నివర్‌ తుపాను.. అప్రమత్తంగా ఉందాం

25 Nov, 2020 02:39 IST|Sakshi
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

‘నివర్‌’ తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలి 

కలెక్టర్లు, ఎస్పీలు,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేసుకోండి.. రైతులకు జాగ్రత్తలు చెప్పండి 

చెరువులకు గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షించండి 

విద్యుత్‌కు అంతరాయం కలిగితే, వెంటనే పునరుద్ధరించాలి 

జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు కావాలి

సాక్షి, అమరావతి: ‘నివర్‌’ తుపాను నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. పంటలు దెబ్బ తినకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలని చెప్పారు. కోత కోసిన పంటలను రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తుపాను నేరుగా రాష్ట్రాన్ని తాకకపోయినా, తమిళనాడుకు చేరువలో, సముద్ర తీర ప్రాంతాలలో దాని ప్రభావం ఉంటుందన్నారు. రేపు (బుధవారం) సాయంత్రం నుంచి ఎల్లుండి (గురువారం) అంతా ప్రభావం ఉంటుందని, వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయని చెబుతున్నందున మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

ఆర్బీకేల ద్వారా రైతులను అప్రమత్తం చేయాలి
► నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 
► ఆర్బీకేల ద్వారా రైతులను అప్రమత్తం చేయాలి. ఒక వేళ పంటలు కోయకుండా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించాలి. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
► అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షాలు పడితే.. చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.
► కరెంటు సరఫరాకు అంతరాయం కలిగితే, వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధం చేసుకోండి. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రోజంతా పని చేసేలా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకోండి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఉండాలి. 

సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి
► ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించేలా తగిన పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచుకోండి. తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌లు అన్ని గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉన్నాయి. ఆ సమాచారం సిబ్బందికి, ప్రజలకు చేరవేసేలా చూడాలి.
► వైఎస్సార్‌ జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు లాంటి ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చోట్ల సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి.
► సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, వ్యవసాయ, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. 

అధికార యంత్రాంగం సంసిద్ధం
నివర్‌ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గురువారం సాయంత్రం తమిళనాడులోని మమాళ్ల్లపురం–కరైకల్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశముంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇప్పటికే అవసరమైన ప్రాంతాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. కోస్తా ప్రాంతంలోని అన్ని ఓడ రేవులలో ఒకటవ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. 
    – మేకతోటి సుచరిత, హోం మంత్రి     

మరిన్ని వార్తలు