పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. అయినప్పటికీ: సీఎం జగన్

12 Apr, 2021 19:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు.. అవును నిజమే.. తమ బాధ్యతను తాము సక్రమంగా నెరవేరుస్తున్న వారినే చాలా మంది టార్గెట్‌ చేస్తారు. సేవా భావంతో ముందుకు సాగుతున్నా.. వారిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. అయితే, వాటన్నంటిని తట్టుకుని నిలబడినపుడే మనం చేస్తున్న పనులకు మరింత సార్థకత చేకూరుతుంది. ఫలితం ఆశీర్వాదాల రూపంలో ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, అఖండ విజయం సాధించి, అధికారం చేపట్టిన ఆయన రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టడం సంక్షేమ పాలనను కొత్తపుంతలు తొక్కిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహమ్మారి కోవిడ్‌-19 ప్రబలుతున్న సమయంలోనూ సేవలు అందించారు. ఈ క్రమంలో, వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉగాది సందర్భంగా నేటి నుంచి వారిని సత్కరించి, అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కృష్ణాజిల్లాలోని పోరంకిలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా తీరుపై తనదైన శైలిలో స్పందించారు.

వారి పాపానికి వారిని వదిలేయండి
‘‘గొప్ప సేవాభావంతో పనిచేస్తున్న వలంటీర్‌ వ్యవస్థ మీద కూడా కొన్ని సందర్భాలల్లో ఎల్లో మీడియా గానీ, ప్రతిపక్షంలోని కొంత మంది నాయకులు గానీ అవాకులు, చెవాకులు మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా కూడా మీ జీవితాలల్లో మీరు క్రమశిక్షణతో మెలిగినంతకాలం ఎలాంటి విమర్శలకు కూడా వెరవవద్దు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. పండ్లున్న చెట్టు మీదనే రాళ్ల దెబ్బలు పడతాయి. కాబట్టి, వాళ్లు, మిమ్మల్ని ఏదో అంటున్నారని వెనకడుగు వేయవద్దు. వారి పాపానికి వాళ్లను వదిలేయండి. వారి కర్మకు వారిని వదిలేయండి. ధర్మాన్ని మీరు నెరవేర్చండి. ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నేను సందర్భంగా మరోసారి చెబుతున్నా’’ అంటూ సీఎం జగన్‌ వలంటీర్లలో స్ఫూర్తి నింపారు.

చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్‌: సీఎం జగన్
ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు

మరిన్ని వార్తలు