కేంద్రమంత్రులు షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు సీఎం జగన్‌ లేఖ

5 Jul, 2021 12:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి సీఎం వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే.. రాయలసీమ లిఫ్ట్‌ సందర్శించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని ఆదేశించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ లేఖ
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని’’ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ లిఫ్ట్‌ను పరిశీలిస్తామని పదేపదే కేఆర్‌ఎంబీ కోరుతోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే రాయలసీమ లిఫ్ట్‌ సందర్శించేలా కేఆర్‌ఎంబీని ఆదేశించాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, కేంద్ర జలశక్తి, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అనేక ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఏపీ పట్ల కేఆర్‌ఎంబీ వివక్షతో వ్యవహరిస్తోందని, తెలంగాణ తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం కేఆర్‌ఎంబీ వేగంగా స్పందిస్తోందన్నారు. ఏపీ ఇచ్చిన ధర్మబద్ధమైన ఫిర్యాదులను కేఆర్‌ఎంబీ పట్టించుకోవడంలేదని సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు. 

‘‘శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని’’ సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ 
రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు రాసిన లేఖలో  సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘జూన్‌ 1 నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్‌ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోంది.

విద్యుత్‌ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించింది. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని’’ లేఖలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో సీఎం జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు