Nadu Nedu: మన అస్త్రం చదువే: సీఎం జగన్‌

17 Aug, 2021 03:19 IST|Sakshi
తూ.గో జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ తరగతి గదిలో విద్యార్థులకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌ అని రాస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

‘నాడు–నేడు’ ద్వారా రాష్ట్రంలో మొత్తం 57 వేల పాఠశాలల అభివృద్ధి

తొలి దశ స్కూళ్లలో పనులు పూర్తి.. విద్యార్థులకు అంకితం.. 2వ దశకు శ్రీకారం

విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ 

నూతన విధానంలో ఆరు రకాలుగా పాఠశాలలు

శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు.. ప్రతి హామ్లెట్‌లో శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌

కిలోమీటర్‌ లోపే ఫౌండేషన్‌ స్కూల్‌

3 కి.మీ. లోపు అందుబాటులో హైస్కూల్‌ వ్యవస్థ

కష్టం లేకుండా పిల్లలను చదివించేలా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం అండ

డిగ్రీ, ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రతి పేద విద్యార్థి హక్కుగా చదవాలి

రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థుల సంఖ్య 6 లక్షలకుపైనే

విద్యా కార్యక్రమాలకు రూ.32,714 కోట్లు వెచ్చించిన ఫలితం  

చిరునవ్వుతో చదివించేలా తోడుంటాం..
అక్కచెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా... ప్రతి బిడ్డకు మేనమామగా వారి భవిష్యత్తు బాగుండాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లలు బాగా చదవాలి. వారికి మనం ఇచ్చే ఆస్తి చదువే. వారి కాళ్లమీద వారు నిలబడాలని, పోటీ ప్రపంచంలో రాణించాలని, భవిష్యత్తు బాగుండాలని ఇవన్నీ చేస్తున్నాం. చదువు అనే అస్త్రంతో వారు పేదరికాన్ని జయించాలని కోరుకుంటున్నా. ఏ కష్టం లేకుండా, చిరునవ్వుతో తమ పిల్లలను చదివించేలా అక్కచెల్లెమ్మలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాం.  – ముఖ్యమంత్రి జగన్‌

సాక్షి, పి.గన్నవరం (తూర్పుగోదావరి): చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా రాష్ట్రంలో నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వార్షిక విద్యా నివేదిక (అసర్‌) ప్రకారం మూడో తరగతిలో ఉన్న విద్యార్థుల్లో 22 శాతం మంది మాత్రమే 2వ తరగతి పాఠ్య పుస్తకాలను చదవగలిగే స్థితిలో ఉన్నారని, ఇలాంటి దుస్థితిని తొలగించి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకే విద్యా సంస్కరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో ఆరు రకాలుగా స్కూళ్లు ఉంటాయని, మొత్తం 57 వేల పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు,. ఈ సందర్భంగా నాడు–నేడు ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తొలివిడత స్కూళ్లను విద్యార్థులకు అంకితం చేయడంతోపాటు రెండో విడత పనులను కూడా  ప్రారంభించారు. జగనన్న విద్యాకానుక కింద రెండో విడత స్టూడెంట్స్‌ కిట్లను పంపిణీ చేశారు. నూతన విద్యావిధానం వల్ల చేకూరే ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్‌ విడమర్చి చెప్పారు. ఆ వివరాలివీ.. 


పి.గన్నవరం పాఠశాలలో..: విద్యార్థినిని ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం జగన్‌ 
 
ఇకపై 6 రకాల స్కూళ్లు 
ఇక మీదట రాష్ట్రంలో స్కూళ్లన్నీ 6 రకాలుగా ఉంటాయి. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 1వ కేటగిరీలో పంచాయతీలకు అనుబంధంగా ఉండే హామ్లెట్‌ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌గా ప్రీ ప్రైమరీ 1 (పీపీ–1), ప్రీ ప్రైమరీ 2 (పీపీ–2)లతో ఉంటాయి. కిలోమీటర్‌ దూరంలోని ఫౌండేషన్‌ స్కూలుకు అనుబంధంగా ఇవి ఉంటాయి. 2వ కేటగిరీలో గ్రామం నుంచి కిలోమీటర్‌ దూరంలోనే ఫౌండేషన్‌ స్కూలు వస్తుంది. దీనిలో పీపీ –1, పీపీ –2తో పాటు 1, 2వ తరగతులుంటాయి. 3వ కేటగిరీలోని ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూలులో పీపీ –1, పీపీ –2, 1, 2, 3, 4, 5 తరగతులుంటాయి. 4వ కేటగిరీలో ప్రీ హైస్కూలులో 3 నుంచి 7 లేదా 8వ తరగతుల వరకు ఉంటాయి. 5వ కేటగిరీలోని హైస్కూలులో 3 –10 వరకు తరగతులు ఉంటాయి. 6వ కేటగిరీలోని హైస్కూలు ప్లస్‌లో 3 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూలుకు కిలోమీటర్‌ దూరంలోనే ఫౌండేషన్‌ స్కూలు, 3 కిలోమీటర్ల లోపే హైస్కూలు వ్యవస్థ అందుబాటులో ఉంటాయి. ఇలా ఈ 6 విభాగాల్లోకి వచ్చే 57 వేల స్కూళ్లను నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేస్తాం. దీనికోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.


పిల్లలతోపాటు బల్లపై కూర్చొని ముచ్చటిస్తున్న సీఎం   
 
దీనివల్ల మేలు ఏమిటంటే... 
‘అసర్‌’ నిర్వహించిన సర్వేలో 3వ తరగతి పిల్లాడికి 2వ తరగతి పుస్తకమిచ్చి చదవమంటే 22 శాతం మంది మాత్రమే చదవగలిగారు. మిగిలిన వారు చదవలేకపోయారు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చడానికే ఈ కార్యక్రమం చేపట్టాం. పేద పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మరి కొద్ది సంవత్సరాల తరువాత గ్రాడ్యుయేట్లు అవుతారు. వీరికి మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు రావాలి. వారి కుటుంబాలు రూపురేఖలు, వారి భవిష్యత్తు మారాలన్న తపన, తాపత్రయంతో చదువులపై ఇంతగా ధ్యాసపెట్టి అడుగులు వేస్తున్నాం. 
 
టీచర్, విద్యార్థి నిష్పత్తి సరిగా లేక.. 
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాల్సిన సబ్జెక్టులు 18 ఉండగా ఒక్క టీచరే ప్రతి క్లాసు, ప్రతి సబ్జెక్టుకు చెప్పడం వల్ల టీచర్, విద్యార్థి నిష్పత్తి అమలు కాకపోవడమే కాకుండా  సబ్జెక్టులపై ఫోకస్‌ లేక పిల్లలకు పూర్తి అవగాహన కలగడం లేదు. దీన్ని చక్కదిద్దుతూ ప్రతి సబ్జెక్టుకు, ప్రతి క్లాçసుకు ఒక టీచర్‌ ఉండేలా మార్పులు చేయడానికి స్కూళ్లను 6 కేటగిరీలుగా మారుస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్‌ ఉండాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నాం.  


విద్యాకానుక బ్యాగును పరిశీలిస్తున్న సీఎం
 
పిల్లల భవిష్యత్తు బాగుండాలని.. 
అక్కచెల్లెమ్మలకు ఒక తమ్ముడిగా, అన్నగా.. పిల్లలకు మేనమామగా వారి భవిష్యత్తు బాగుండాలని అనేక విద్యాకార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఎస్సీ నియోజకవర్గమైన పి.గన్నవరంలో ఈరోజు మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోవిడ్‌ కారణంగా దీర్ఘకాలం మూతబడిన బడులు ఈరోజు నుంచి తెరుచుకుంటున్నాయి. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ లాంటి సంస్థల సూచనలతో పాఠశాలలను తెరుస్తున్నాం. కోవిడ్‌ ప్రోటోకాల్‌ పూర్తిగా పాటించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకుని పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న చోట స్కూళ్లు తెరవాలని ఆదేశాలిచ్చాం. ఒక్కొక్క గదిలో 20 మందికి మించి విద్యార్థులు ఉండకుండా తరగతులు నిర్వహించాలి. అంతకన్నా ఎక్కువ మంది ఉంటే రోజు విడిచి రోజు వేర్వేరుగా నిర్వహించాలని సూచించాం. టీచర్లందరికీ వాక్సినేషన్‌ పూర్తి చేశాం. నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, విద్యావ్యవస్థలో మార్పులు, సీబీఎస్‌ఈ విధానం, ఇంగ్లీషు మీడియం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన  లాంటివన్నీ పేద కుటుంబాలకు మేలు జరిగేలా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవే.  


