అధికోత్పత్తికి బీజం

1 Oct, 2020 03:17 IST|Sakshi
పీఓఎస్, ఎస్‌ఎంఎస్‌ సర్వీసు ప్రారంభంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌

రైతులకు ఎరువుల హోం డెలివరీ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

సచివాలయాల వద్ద 10,641 ఆర్బీకేల ఏర్పాటుతో సాగుకు మరింత తోడ్పాటు 

తద్వారా అన్నదాతలకు సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు

13.64 లక్షల మంది రైతులకు 6.9 లక్షల టన్నుల 15 రకాల విత్తనాల సరఫరా 

155251 నంబర్‌తో ఆర్బీకేల వద్ద ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌  

ఈ సెంటర్‌కు రైతుల నుంచి 46,500 కాల్స్‌ 

ఎరువుల కొరత ఉండదు: కేంద్ర సహాయ మంత్రి మాండవియా

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, పశు గ్రాస విత్తనాలు, చేపల ఫీడ్‌ తదితర అవసరాలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 2.17 లక్షల ఆర్డర్లు రాగా, 69,561 మెట్రిక్‌ టన్నులు రైతులకు సరఫరా చేశాం.

ఆర్బీకేల వద్ద డిజిటల్‌ పేమెంట్లు కూడా అనుమతిస్తున్నారు. ఇప్పటికే 38 వేల ఆర్డర్లకు డిజిటల్‌ పేమెంట్లు జరిగాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులకు సంబంధించి 2 లక్షల ఆర్డర్ల మేరకు సరఫరా చేశాం.
–సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడం వల్ల రైతులు అధికోత్పత్తి సాధించగలుగుతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ఏర్పాటు ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ కేంద్రాలు రైతులకు అన్ని విధాలా సహాయ కారిగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్‌బీకేల నుంచి రైతుల ఇళ్లకే నేరుగా ఎరువుల సరఫరా కోసం పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) వర్షన్, ఎస్‌ఎంఎస్‌ సర్వీసును బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. తద్వారా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) నుంచి రైతులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు ఎరువుల హోం డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
ఆర్బీకేల పనితీరుపై పదర్శించిన వీడియో చిత్రం 

 సంతోషంగా ఉంది..
► మీతో (కేంద్ర మంత్రులు) కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నేరుగా రైతులకు అందించడం వల్ల సాగు ఖర్చు తగ్గుతుంది.  
► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మే 30న 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటిలో డిజిటల్‌ కియోస్క్, స్మార్ట్‌ టీవీ, వైట్‌ బోర్టు, కుర్చీలు, డిజిటల్‌ లైబ్రరీతో పాటు, భూసార పరీక్షకు అవసరమైన ఉపకరణాలు ఏర్పాటు చేశాం.
► రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను డిజిటల్‌ కియోస్క్‌ల ద్వారా బుక్‌ చేసుకుంటే, 24 గంటల నుంచి 48 గంటలలోగా వాటిని సరఫరా చేస్తాం. 
► వీటి నిర్వహణ బాధ్యత కోసం బీఎస్సీ (అగ్రికల్చర్‌) గ్రాడ్యుయేట్లను వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, ఆక్వా సహాయకులుగా నియమించాం. వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, సహకార, నీటిపారుదల తదితర రంగాలన్నింటిలోనూ సేవలకు ఒకే వేదికగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి.
► ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు, పశు సంవర్థక, మత్స్యసాగుకు అవసరమైన వాటిని కూడా ఆర్బీకేల ద్వారా అందజేస్తున్నాం. అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం.  

 ఆర్బీకేలదే కీలక పాత్ర
► ఆర్బీకేల వద్ద 155251 నంబర్‌తో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. ఇప్పటి దాకా ఈ సెంటర్‌కు రైతుల నుంచి 46,500 కాల్స్‌ వచ్చాయి. 
► కోవిడ్‌ సమయంలోనూ 15 రకాల పంటలకు సంబంధించి 6.9 లక్షల టన్నుల విత్తనాలను 13.64 లక్షల రైతులకు ఆర్బీకేల ద్వారా సరఫరా చేశాం. ఈ–క్రాప్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 49.14 లక్షల మంది  రైతుల పేర్లు, 1.12 కోట్ల ఎకరాలలో సాగు చేస్తున్న పంటల వివరాలు నమోదు చేశాం. 
► లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తున్నాం. మార్కెట్‌ ఇంటెలిజెన్స్, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)  సమాచారం అందిస్తున్నాం. రైతుల సందేహాలు తీరుస్తున్నాం. ధాన్యం సేకరణ కేంద్రాలుగా కూడా ఆర్బీకేలు పని చేయనున్నాయి. పంట సాగుకోసం ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 ఇస్తున్నాం.
► ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

ఏపీ ముందంజలో ఉంది
కేంద్రం అమలు చేసే ఏ పథకానికి అయినా ఏపీ చాలా సహకరిస్తోంది. మా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రానికి ఎరువులు, పురుగు మందులు కావాలని సీఎం జగన్‌ పలుమార్లు కోరారు. ఆ మేరకు మేము సహకరించాం. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) బాగా సక్సెస్‌ అయింది. ఎరువుల పంపిణీలో ఎక్కడా అవకతవకలు జరగవు. లీకేజీ ఉండదు. ఇవాళ రైతులకు ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌తో పాటు, ఎరువుల హోం డెలివరీ ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.  రైతులకు మేలు చేయడంతో పాటు, ఈ రంగంలో సంస్కరణల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ముందంజలో ఉంది.  
– డీవీ సదానందగౌడ, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి

డ్యాష్‌ బోర్డుల ద్వారా రైతులకు ప్రయోజనం
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ నుంచి ఇవాళ రెండు మంచి పనులు మొదలవుతున్నాయి. దాదాపు 54 కోట్ల మంది రైతుల కోసం ప్రత్యేకంగా డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేశాం. దేశంలో ఏ మేరకు ఎరువుల ఉత్పత్తి జరిగింది? ఎంత స్టాక్‌ ఎక్కడ ఉంది? డిస్ట్రిబ్యూటర్స్‌ వద్ద ఎంత సరుకు ఉందన్నది ఆ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు. రైతులకు నేరుగా సబ్సిడీ చెల్లింపు వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. దేశంలోని అన్ని గిడ్డంగులలో ఎరువులు నిల్వ ఉంటాయి కాబట్టి కొరత ఉండదు. బుక్‌ చేసుకున్న 72 గంటల్లో రైతులకు ఎరువులు అందించడం నిజంగా అభినందనీయం. 
– మన్‌సుఖ్‌ మాండవియా, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి

>
మరిన్ని వార్తలు