పారిశ్రామిక విప్లవంలో మరో ముందడుగు

19 Jun, 2022 02:30 IST|Sakshi

23న 8 కంపెనీలు షురూ.. తిరుపతిలో ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

టీసీఎల్, డిక్సన్, ఫాక్స్‌లింక్, సన్నీ, కార్బన్‌ కంపెనీలకు ప్రారంభోత్సవం

అపాచీ పాదరక్షల తయారీ యూనిట్, ఫాక్స్‌లింక్‌ విస్తరణ, డిక్సన్‌ టెలివిజన్‌ సెట్స్‌ కంపెనీలకు శంకుస్థాపన

తద్వారా రాష్ట్రంలో రూ.3,644.32 కోట్ల పెట్టుబడులు

20,139 మందికి ఉపాధి అవకాశాలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న తిరుపతి వేదికగా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం దిశగా మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఒకేసారి రూ.3,644.32 కోట్ల విలువైన ఎనిమిది భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ 1, 2)లో ఏర్పాటు చేసిన 5 ఎలక్ట్రానిక్‌ కంపెనీల ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు మరో రెండు ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, ఒక పాదరక్షల తయారీ కంపెనీ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.

ఉత్పత్తి ప్రారంభిస్తున్న ఎలక్ట్రానిక్‌ కంపెనీల ద్వారా రూ.2,944.32 కోట్ల పెట్టుబడులు రానుండగా, ఇందులో ఇప్పటి వరకు రూ. 1,771.63 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. వీటి ద్వారా 10,139 మందికి ఉపాధి లభించనుండగా, ఇప్పటికే 3,093 మందికి ఉపాధి లభించింది. మొత్తంగా ఈ ఎనిమిది కంపెనీల ద్వారా 20,139 మందికి ఉపాధి లభించనుంది.

ఉత్పత్తి ప్రారంభించే సంస్థలు
టీసీఎల్‌–పీవోటీపీఎల్‌:  టీసీఎల్‌కు చెందిన ప్యానెల్‌ ఆప్టోడిస్‌ప్లే టెక్నాలజీ లిమిటెడ్‌ రూ.1,230 కోట్లతో డిస్‌ప్లే ప్యానెల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ ద్వారా 3,174 మందికి ఉపాధి లభించనుంది. ప్రస్తుతం ఈ యూనిట్‌ పెట్టుబడి ప్రతిపాదనల్లో రూ.1,040 కోట్లు వాస్తవ రూపం దాల్చడం ద్వారా 1,089 మందికి ఉపాధి కల్పించింది. ఈ మధ్య ట్రైల్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకొని వాణిజ్య పరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది.

డిక్సన్‌ టెక్నాలజీస్‌ : రూ.145 కోట్లతో వాషింగ్‌ మెషీన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ ద్వారా 1,131 మందికి ఉపాధి లభించనుంది. పెట్టుబడి ప్రతిపాదనలో ఇప్పటి వరకు రూ.100.80 కోట్లు వాస్తవ రూపంలోకి రావడం ద్వారా 254 మందికి ఉపాధి కల్పించింది. 

ఫాక్స్‌ లింక్స్‌ ఇండియా : రూ.1,050 కోట్లతో మొబైల్‌ ఫోన్లకు సంబంధించిన విడిభాగాలు, పీసీబీలను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటి వరకు రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 800 మందికి ఉపాధి కల్పించింది.

సన్నీ ఒప్పొటెక్‌ విస్తరణ:  రూ.280 కోట్లతో కెమెరా విడి భాగాల తయారీ యూనిట్‌ విస్తరణ చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు రూ.100 కోట్లు వ్యయం చేయడం ద్వారా 1,200 మంది ఉపాధికి గాను 50 మందికి కల్పించింది.

యూటీఎన్‌పీఎల్‌–కార్బన్‌ : రూ.130 కోట్లతో మొబైల్‌ ఫోన్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.80 కోట్ల విలువైన పెట్టబడులు వాస్తవరూపం దాల్చాయి. 1,800 మందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 900 మందికి ఉపాధి లభించింది.

భూమి పూజకు సిద్ధమైన కంపెనీలు
డిక్సన్‌ టెక్నాలజీస్‌ : రూ.108.92 కోట్లతో టెలివిజన్‌ సెట్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.

సెవెన్‌ హిల్స్‌ డిజిటల్‌ పార్క్‌ : ఫాక్స్‌ లింక్‌ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన పెట్టుబడి వివరాలు తెలియాల్సి ఉంది.

హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 298 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్ల పెట్టుబడితో పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఈ యూనిట్‌ ద్వారా 10,000 మందికి ఉపాధి లభించనుంది.  ఈ మూడు కంపెనీలకు సీఎం జగన్‌ భూమి పూజ చేయనున్నారు.

ఇకపై ప్రతి నెలా ప్రారంభోత్సవాలు
కోవిడ్‌తో గత రెండేళ్లుగా స్థబ్దుగా ఉన్న పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నెల 23న తిరుపతిలో ఎలక్ట్రానిక్, ఫుట్‌వేర్‌ యూనిట్ల ప్రారంభోత్సవం ద్వారా రాష్ట్రంలో భారీ పారిశ్రామికీకరణ విప్లవంలో మరో ముందడుగు వేయనున్నాం. ఇక నుంచి ప్రతి నెలా పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు రోడ్‌ షోలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం.
– గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి.  

మరిన్ని వార్తలు