‘జగనన్న తోడు’  ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

25 Nov, 2020 11:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శంకర్‌నారాయణ, ఆదిమూలపు సురేష్‌ సహా ఇతరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పలెల్లో, పట్టణాల్లో, వీధివీధికీ చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

‘‘పాదయాత్రలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నవారిని దగ్గరగా గమనించాను. టిఫిన్‌ అమ్మకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు తెల్లవారుజామున 4 గంటలకే సేవలు అందిస్తారు. ఎండకు, వానకు, చలికి తట్టుకుని కూరగాయలు, పూలు అమ్మేవాళ్లు... ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు అందిస్తన్నవారికి ఈ స్కీం. మోపెడ్లపై దుస్తులు, సామాన్లు అమ్ముకునేవారు గానీ, బండ్లపై టిఫిన్లు అమ్ముకునేవారి సేవలు లేకపోతే అనేకమందికి గ్రామాల్లో, పట్టణాల్లో కడుపునిండని పరిస్థితి ఉంటుంది. ఇంటిముందుకే వస్తువులు, సరుకులు వచ్చే పరిస్థితి ఉండదు.

వారి బతుకు బండే కాదు, మన ఆర్థిక వ్యవస్థకూడా నడవదు. అందుకే వీరిని మహనీయులుగా చూడాలి. పోటీ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాపారాలకు లోన్లు దొరక్క పెద్ద పెద్ద వడ్డీలకు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. వీరంతా స్వయం ఉపాధి పొందేవాళ్లే. అంతేకాదు వీలైతే ఒకరికో, ఇద్దరికో ఉపాధి కల్పిస్తారు. వస్తువులు, సరుకులు తెచ్చుకునే క్రమంలో ఆటోలు లాంటి వాటికి, కూలీలకు పని కల్పిస్తారు. పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి చూపిస్తున్నారు. అసంఘటిత రంగంలో వీరు పనిచేస్తున్నారు కాబట్టి, బ్యాంకులనుంచి కూడా రుణాలు అందే పరిస్థితి లేదు. పెట్టుబడికి డబ్బులు కావాలి అంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తక్కువ వడ్డీకి పెట్టుబడి దొరికే పరిస్థితి కూడా లేదు. పెట్టుబడికి 3,4,5, కొన్ని సందర్భాల్లో 10 రూపాయల వడ్డీకి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి.

ఇలాంటి వారందరి జీవితాల్లో మార్పులు రావాలని పాదయాత్రలో వారిని చూసినప్పుడు అనుకున్నా. వీరికి అన్నగా, తమ్ముడిగా...  చేయూత నివ్వాలని అనుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. గతంలో వీరి చేయిపట్టుకుని నడిపించే పరిస్థితి లేదు. వార్డుల్లో , గ్రామాల సచివాలయాల్లో వాలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు వీరికి తోడుగా నిలబడుతున్నారు. లబ్ధిదారులను గుర్తించండం దగ్గర నుంచి, వీరి దరఖాస్తులు తీసుకోవడం దగ్గరనుంచి, బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో మాట్లాడ్డం, వారిని ఒప్పించడం, పారదర్శక విధానంలో లబ్ధిదారులను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ... నమ్మకం కలిగింది. బ్యాంకులు దాదాపుగా 10 లక్షలమందికి రూ.1000 కోట్లు ఇస్తాయి. 

రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 100 కోట్ల రూపాయలు వడ్డీ కింద ఏడాదికి చెల్లిస్తుంది. పదేళ్లలో 1000 కోట్లు చెల్లిస్తుంది. అప్పులు పాలవుతారు, ఇబ్బందుల పాలు అవుతారని చిరు వ్యాపారులను అదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి వారికి తోడుగా నిలిచే కార్యక్రమం చేసింది. 10 లక్షల మందికి దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయలను వడ్డీలేని రుణాలకింద బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నాం. 7 నుంచి 10 రోజుల్లోనే దాదాపు 10లక్షలమంది బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జమ అవుతుంది. కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బలి వీణ, బుడి ఇత్తడి, కళంకారీ, ఇతర హస్త కళలల్లో ఉన్నవారికి కూడా రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తుంది. గడువులోగా తిరిగి చెల్లిస్తే.. బ్యాంకులకు, చిన్న వ్యాపారాలకు, హస్తకళాకారులకు ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్కసారి చెల్లించిన వారు తిరిగి వడ్డీలేని రుణాలు పొందడానిక అర్హులు. ఏడాదిలోగా కట్టేసిన వారికి తిరిగి వడ్డీలేని రుణాలు వస్తాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది:

అర్హత ఉన్నవాళ్లందరికీ
‘‘లబ్ధిదారుల జాబితాను ఇదివరకే ప్రకటించాం. ఈ పథకంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మీపేరు ఉందో, లేదో చూసుకోండి. లేకపోతే దరఖాస్తు చేసుకోండి, పరిశీలన చేసి నెలా, 2 నెలల్లోపే వీరందరికీ కూడా న్యాయం జరుగుతుంది. నెలరోజుల వరకూ ఈస్కీం పొడిగించబడుతుంది. ఎవ్వరికీ కూడా ఎగరగొట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నదే ఆలోచన’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు