బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

10 Aug, 2020 04:48 IST|Sakshi

అగ్నిప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం 

ఘటనపై సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ 

సాక్షి, అమరావతి: విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే ప్రమాద కారణాలపై ఆరా తీశారు. అగ్నిప్రమాద వివరాలను, ప్రైవేట్‌ ఆస్పత్రి హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్‌ పేషెంట్లను అక్కడ ఉంచిన విషయాన్ని సీఎంవో అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, పూర్వాపరాలను తనకు నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

సీఎంకు ప్రధాని ఫోన్‌
అగ్నిప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకోవడానికి ప్రధాని మోదీ ఆదివారం సీఎం వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేశారు. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ ఓ హోటల్‌లో కరోనా పేషెంట్లను ఉంచిందని, తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రధానికి సీఎం తెలిపారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని, దురదృష్టవశాత్తూ కొంతమంది మరణించారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామని ప్రధానికి చెప్పారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధానికి సీఎం తెలిపారు. 

ప్రమాద పరిస్థితి అదుపులో ఉంది
విజయవాడలో జరిగిన దుర్ఘటన వివరాలను ప్రధానమంత్రికి ఫోన్‌ ద్వారా వివరించినట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించినట్లు తెలిపారు. ‘‘ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబసభ్యులు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాను అని’’ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా