Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు

28 Sep, 2021 02:01 IST|Sakshi

తుపాను మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం: ముఖ్యమంత్రి జగన్‌

ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రూ.1,000 చొప్పున సాయం

సహాయ శిబిరాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.వెయ్యి

శిబిరాల్లో నాణ్యమైన ఆహారం, తాగునీరు, మందులు

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులు

ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు

బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దు

మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలి

పది రూపాయలు ఎక్కువైనా నాణ్యత విషయంలో రాజీ పడొద్దు

రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదల

మానవ తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వేగంగా ఎన్యూమరేషన్‌ 

నష్టం అంచనాలు సిద్ధం చేసి రైతులను ఆదుకోవాలి

మానవ తప్పిదాలు జరగొద్దు
ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని, అందువల్ల వంశధార, నాగావళి తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని విడుదల చేయాలని, మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. దేవుడి దయవల్ల హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో గులాబ్‌ తుపాను లేదని, అయితే అతి భారీ, భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.

సాక్షి, అమరావతి: గులాబ్‌ తుపాను మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద వెంటనే రూ.ఐదు లక్షల చొప్పున చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితులకు సాయం అందించడంలో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని, డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యతగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. తుపాను బాధితులకు నాణ్యమైన ఆహారంతో పాటు మందులు, మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. పది రూపాయలు ఎక్కువైనా నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఉదారంగా ఉండాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుంచి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన  కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఇందులో పాల్గొన్నారు. తుపాను అనంతర పరిస్థితులు.. సహాయ చర్యలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.
 
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రతి అరగంటకూ సమాచారం సేకరిస్తూ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అక్కడే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్‌దాస్‌కు సూచించారు.

సీఎస్, జిల్లాల అధికారులతో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

విశాఖలో వేగంగా నీటి పంపింగ్‌..
బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. సహాయం చేయడంలో డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యతతో కూడి ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయ, పునరావాస శిబిరాలను ప్రారంభించాలని సూచించారు. విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 

ఆ కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి
ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని, ఆయా కుటుంబాలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1,000 చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షపు నీరు కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్‌ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, జనరేటర్లతో వాటర్‌ స్కీంలు నిర్వహించాలని ఆదేశించారు.
 
పంట నష్టం అంచనాలు రూపొందించాలి

పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలని, నష్టం అంచనాలు వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎన్యుమరేషన్‌ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 

సజావుగా రవాణా: సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌
శ్రీకాకుళం నుంచి సమీక్షలో పాల్గొన్న సీఎస్‌ అదిత్యనాథ్‌దాస్‌ తొలుత తుపాను అనంతర పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గంటకు 80 – 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని తెలిపారు. అక్కడక్కడా విరిగిపడ్డ చెట్లను తొలగించామని, జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాల్లో రవాణాకు ఎక్కడా ఆటంకం లేదని వెల్లడించారు. అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో నిమగ్నమై అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశామని వివరించారు. 

– క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) వి. ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, అడిషనల్‌ డీజీ ఏ.రవిశంకర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు