అబలకు అభయం

24 Nov, 2020 03:22 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో సోమవారం అభయం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో హోంమంత్రి సుచరిత

మహిళలు, పిల్లల భద్రతకు ‘అభయం ప్రాజెక్టు’ 

క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మహిళల అభ్యున్నతికి సువర్ణాక్షరాలతో లిఖించేలా ప్రభుత్వం కార్యక్రమాలు 

ఆర్థిక, రాజకీయ స్వావలంబనే లక్ష్యం..వారి కోసం ఇప్పటికే దిశ బిల్లు, యాప్‌  

ఆటోలు, ట్యాక్సీలు నడిపే సోదరులపై విశ్వాసం పెంచేందుకే అభయం యాప్‌ 

సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మల ఆర్థిక, రాజకీయ స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ, భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మహిళల అభ్యున్నతికి సువర్ణాక్షరాలతో లిఖించదగే కార్యక్రమాలను గత 17 నెలల కాలంలో చేపట్టామన్నారు. ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అభయం ప్రాజెక్టు’ (యాప్‌)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలుత విశాఖలో పైలట్‌ ప్రాజెక్టుగా 1,000 ఆటోలలో ట్రాకింగ్‌ పరికరాలను ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి విజయవాడ, తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి లక్ష వాహనాల్లో ట్రాకింగ్‌ డివైజ్‌లు అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘అభయం’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్, హోంమంత్రి సుచరిత, అధికారులు 

నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం..
‘‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు అండగా మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసింది. నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునేలా పనిచేస్తున్నాం. అమ్మ ఒడి పథకం, ఆసరా, చేయూత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో సాయాన్ని జమ చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన చేకూర్చి చరిత్రలో నిలిచే ఘట్టం ఆవిష్కృతమవుతోంది.

సగం మహిళలకు కేటాయిస్తూ చట్టాలు..
నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా ఏకంగా చట్టాలు చేసిన ప్రభుత్వం మనది. రాజకీయంగా అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాం. హోంమంత్రిగా నా చెల్లెమ్మ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరొక చెల్లెమ్మ ఉండడం మహిళల రాజకీయ సాధికారతకు నిదర్శనం.

ఆ మాటలను మరువలేదు..
రక్షణ, భద్రత విషయంలో రాజీ పడొద్దు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలతో నా మొట్టమొదటి కాన్ఫరెన్సులో చెప్పిన మాటలు గుర్తున్నాయి. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు ప్రవేశపెట్టి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ఈరోజు ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లు కనిపిస్తున్నాయి. దిశ కోర్టుల్లో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఉండే విధంగా ప్రభుత్వం నామినేట్‌ చేసింది. దిశ యాప్‌ బటన్‌ నొక్కిన 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విధంగా చర్యలు తీసుకున్నాం. సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించాం. మహిళా పోలీసు మిత్రలను కూడా తయారు చేస్తున్నాం. 

మరో అడుగు ముందుకు.. 
ఇవాళ మహిళల కోసం ‘అభయం’ కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్నాం. ఇది ఒక యాప్‌ లేదా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ప్రాజెక్టు అనుకోవచ్చు. దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తుండగా అభయం యాప్‌ (ప్రాజెక్టు) రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అక్క చెల్లెమ్మలు, చిన్నారులు ఆటోలు, టాక్సీలలో  నిర్భయంగా ప్రయాణించేందుకు, ప్రయాణ సమయంలో ఏ ఆపద రాకుండా చూసేలా అభయం ఐవోటీ ఉపకరణాన్ని ఆటో, టాక్సీల్లో అమరుస్తాం. ఆటోలు, టాక్సీలు నడిపే సోదరుల మీద నమ్మకం లేక ఇదంతా చేయడం లేదు. వారిపై ప్రయాణికులకు మరింత నమ్మకం కల్పించి నిశ్చింతంగా ఉండేందుకే ఈ ఏర్పాటు. 

ఏమిటీ ‘అభయం’?..
ఆటోలు, టాక్సీల్లో ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ఉపకరణాన్ని అమరుస్తారు. ఆటో / టాక్సీ ఎక్కిన వెంటనే అక్క చెల్లెమ్మలు  స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసుకుంటే వెంటనే పూర్తి వివరాలు నమోదవుతాయి. ఏదైనా ఆపద సమయంలో వారివద్ద స్మార్ట్‌ ఫోన్‌ లేకుంటే రెడ్‌ బటన్‌ నొక్కితే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని ఆదుకుంటారు. 

క్యాబ్‌లకు ధీటుగా భద్రత...
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నాటికి 5 వేల వాహనాల్లో, జూలై 1 నాటికి 50 వేల వాహనాల్లో, నవంబరు నాటికి లక్ష వాహనాల్లో అభయం ఐవోటీ ఉపకరణాలను ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉబెర్, ఓలా లాంటి బహుళ జాతి సంస్థల క్యాబ్‌లకు ధీటుగా ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారనే విశ్వాసం కలుగుతుంది. ఇలా అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నా’’

సోదరుడిలా అండగా సీఎం
– మేకతోటి సుచరిత, హోంమంత్రి
‘మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలలు, మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో చర్యలు చేపట్టారు. దిశ చట్టం, సైబర్‌ మిత్ర, మహిళా మిత్రల ద్వారా భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు అభయం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ అంటే మహిళలకు ఒక అభయ హస్తం మాదిరిగా, ఒక సోదరుడిలా అండగా నిలిచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’

ఎర్ర బటన్‌ నొక్కగానే ఇంధనం బంద్‌
అభయం ఐఓటీ ఉపకరణంలో రెడ్‌ బటన్‌ నొక్కగానే అలారమ్‌ మోగడంతోపాటు వాహనానికి ఇంధన సరఫరా నిల్చిపోతుందని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వివరించారు. అభయం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పోలీసు, రవాణా శాఖలకు చెందిన పలువురు సీనియర్‌  అధికారులు పాల్గొనగా జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.  

భద్రతపై నిశ్చింత..
అభయం పానిక్‌ బటన్‌పై మా కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇది చూసిన తర్వాత మాకు భద్రత ఉంటుందనే నమ్మకం కలిగింది. యాప్‌ను ఇప్పటికే సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నాం.
  – గమ్య, డిగ్రీ విద్యార్థిని, విశాఖపట్నం

అలా చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు..
కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నుంచి అభయం ప్రాజెక్టు మొదలైంది. ఆర్నెల్లుగా పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశాం. దీనిద్వారా మహిళలు, బాలికలకు మరింత భద్రత ఉంటుంది. అభయం డివైజ్‌ను ఎవరైనా డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసి వాహనాన్ని సీజ్‌ చేస్తాం’
– జీసీ రాజారత్నం, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్, విశాఖపట్నం 

మరిన్ని వార్తలు