తాడిపత్రిలో కోవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

4 Jun, 2021 13:27 IST|Sakshi

సాక్షి, అమరావతి/అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్‌ పడకల జర్మన్‌ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్‌ ఆస్పత్రిని నిర్మించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...
‘‘ కోవిడ్‌ టైంలో, ఆక్సిజన్‌ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్‌ స్టీల్‌కు ఎయిర్‌ సపరేషన్‌ ప్లాంట్‌ ఉండటం, అక్కడి నుంచి వారి ప్లాంట్‌ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్‌ ఆక్సీజన్‌ కెపాసిటీ ఉండడం, వారిని ఉపయోగించుకుని జర్మన్‌ హ్యంగర్‌లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పనిచేశారు. పేరుపేరునా అందరికీ అభినందనలు. అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తికి ప్రత్యేక అభినందనలు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిది’’ అని అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: పశ్చిమ గోదావరిలో ‘జగనన్న పాల వెల్లువ’కు సీఎం జగన్‌ శ్రీకారం 
సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్‌-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ

మరిన్ని వార్తలు