‘పశ్చిమ’లో రూ. 381 కోట్లతో అభివృద్ధి పనులు

5 Nov, 2020 02:41 IST|Sakshi
అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఏలూరులో శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధి, విస్తరణ, వంతెనల నిర్మాణం

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు

తమ్మిలేరు నుంచి ఏలూరు రక్షణకు గోడ నిర్మాణం

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 381 కోట్లతో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు, జిల్లాలోని రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటికి సంబంధించి ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియం సమీపంలో వీవీనగర్‌ బెయిలీ బ్రిడ్జి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు ఏలూరు నగరాన్ని తమ్మిలేరు వరద ముంపు నుంచి కాపాడేందుకు చేపట్టనున్న కాంక్రీటు గోడ నిర్మాణం నమూనా చిత్రాలను సీఎం వైఎస్‌ జగన్‌ తిలకించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. అక్కడే ఉన్న దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత జిల్లా మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మంచెం మైబాబు.. ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఏలూరు మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ దంపతుల కుమార్తె వివాహానికి సీఎం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పర్యటనలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని నాని, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులివే.. 
– ఏలూరు నగరానికి దుఃఖదాయినిలా మారిన తమ్మిలేరు నుంచి రక్షణకు తూర్పు, పశ్చిమ ఏటిగట్లను పటిష్టం చేస్తూ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ. 80 కోట్లతో కాంక్రీట్‌ గోడ నిర్మించనున్నారు. 
– జిల్లాలో గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ రోడ్లు విస్తరణ, అభివృద్ధి, వంతెనల నిర్మాణ పనులను ఫేజ్‌ 1 కింద రూ. 201 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 రోడ్లను 74.13 కిలో మీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి చేయటంతో పాటు వంతెనలు నిర్మిస్తారు. వీటిలో తణుకు– భీమవరం, పాలకొల్లు– ఆచంట, మేడపాడు– నర్సాపురం (వయా చించినాడ), కానూరు– లంకలకోడేరు, పెనుమంట్ర– వీరవాసరం, ఏలూరు– జంగారెడ్డిగూడెం, దెందులూరు– పంగిడిగూడెం, ఏలూరు– కైకలూరు, ఏలూరు– పెరికీడు తదితర రోడ్లున్నాయి. 
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ రూఅర్బన్‌ మిషన్‌ పథకం కింద ఏలూరు క్లస్టర్‌ దెందులూరు నియోజకవర్గంలో మొత్తం రూ. 100 కోట్ల విలువ గల పనులను చేపట్టగా, ఇప్పటికీ రూ. 24.14 కోట్ల విలువ కలిగిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా రూ. 75.86 కోట్లు విలువ కలిగిన పనులు చేపట్టనున్నారు. 

మరిన్ని వార్తలు