ప్రతి గడపకూ ప్రభుత్వ సేవలు

18 Aug, 2020 03:47 IST|Sakshi
సచివాలయాల్లో డిజిటల్‌ సేవలను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్‌ సేవలను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

అత్యంత సులభంగా, సురక్షితంగా, వెంటనే చెల్లింపులు

లావాదేవీ జరిగిన వెంటనే మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌

15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో కెనరా బ్యాంకు, ఎన్‌పీసీఐ సహకారంతో యూపీఐ సేవలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గడప వద్దకూ ప్రభుత్వ సేవలు, పరిపాలనను తీసుకువెళ్లాలన్నదే తమ లక్ష్యమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దీనికోసమే గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వలంటీర్ల వ్యవస్థను తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయాల్లో .డిజిటల్‌ పేమెంట్‌ సేవలను ప్రారంభించారు. దీనిద్వారా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత సులభంగా, సురక్షితంగా, డిజిటల్, క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. లావాదేవీ జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తి మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ అందుతుంది. కెనరా బ్యాంకు, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో సచివాలయాల్లో  యూపీఐ సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

► గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా  545కిపైగా సేవలందిస్తున్నాం. ప్రతి 50  కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి వారికి బాధ్యతను అప్పగించాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థను తెచ్చాం. కెనరా బ్యాంకును అభినందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా.

► కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్‌లో కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఎల్‌.వి.ప్రభాకర్, ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో దిలీప్‌ అస్బే పాల్గొన్నారు.

భాగస్వామి కావడం సంతోషంగా ఉంది
‘రాష్ట్రంలో సామాన్యుడికి కూడా డిజిటల్‌ చెల్లింపులు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 15004 సచివాలయాల్లో క్యూఆర్‌ కోడ్‌ విధానంలో చెల్లింపులు చేసే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు భాగస్వామి కావడం సంతోషంగా ఉంది’ 
– ఎల్‌.వి. ప్రభాకర్, ఎండీ, సీఈవో, కెనరా బ్యాంకు

చరిత్రాత్మకం
‘సచివాలయాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ తేవడం చరిత్రాత్మకం. కోవిడ్‌ 19 సమయంలో డిజిటల్‌ పేమెంట్స్‌ పెంచడంపై దృష్టి సారించాం. జూలైలో దేశంలో 149 కోట్ల లావాదేవీలు జరిగాయి’
– దిలీప్‌ అస్బే ఎండీ, సీఈవో, ఎన్‌పీసీఐ

>
మరిన్ని వార్తలు