సీఎం జగన్‌ లేఖకు 24గంటల్లో కేంద్రం స్పందన

12 Apr, 2021 22:39 IST|Sakshi

గన్నవరం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను గన్నవరం విమానాశ్రయానికి తరలించింది. సోమవారం రాత్రికి గన్నవరం విమానాశ్రయానికి 4 లక్షల 40 వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ చేరుకున్నాయి. లేఖ రాసిన 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ పంపడంతో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికే రెండు లక్షల కోవాగ్జిన్ వ్యాక్సినేషన్‌లు రానున్నాయి. 

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నాలుగు లక్షల నలభై వేల కోవిషిల్డ్ వ్యాక్సిన్లు అన్ని జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వ్యాక్సిన్‌లను ప్రతి జిల్లాకు పంపించి, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వివరించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్స్, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని, కరోనా వ్యాప్తి నివారణకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

చదవండి: వామ్మో రెండు లక్షల కేసులు

మరిన్ని వార్తలు