తాగునీటి స్వచ్ఛతను పరిశీలిస్తూ.. 
 
నాణ్యతలో రాజీలేకుండా విద్యాకానుక.. 
జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువులను నాణ్యతలో రాజీ లేకుండా అందచేస్తున్నాం. 2021 విద్యాసంవత్సరానికి విద్యాకానుక కింద మంచి స్కూలు బ్యాగు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు (ఒక పేజీలో తెలుగు, పక్కనే పేజీలో ఇంగ్లీషులో పాఠం ఉండేలా), నోట్‌ బుక్కులు, వర్కు బుక్కులు, బెల్టు, 2 జతల సాక్సులు, బూట్లు, కుట్టుకూలీ డబ్బులతో సహా మూడు జతల యూనిఫారంతోపాటు ఈసారి కొత్తగా డిక్షనరీ కూడా ఇస్తున్నాం. ఐదో తరగతి లోపు వారికి బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో డిక్షనరీలో పదాలతో పాటు బొమ్మలు కూడా ముద్రించాం. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డిక్షనరీ సైజ్‌ పెంచి విద్యాకానుక కిట్‌లో ఇస్తున్నాం. జగనన్న విద్యాకానుక ద్వారా రెండేళ్లలో రూ.1,380 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది 47.32 లక్షల మంది విద్యార్థులకు రూ.731 కోట్లతో కిట్లు అందిస్తున్నాం నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. లోపాలను సవరించి మంచి నాణ్యతతో కూడిన వస్తువులను పంపిణీ చేయించాం. పిల్లలు మోసేటప్పుడు ఇబ్బంది పడకుండా బ్యాగు బెల్టుల్లో కుషన్‌ కూడా పెట్టించాం. ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించి మరీ ఇస్తున్నాం. 
 
స్కూళ్లలో పలు సదుపాయాలు.. 
మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ బడులు, హాస్టళ్ల రూపురేఖలు మార్చి  కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నాం. పది రకాల అభివృద్ధి కార్యక్రమాలతో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు, టీచర్లుకు మంచి ఫర్నీచర్‌ ఏర్పాటు చేశాం. గ్రీన్‌ చాక్‌ బోర్డులు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మంచినీటి సదుపాయం కల్పించాం. రన్నింగ్‌ వాటర్‌తో మంచి టాయిలెట్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చాం. ప్రతి స్కూలుకు రంగులు వేయించి కాంపౌండ్‌ వాల్, ఇతర మరమ్మతులు చేయించాం. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు, గోరుముద్ద కింద రుచికరమైన, పరిశుభ్రమైన పదార్ధాల తయారీకి కిచెన్‌షెడ్లు, కట్టించాం. పిల్లల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంచేందుకు ఇంగ్లీషు ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. 
  
విద్యా కార్యక్రమాలకు రూ.32,714 కోట్లు 
ఈ రెండేళ్లలో కేవలం విద్యా రంగంలోనే వివిధ కార్యక్రమాల కోసం రూ.32,714 కోట్లు ఖర్చు చేశాం. రెండేళ్లలో జగనన్న అమ్మఒడి ద్వారా 44,48,845 మంది తల్లులకు రూ.13,023 వేల కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన కింద 18,80,934 మంది పిల్లలకు రూ.5,573 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మందికి రూ.2,270 కోట్లు ఇవ్వగలిగాం. గోరుముద్ద కింద 37 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.3,200 కోట్లకుపైగా ఖర్చు చేశాం. విద్యాకానుక కింద 47,32,064 మంది పిల్లలకు రూ.1,379 కోట్లు వ్యయం చేశాం. మనబడి నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్ల అభివృద్ధికి రూ.3,600 కోట్లకుపైగా వెచ్చించాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద 30.16 లక్షల మంది కోసం రూ.3,600 కోట్లు వెచ్చించాం.  


