సోమశిల చివరి ఆయకట్టు రైతుల కల సాకారం

9 Nov, 2020 11:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-2కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-2కు వర్చువల్‌ విధానంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. కాగా.. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -1 నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా.. 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్‌-2 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంత వాసులు కలలుగన్న సాగునీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని ఆ ప్రాంతవాసులు ఆనందాన్ని వ్యక్తం​ చేస్తున్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వ్యవసాయం, నీటి విలువ తెలిసిన ప్రభుత్వం మాది. సోమశిల రెండో దశ ద్వారా సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో సోమశిలను ఎన్నికల కోసం హడావుడిగా ప్రారంభించారు. అవినీతి లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం. సోమశిల హైలెవల్ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్‌ ద్వారా 68 కోట్ల రూపాయలు ఆదా చేసి.. గత ప్రభుత్వం అవినీతికి చెక్ పెట్టాం. సంగం బ్యారేజీ, పెన్నా బ్యారేజ్ పనులు ఈ ఏడాది పూర్తిచేసి, జనవరిలో నెల్లూరుకి అంకితం ఇస్తాం. కండలేరు కాలువ దుబ్లింగ్ పనులు, సోమశిల ఉత్తర కాలువ డబ్లింగ్ పనులు ప్రారంభిస్తాం. 2022 ఖరీఫ్ సీజన్‌కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. 2021లో ఆరు ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నాం. కృష్ణా నది దిగువ బ్యారేజీలకు వేగవంతంగా అడుగులు వేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి చేస్తాం. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.40 వేల కోట్లతో కరువు నివారణ చర్యలు చేపడుతున్నాం అని సీఎం జగన్‌ తెలిపారు.

మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద సోమశిల హైలెవల్ కెనాల్ పేజ్-2 పనుల ప్రారంభంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సోమశిల హైలెవల్ కెనాల్ ఈ ప్రాంత రైతుల కల. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి హైలెవల్ పేజ్ 2ను ప్రారంభిస్తున్నారు. వెలిగొండ కూడా పూర్తయితే కరువు ప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ముఖ్యమంత్రి పాదం పెట్టిన వేళా విశేషం రాష్ట్రం సుభిక్షంగా ఉంది. సోమశిల హైలెవల్ ఫేజ్‌- 2, వెలిగొండ ప్రాజెక్ట్స్ పూర్తయితే ఇక సస్యశ్యామలమే. త్వరలో చాగోలు రిజర్యాయర్ కూడా పూర్తి చేస్తాం. పదేళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో వరదలు పోటెత్తాయి. పెన్నా నుంచి 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది' అని అన్నారు.

ఈ దశలో దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లో 46,453 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ ప్రాంతంలో ఉన్న అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి.. తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ మండలాల్లో 90 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎస్‌హెచ్‌ఎల్‌ఎల్‌సీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ కింద 43,547 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. రూ.840.72 కోట్ల వ్యయం కాగల పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇప్పటివరకు రూ.572.11 కోట్లను ఖర్చు చేసింది. అటవీ శాఖకు చెందిన 4.28 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను పూర్తి చేసి.. మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు