ధి నమోదవు­తున్నట్లు వివరించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

జీఎస్టీ స్థూల వసూళ్లలో దేశ సగటు వృద్ధి రేటు 24.8 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌ 26.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వృద్ధి రేటు పలు ధనిక రాష్ట్రాల కంటే అధికమని, తెలంగాణ (17.3%), తమిళనాడు (24.9%), గుజ­రాత్‌ (20.2 %) కంటే మెరుగైన వసూళ్లు నమోదవు­తు­న్నా­యని తెలిపారు. ఇది రాష్ట్రంలో వాణిజ్య కార్యకలా­పాలు అధికంగా జరుగుతున్నాయనేందుకు నిదర్శనమన్నారు. 
ఆదాయార్జన శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్, మంత్రులు, అధికారులు 

పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు
గతేడాది జనవరి నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.26,360.28 కోట్లు కాగా ఈ ఏడాది జనవరి నాటికి రూ.28,181.86 కోట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్‌ టాక్స్‌లతో కలిపి రూ.46,231 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా 94 శాతం అంటే రూ.43,206.03 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.

గతంలో సూచించిన విధంగా పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తెచ్చామని, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగుపడుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విధానాలను సరళీకరించడం, డేటా అనలిటిక్స్‌ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నట్లు వివరించారు.

సిబ్బంది సమర్థత పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలను చేపట్టడంతోపాటు పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందించే విధంగా టాక్స్‌ అసెస్‌మెంట్‌ను ఆటోమేటిక్‌ పద్ధతుల్లో అందించే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

డివిజన్‌ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మనకన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వాటి అమలు అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

100 శాతం లక్ష్యం చేరుకున్న గనుల శాఖ
గనులు, ఖనిజ శాఖ ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6వతేదీ వరకు రూ.3,649 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి గనుల శాఖ ఆదాయం రూ.2,220 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.5 వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామని చెప్పారు.

నిర్వహణలో లేని గనుల్లో కార్యకలాపాలు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రవాణా శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి రూ.3,852.93 కోట్ల  ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.3,657.89 కోట్లను ఆర్జించినట్లు వెల్లడించారు. రవాణా రంగంలో కోవిడ్‌ సంక్షోభ పరిస్థితులు సమసిపోయి నెమ్మదిగా గాడిలో పడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను మూడు దశల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె.నారాయణస్వామి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అటవీ పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌భార్గవ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, రవాణాశాఖ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయలు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ ఎం. గిరిజా శంకర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్, అటవీ అభివృద్ధి సంస్ధ సీజీఎం ఎం.రేవతి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌ రామకృష్ణ, ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి, గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు