ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం..

16 Jan, 2021 15:59 IST|Sakshi

వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన సీఎం జగన్‌

సాక్షి, విజయవాడ: సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్ వర్కర్లు నాగజ్యోతి, జయకుమార్‌, స్టాఫ్ నర్సు మరియమ్మ, డా.ప్రణీతలకు వ్యాక్సిన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నారు. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ  చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు) అందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు. చదవండి: వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ 

మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. చదవండి: మనసున్న మారాజు మా జగనన్న..

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు