సీఎం సంకల్పం.. వారి కల సాకారం

20 Nov, 2020 20:07 IST|Sakshi

సీఎం సంకల్పంతో తీరనున్న మత్స్యకారుల కలలు

నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన

మిగిలిన 4 నిర్మాణాలకూ ముమ్మరంగా చర్యలు 

మొత్తంగా 8 ఫిషింగ్‌ హార్బర్లకు రూ.3 వేల కోట్ల ఖర్చు

నియోజకవర్గానికో ఆక్వా హబ్‌ నిర్మాణ కార్యక్రమానికి రేపు ముఖ్యమంత్రి శ్రీకారం

దీని కోసం రూ.225 కోట్లు ఖర్చు, మొదటగా 25 హబ్‌ల నిర్మాణం

సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు సమకూర్చే బృహత్తర ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ రేపు (శనివారం) శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంతంలో తొలి దశలో నిర్మించనున్న 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. త్వరలో మిగిలిన నాలుగు చోట్ల కూడా పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుదీర్ఘ పాదయాత్ర సమయంలో క్షేత్రస్థాయిలో మత్స్యకారుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, వారికి మెరుగైన మౌలిక వసతులను కల్పించడంకోసం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. (చదవండి: సీఎం జగన్‌కు ధన్యవాదాలు: మాబున్నీసా)

తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్‌కు ముఖ్యమంత్రి రేపు  వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు.  ఈ 4 ఫిషింగ్‌ హార్బర్లకోసం సుమారు రూ. 1510 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే వీటికోసం టెండర్లను ఆహ్వానించారు.  డిసెంబర్‌ రెండో వారంలో వీటిని ఖరారు చేస్తారు. (చదవండి: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్‌)

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి రూ. 289 కోట్లు, నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి రూ. 451 కోట్లు, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి రూ. 348 కోట్లు, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి రూ. 422 కోట్ల రూపాయలు, మొత్తంగా రూ.1510 కోట్లు తొలిదశ ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారు. దీని తర్వాత త్వరలో మరో 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్‌ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తంగా 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి సుమారు రూ.3వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 

దీంతోపాటు రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వాహబ్‌ చొప్పున నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం రూ. 225 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలిదశలో భాగంగా 25 ఆక్వాహబ్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చి దేశీయంగా వినియోగం పెంచడంకోసం, పౌష్టికాహార భద్రత కల్పించడంకోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. లైవ్‌ ఫిష్, తాజా చేపలు, డ్రై చేసిన చేపలు, ప్రాసస్‌ చేసిన చేపలు, రొయ్యలు, పీతలు ఇతర మత్స్య ఉత్పత్తులు ఇందులో లభిస్తాయి. మత్స్య, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ హబ్‌లను జనతాబజార్లతో అనుసంధానం చేయనున్నారు. ఆక్వా రైతుల సొసైటీలు ఈ హబ్‌లను నిర్వహిస్తాయి. సమీప ప్రాంతంలో రైతులు, మత్స్యకారుల నుండి చేపలు, రొయ్యలు సేకరించి హబ్‌లకు, తద్వారా జనతాబజార్లకు సరఫరా చేస్తారు.

మరిన్ని వార్తలు