అనకాపల్లి గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా

3 Jun, 2022 15:35 IST|Sakshi

అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు.
చదవండి: అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్‌ లీక్‌! పలువురికి అస్వస్థత

బ్రాండిక్స్‌లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందరిని ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడ నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.

>
మరిన్ని వార్తలు