టీటీడీ చిన్నారుల ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన 

6 May, 2022 03:54 IST|Sakshi
ఆసుపత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం

అలిపిరి వద్ద ఆరు ఎకరాల్లో రూ.300 కోట్లతో సూపర్‌ స్పెషాలిటి హాస్పిటల్‌ 

‘బర్డ్‌’లో గ్రహణం మొర్రి, చెవుడు, మూగ చికిత్సల వార్డులు ప్రారంభం 

శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, సాలిడ్‌ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ తిరుపతిలో నిర్మించే శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలిపిరి వద్ద ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో 4,11,325 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మిస్తోంది.  

► శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, స్మైల్‌ట్రైన్‌ కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ దృశ్య మాలికను  సీఎం పరిశీలించారు. వైద్యులు, గుండె ఆపరేషన్లు చేయించుకున్న చిన్న పిల్లల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
► ఎస్వీబీసీ ఆన్‌లైన్‌ రేడియో లోగోను  ఆవిష్కరించారు.
► బర్డ్‌ ఆస్పత్రిలో గ్రహణం మొర్రి, చెవుడు, మూగ చికిత్సల వార్డులను సీఎం లాంఛనంగా ప్రారంభించారు.
► తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో టీటీడీ సహకారంతో నగరంలోని శ్రీనివాసం సర్కిల్‌ నుంచి వాసవి భవన్‌ సర్కిల్‌ వరకు తొలిదశలో నిర్మించిన 3 కి.మీ మేర వంతెన శ్రీనివాస సేతు ప్రారంభ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.
► తిరుపతి నగర పాలక సంస్థ రూ.83.7 కోట్లతో నిర్మించిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఐదు ప్లాంట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో తడిచెత్త నుంచి గ్యాస్‌ తయారీ, ఎరువుల తయారీ, డ్రైవేస్ట్‌ రీ సైక్లింగ్, భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్, 25 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన భూగర్భ డ్రైనేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఉన్నాయి.  

డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డికి సీఎం సత్కారం  
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి హృదయాలయంలో 300 మందికి పైగా చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందచేశారు. బర్డ్‌ ఆసుపత్రిలో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్సలకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్మైల్‌ ట్రైన్‌ సంస్థ నిర్వాహకురాలు మమత కౌరల్‌ను ముఖ్యమంత్రి శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు. శ్రీపద్మావతి చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ సందర్భంగా గురువారం అలిపిరి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరి సేవలను సీఎం జగన్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు.   

మరిన్ని వార్తలు