పండుగలా.. పెంచిన పింఛన్ల పంపిణీ

30 Dec, 2021 02:26 IST|Sakshi

ప్రత్తిపాడులో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

అక్కడే పోస్టర్‌ విడుదల.. పలువురు లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ 

జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో కార్యక్రమం 

లబ్ధిదారులతో ఎమ్మెల్యేల ముఖాముఖి.. సీఎం రాసిన లేఖ అందజేత  

ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 

సాక్షి, అమరావతి: అవ్వాతాతలతో పాటు వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితరులకు రూ. 2,250 చొప్పున ఇస్తున్న పింఛనును రూ. 2,500కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలోనే పెరిగిన డబ్బులను లబ్ధిదారులకు చెల్లించనున్నట్టు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పింఛన్‌ పెంపు నేపథ్యంలో జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గోపాలకృష్ణ ద్వివేది మరో ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

► జనవరి 1న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లను విడుదల చేయనున్నారు. స్థానికంగా కొందరు లబ్ధిదారులకు పెరిగిన పింఛను డబ్బులను రూ. 2,500ల చొప్పున పంపిణీ చేస్తారు.  
► తొలి రోజు అన్ని జిల్లాల్లోనూ జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ, రైతు భరోసా కేంద్రాల వద్ద కూడా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.  
► ఒకటో తేదీ నుంచి 5వ తేదీ మధ్య జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులందరూ స్వయంగా పాల్గొంటారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలు చేపడుతూనే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొంతమంది లబ్ధిదారులతో ముఖాముఖీగా సమావేశమై, లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా రాసిన లేఖలను వారికి పంచిపెడతారు.  
► పింఛన్ల పెంపునకు సంబంధించి పోస్టర్లను అన్ని మండల, తహసీల్దార్, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాలతో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తారు. ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు, మున్సిపల్‌ కమిషనర్‌లతో పాటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బుల పంపిణీ చేస్తారు.  

1,41,562 మందికి కొత్తగా పింఛన్లు.. 
రాష్ట్ర వ్యాప్తంగా 1,41,562 మందికి ప్రభుత్వం జనవరి నెల నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు గోపాలకృష్ణ ద్వివేది తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు కూడా ఒకటో తేదీ నుంచి డబ్బులు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.     

మరిన్ని వార్తలు