వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలి

18 Aug, 2020 03:23 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో అధికారులు

ముమ్మరంగా సహాయక చర్యలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం 

ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి 

ఉభయ గోదావరి కలెక్టర్లతో సీఎం సమీక్ష 

సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ముమ్మరంగా సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. గోదావరి వరదలపై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి తూర్పుగోదావరి కలెక్టర్‌ మురళీధర్, పశ్చిమ గోదావరి కలెక్టర్‌ ముత్యాలరాజుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎలాంటి లోటు రాకూడదు: సీఎం జగన్‌
► వరద బాధితులకు సహాయక శిబిరాల్లో సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది, లోటు రాకుండా చర్యలు తీసుకోవాలి. మంచి భోజనం అందించాలి. నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
► వరద ఉన్నంతకాలం నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. సీఎంవో అధికారులు పాల్గొనగా ఎమ్మెల్యే బాలరాజు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా హాజరయ్యారు.

20 లక్షల క్యూసెక్కుల వరద అంచనా: తూర్పుగోదావరి కలెక్టర్‌ మురళీధర్‌
► గోదావరి వరద ప్రవాహంతో దాదాపు 5 బ్రిడ్జిలు మునిగిపోయాయి. 13 మండలాల్లో వరద ప్రభావం ఉంది. 161 గ్రామాలలో ముంపు పరిస్థితి నెలకొంది. అమలాపురంలో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 20 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వస్తుందనే అంచనాతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం. ఇప్పటివరకూ 63 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశాం. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.
► శాటిలైట్‌ ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు ఇప్పటికే వచ్చాయి. నిత్యావసర సరుకులు, వస్తువులు తరలించడానికి, ఇతరత్రా అవసరాల కోసం 14 లాంచీలు సిద్ధం చేశాం. మరో 86 బోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వరద తగ్గిన తర్వాత పంట నష్టంపై అంచనా వేస్తాం.

30 గ్రామాల్లో ప్రభావం: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు
► పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి 7 మండలాల్లో 30 గ్రామాల పరిధిలో వరద ప్రభావం ఉంది. ముంపు గ్రామాల నుంచి బాధితులను తరలించాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మూడుచోట్ల సిద్ధం చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు అందుబాటులో ఉన్నాయి. పాము కాటు బాధితుల కోసం మందులు సిద్ధంగా ఉంచాం. 
► పోలవరం వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న నాలుగు చోట్ల ఇసుక బస్తాలతో పటిష్టంచేశాం.  గట్టుకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  

>
మరిన్ని వార్తలు