మరుగుదొడ్ల నాణ్యతను వీక్షిస్తున్న ముఖ్యమంత్రి 
 
రెండేళ్లలో ప్రత్యక్షంగా ఫలితాలు.. 
ప్రభుత్వం రెండేళ్లుగా చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అమ్మ ఒడి, గోరుముద్ద, నాడు – నేడు లాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19 వరకు (వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు) ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల సంఖ్య 70.43 లక్షలు ఉంటే ఇప్పుడది 73.05 లక్షలకు పెరిగింది. కోవిడ్‌ ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పథకాల వల్లే పెరిగిందని గర్వంగా చెబుతున్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే గత సర్కారు హయాంలోని చివరి సంవత్సరంలో కేవలం 37.20 లక్షల మంది ఉంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 43.43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మన ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల తల్లుల్లో, ప్రతి బిడ్డలోనూ విశ్వాసం పెరిగింది. ఈ ప్రభుత్వం మన మంచి కోసం పనిచేస్తోందన్న భరోసా ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. డిగ్రీ, ప్రొఫెషనల్‌ విద్యను హక్కుగా చదువుకునేలా చర్యలు చేపట్టాం. 
 
పైలాన్‌ ఆవిష్కరణ.. రెండో విడతకు శ్రీకారం
మనబడి నాడు–నేడు తొలివిడత ద్వారా 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేసిన నేపథ్యంలో సోమవారం నుంచి రెండో విడత స్కూళ్లలో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. జగనన్న విద్యాకానుక స్టూడెంట్‌ కిట్లను విద్యార్థులకు సీఎం జగన్‌ స్వయంగా అందచేశారు. విద్యాకానుక వస్తువుల నాణ్యతను పరిశీలించారు.  స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాటు విజ్ఞప్తి మేరకు తొగరపాయ బ్రిడ్జి, అప్పనపల్లి లిఫ్ట్, మొండెపు లంక చానెల్‌ ఆధునికీకరణ పనులను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు.  

అమ్మలా అన్నం.. థ్యాంక్స్‌ మామయ్యా
గతంలో స్కూల్‌కి వెళ్లేటప్పుడు అమ్మ రోజూ లంచ్‌ బాక్స్‌ పెట్టేది. జగన్‌ మామయ్య సీఎం అయిన తర్వాత మా అందరికీ రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజుకో వెరైటీ ఫుడ్‌ అందచేస్తున్న జగన్‌ మామయ్యకు చాలా చాలా థ్యాంక్స్‌. గతంలో స్కూల్‌లో బాత్‌రూమ్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రన్నింగ్‌ వాటర్‌తో పరిశుభ్రంగా ఉన్నాయి. నేను పెద్దయ్యాక మ్యాథ్స్‌ టీచర్‌ అవుతా. సీఎం మామయ్య మా కలలను నెరవేరుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది.
– ప్రణవి, 5వ తరగతి విద్యార్థిని, ఎంపీపీ స్కూల్, మొగలికుదురు 

అందరికీ నాణ్యమైన విద్య..  
జగనన్న విద్యా కానుక కిట్‌ చాలా బావుంది. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి పథకాలు గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రతీ విద్యార్థి నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. మన బడి ‘నాడు–నేడు’ విద్యార్థులకు కోహినూర్‌ వజ్రం లాంటింది. బలవర్ధకమైన భోజనం అందిస్తున్నారు. నాన్న టైలర్‌. వికలాంగుల పింఛన్‌ వస్తోంది. మా అమ్మకు రెండు సార్లు అమ్మ ఒడి వచ్చింది. ఆన్‌లైన్‌ తరగతుల కోసం మొబైల్‌ ఫోన్‌ తీసుకున్నాం. థ్యాంక్యూ జగన్‌ మామయ్యా. – కె.సాయి శరణ్య, 10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పి.గన్నవరం

సీఎం చెప్పారంటే.. చేస్తారంతే..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా మాట చెప్పారంటే చేసి తీరుతారన్న నమ్మకం ప్రజలందరిలో బలంగా ఉంది. సీఎం జగన్‌ ఏపీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపారు. నాడు – నేడు మహాయజ్ఞంలో తొలిఘట్టం పూర్తి చేసి ముందడుగు వేస్తున్న ధీరుడు. విద్య ఆవశ్యకతను చాటిచెప్పిన బీఆర్‌ అంబేడ్కర్, నెల్సన్‌ మండేలా, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ లాంటి మహనీయుల బాటలో సీఎం ముందుకు సాగుతున్నారు. గత పాలకులు ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తే జగనన్న మాట మేరకు పాఠశాలల స్థితిగతులను మారుస్తున్నారు.     – ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి  

మరిన్ని వార్తలు